మినీమహానాడు వేదికగా ఆ టీడీపీ సీనియర్ లీడర్ కమ్ ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు. మంత్రులకో న్యాయం, మాకో మరో న్యాయమా….? అంటూ పార్టీ డైరెక్ట్‌గా అధిష్టానాన్ని నిలదీశారు. ఎందుకీ వివక్ష అన్న ప్రస్తావన లేవనెత్తిన ఆ సీనియర్ శాసనసభ్యుడు ఎవరు? మిస్టర్ కూల్ ఇమేజ్ వున్న ఆ మాజీమంత్రి ఎందుకు బరస్ట్ అయ్యారు? ఎవరిమీద ఆయన ఆక్రోశం? ఉత్తరాంధ్ర టీడీపీలో…. సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తిది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. మండలాధ్యక్షుడి నుంచి మంత్రి వరకు నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో చాలా చూశారాయన. తన కెరీర్‌లో ప్రత్యర్ధుల కంటే సొంత పార్టీ నేతలతో సాగించిన అంతర్గత పోరాటాలే ఎక్కువని చెప్పుకుంటారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. టీడీపీకి కష్టకాలంలోనూ వెన్నంటే వున్న కొద్దిమంది నేతల్లో ఒకరిగా చెప్పుకుంటారు. కానీ… ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండి కూడా…. జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో మారుతున్న ప్రాధాన్యతలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్లోనూ కోతపడ్డంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టు సమాచారం. అనకాపల్లి జిల్లా మినీ మహానాడు వేదికగా బండారు చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. పూర్తి వ్యవసాయ ఆధారితమైన ‘మాడుగుల, చోడవరం” నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మె ల్యే….మాటల తూటాలు పేల్చారు. పార్టీ వేదిక కనుక తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతున్నా అంటూనే… నేతలను టార్గెట్ చేయడం పార్టీలో అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోందని అంటున్నారు. జిల్లాలో మంత్రి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల అభివృద్ధికి ఎక్కువ నిధులు విడుదల అవుతున్నాయట. వాళ్ళకు ప్రభుత్వంలో వున్న పరపతిని ఉపయోగించుకుని ఫం డ్స్ తెచ్చుకుంటుండగా….పొజిషన్లో వున్నారు కనుక సీఎస్ఆర్ కింద ఫండ్ ఇచ్చే వాళ్ళు ముందుకు వస్తున్నారట. ఇక, మున్సిపాల్టీలు వున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల కొరత ఎక్కువగా ఉందనేది ఈ సీనియర్ నేత భావన అట. ఇక.. పూర్తి గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రజలు వుండే మాడుగుల వంటి చోట నిధులు ఇవ్వమని కోరినా సానుకూలత రాకపోవడంతో మండిపోతున్నారట బండారు. ఎందుకు ఎమ్మెల్యే అయ్యానో…. అర్ధం కావడంలేదని అనడం ద్వారా ద్వారా పెద్ద చర్చే పెట్టారు బండారు. వాస్తవానికి సత్యనారాయణమూర్తిలో ఈ అసహనం ఇప్పటిది కాదు. పార్టీ కోసం కష్టపడేవాళ్ళకు పూర్తిస్ధాయి గౌరవం దక్కడం లేదన్న అభిప్రాయం ఆయనలో బలంగా ఉంది.
ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో చాలా సవాళ్ళనే ఎదుర్కొన్నారాయన. టీడీపీ వాణిని బలంగా వినిపించే క్రమంలో అప్పటి మంత్రి రోజాపై చేసిన రాజకీయ విమర్శలు పెనుదుమారం రేపగా….అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యి కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక 2024ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ కూడా రాదనే ప్రచారం జరగ్గా…. చివరికి అధినాయకత్వంతో పోరాడి సీటు దక్కించుకోవాల్సి వచ్చింది. అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి టిక్కెట్ కోసం ఆఖరి నిముషం వరకు పట్టుబట్టగా….కూటమి ధర్మం అడ్డం అయింది. ఆ స్ధానాన్ని జనసేనకు రిజర్వ్ చేసినందున ఎమ్మెల్సీ ఇస్తామని చేసిన ప్రతిపాదనపై కారాలు మిరియాలు నూరేశారు ఈ సీనియ ర్ నేత. పార్టీని నమ్ముకుంటే గొంతుకోశారని సన్నిహితుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి…అలక పాన్పు ఎక్కేయడంతో అధిష్టానం బుజ్జగించింది. చివరికి ఎన్నికలకు 21 రోజుల ముందు నియోజకవర్గం మార్చి మాడుగులకు వెళ్ళిన బండారు….. కూటమి బలం, తన రాజకీయ అనుభవంతో గట్టెక్కారు. తెలుగుదేశం పార్టీ మీద, తన మీద నమ్మకంతో ఓట్లేసిన జనం కోసం నిధులు ఇమ్మంటే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదన్నది ప్రస్తుతం ఆయన బాధ అట. అదంతా ఒక ఎత్తెతే…..ఆ దిశగా అడ్డుపుల్లలు వేస్తున్న వాళ్ళకు గట్టి ఝలక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే… బండారు మినీ మహానాడు వేదికగా ఇలా బహిరంగ బాంబ్ పేల్చినట్టు చెప్పుకుంటున్నారు పార్టీలో. కారణాలు ఏవైనా సీనియర్లు గొంతు సవరించుకోవడం తెలుగుదేశానికి ఊహించని పరిణామం. తమ అభి ప్రాయాలను బలంగా చెప్పేందుకు సంకోచించకపోవడం చూస్తుంటే పార్టీలో ఉక్కపోత…ప్రజలకు న్యాయం చేయాలేకపోతున్నామనే అసహనం పెరుగుతున్నాయన్న అభిప్రాయం వుంది. మినీమహానాడులో బండారు సంధించిన నిధుల అస్త్రం ఫలిస్తుందా….?. లేక పార్టీ లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే…..!!.