Off The Record: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడ్డ తెలంగాణ బీజేపీని పైకి లేపి పరుగులు పెట్టించడానికి పార్టీ అధిష్టానం కిందా మీదా పడుతోందట. అసలే కర్ణాటక రిజల్ట్స్ తర్వాత అల్లల్లాడుతున్న పార్టీ బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాక ఇంకా గందరగోళంలో పడిందన్నది అంతర్గతంగానే ఉన్న అభిప్రాయం. ఇప్పుడా ముసుగును లాగేసి మెరుపులు మెరిపించే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. అధికారం తర్వాత …అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఇలాగే ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా డోలాయమానంలో ఉంటే….గౌరవప్రదమైన సీట్లు కూడా కష్టమన్న చర్చ పార్టీలోనే పెరిగిపోవడంతో అలర్ట్ అయి వరుస కార్యక్రమాలతో లీడర్స్, కేడర్ జనంలో ఉండేలా ప్లాన్ చేసిందట. ఓవైపు సెంటిమెంట్‌ను రగులుస్తూనే… మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేయాలన్నది ప్లాన్‌గా చెబుతున్నారు. అందులో భాగంగా…. ముందు గ్రామ స్థాయి ఆందోళనలకు పిలుపునిచ్చింది పార్టీ. అదే సమయంలో నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి పార్టీ గురించి తిరిగి అంతా మాట్లాడుకునేలా చేయాలనుకుంటున్నారట. అక్టోబర్‌దాకా జరిగే ఈ కార్యక్రమంలో యువతను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారిని భాగస్వాముల్ని చేసి అర్బన్ పార్టీ ముద్రను చెరిపేసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది.
అలాగే.. స్వాతంత్ర్య సమరయోధులను, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన జాతీయ వాదులను, దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్‌లు, పోలీసులను స్మరించుకుంటూ… భారీగా కార్యక్రమాలను అమలు చేసే ప్లాన్ ఉంది. ఓవైపు ఇలా సెంటిమెంట్ రగిల్చే కార్యక్రమాలు చేపడుతూనే… మరోవైపు కేసీఆర్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించబోతోంది. బీఆర్‌ఎస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విమక్తి కల్పన పేరుతో వరుస కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దళిత బంధు, రైతు బంధు, నిరుద్యోగ భృతి ఇచ్చి తీరాలన్న డిమాండ్‌తో పల్లె బాట, బస్తీ బాట కార్యక్రమాలు, డివిజన్ వారీ ఆందోళనలు నిర్వహించ బోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకో, ఎమ్మెల్యేలు, మంత్రుల ఘెరావ్, కలెక్టరేట్‌ల ముట్టడి లాంటి కార్యక్రమాలతో ఈనెలంతా పార్టీ కేడర్ బిజీగా ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైందట. దాంతో పాటు మిలియన్ మార్చ్‌ని తలపించేలా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో కార్యక్రమం ఉంటుందని అంటున్నారు.
అంటే… ఈ ఆందోళనలతో తెలంగాణ బీజేపీ తన మీదున్న బీ టీమ్ ముద్రను చెరిపేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు పరిశీలకులు. టీ బీజేపీ బీఆర్‌ఎస్‌కు బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని, నువ్వు కొట్టినట్టు యాక్షన్ చెయ్యి, నేను ఏడ్చినట్టు నటిస్తానన్నట్టుగా రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ఈ భావన ప్రజల్లో బలపడక ముందే… తాము భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మచ్చల్ని చెరిపేసుకోవాలని అనుకుంటున్నారట పార్టీ అగ్ర నాయకులు. మరి ఆప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇటు ఆందోళ కార్యక్రమాలు నిర్వహిస్తూనే… అటు 119 నియోజకవర్గాల్లో వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు విజయ సంకల్ప యాత్రలు చేపట్టాలని డిసైడైంది టీ బీజేపీ. ఈ యాత్రలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మొదలై హైదరాబాద్‌లో కలుసుకునేలా ప్లాన్ చేస్తోంది. మొత్తంగా చూస్తే… మచ్చలు, మరకల్ని చేరిపేసుకుని మేం కడిగిన ముత్యాలమని చెప్పుకునేందుకు తెలంగాణ కాషాయదళం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. దీన్ని జనం ఏ మేరకు నమ్ముతారు? పార్టీని ఎంత వరకు ఆదరిస్తారన్నది చూడాలి.