Off The Record: కర్ణాటక ఓటర్లు కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగిపోయిన బీజేపీ పెద్దలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారట. ఈ ఏడాది చివర్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారట. కర్ణాటక నేర్పిన పాఠాలతో.. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరంగా సంస్థాగత మార్పులపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఆ ఐదింటిలో ఒకటి రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను మార్చవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ఇన్ఛార్జ్‌లను కూడా మార్చేయవచ్చంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. మరి ఇక్కడ కూడా మార్పులు, చేర్పులు ఉంటాయా? లేదా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. మార్పులు ఉంటాయా? అంటే ఎక్కువ శాతం ఎస్ అన్న జవాబే వస్తోందట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేదన్న ప్రచారం జోరుగా జరుగుతున్న టైంలో ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తే తప్ప మార్పు రాదని గట్టిగా నమ్ముతోందట ఢిల్లీ నాయకత్వం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ హైదరాబాద్ రావడం లేదు. అందుకే ఇక నుంచి సునీల్ బన్సలే ఎక్కువగా దృష్టి పెడతారన్న మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. హై కమాండే మెల్లిగా తరుణ్‌చుగ్‌ని రాష్ట్ర వ్యవహారాల నుంచి తప్పిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాష్ట్ర నాయకులు.
ఇక ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రచార కమిటీ, ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీలతో పాటు, పోలింగ్, ఇతరత్రా పర్యవేక్షక కమిటీలను వేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే వాటిలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మొదట్నుంచి ఉన్నవాళ్ళా లేక వలస నేతలకా అన్నది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఎవరి వాదనలు వారికి ఉన్నా.. వలస నేతలకే ఎక్కువ పవర్ ఇచ్చే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారానికి హైకమాండ్ చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోవడంతో.. అనుమానాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయట. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మారిస్తే పరిస్థితి ఏంటి? మార్చకుంటే ఏంటన్న చర్చోపచర్చలు నాయకుల మధ్య జరుగుతున్నాయట. సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే రాష్ట్రంలో పార్టీ యాక్టివ్ అయిందని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేస్తున్నారు ఆయన్ని సమర్ధించే వాళ్ళు. హిందుత్వ అజెండాతో అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్న టైంలో ఆయన్ని మారిస్తే..వ్యతిరేక ప్రభావం చూపుతుందని కూడా విశ్లేషిస్తున్నారట వాళ్ళు. ఒకవేళ కాదు.. కూడదని హై కమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. సంజయ్‌కి పార్టీ పరంగా సముచిత స్థానం ఇవ్వాలని, లేకుంటే ఓ సామాజికవర్గమే దూరమయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తోందట సంజయ్ సానుకూల వర్గం. అంటే.. పార్టీలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చబోరని గట్టిగా చెప్పేవారు లేరు. కొత్తగా టీ బీజేపీలో చేరిన నేతల్లో ఒకరికి సారధ్య బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ ఉన్న టైంలో ఈ చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. డీకే అరుణ, ఈటల రాజేందర్‌తోపాటు ఇంకా ఒకరిద్దరు పేర్లపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ హైకమాండ్ త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, దాగుడు మూతలకు ఫుల్ స్టాప్ పెట్టి కేడర్‌కు భరోసా కల్పించకుంటే నష్టపోతామని అంటున్నారు ఇతర నాయకులు.