Off The Record: ప్రశ్నకే…. ప్రశ్నలు ఎదురవుతున్నాయా? నిలదీస్తానన్న స్వరానికే నిలదీతలు పెరుగుతున్నాయా? ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను వైసీపీ నేతలు అడుగుతున్న తీరు చూస్తుంటే… ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా… తేడాగా ఏం చేసినా… ప్రశ్నిస్తా, నిలదీస్తానని గతంలో స్టేట్‌మెంట్స్ ఇచ్చారు పవన్. ఇదే పాయింట్ హైలైట్‌గా ఇప్పుడాయన్ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవకతవకల్ని పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదని అడుగుతున్నారు. తిరుపతి, గుంటూరు డిప్యూటీ మేయర్స్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలు పవన్‌కు కనిపించలేదా? అయినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారన్నది వైసీపీ నేతల క్వశ్చన్ అట. అలాగే వివిధ మున్సిపాలిటీల్లో జరిగిన అధికార దుర్వినియోగాన్ని పవన్ సమర్ధిస్తున్నారా? అన్నది కూడా ఫ్యాన్ పార్టీ నేతల ప్రశ్నగా చెప్పుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మేయర్..డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది.
అయితే తిరుపతి, గుంటూరులో జరిగిన వ్యవహారాలను పవన్ ఎలా సమర్ధిస్తారని అడుగుతోంది వైసీపీ. నిఖార్సయిన రాజకీయాలు చేస్తా….ఏం జరిగినా చూస్తూ ఉండను అని పవన్ పదే పదే చెప్తారు…. మరి ఇప్పుడాయన చేస్తోంది ఏంటన్నది వైసీపీ లీడర్స్ క్వశ్చన్ అట. అలాగే.. ముద్రగడ పద్మనాభం ఇంటి మీద దాడి జరిగితే ఆయన ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు. ముద్రగడ ఇప్పుడు వైసీపీ నాయకుడు అయితే కావచ్చుగానీ… అంతకు ముందు కాపు సామాజికవర్గం కోసం అనేక ఉద్యమాలు చేశారని, అలాంటి నాయకుడి ఇంటిమీద దాడి జరిగితే స్పందించరా అన్నది వైసీపీ క్వశ్చన్. తాను క్లీన్ రాజకీయాలు చేస్తానంటూ మొన్నటి ఎన్నికల టైంలో పవన్‌కళ్యాణ్ చెప్పారని, కానీ… మేయర్ ఎన్నికలు, ముద్రగడ ఇంటి ఎపిసోడ్స్‌లో ఆయన మౌనాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని అడుగుతున్నారు. అటు మహిళలపై సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య పోస్టులు, ట్రోల్స్ మీద కూడా పవన్ స్పందించాలని అంటున్నారు మాజీ మంత్రి రోజా. మహిళల మీద కామెంట్స్ చేస్తే తాట తీస్తానన్న పవన్… ఇప్పుడు మా మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడిని ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఆమె క్వశ్చన్.
అంటే… కేవలం తనకు కావాల్సినప్పుడు, కావాల్సిన పార్టీలకు చెందినవాళ్ళు వేధింపులకు గురైతేనే పవన్‌కు క్వశ్చన్ బ్యాంక్ పాలిటిక్స్ గుర్తుకు వస్తాయా? ఆయన దృష్టిలో మహిళలంతా సమానం కాదా అన్నది రోజా క్వశ్చన్. మహిళల మీద అత్యాచారాలు, బాలికల మిస్సింగ్స్‌పై గతంలో పవన్‌కళ్యాణ్ చేసిన కామెంట్స్‌ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వైసీపీ మహిళా నాయకులు. మొత్తానికి… ఇలా రకరకాల రూపాల్లో… ప్రశ్నిస్తానన్న పవన్‌నే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుకు ఆయన సమాధానం ఏంటని కూడా అడుగుతున్నారు. ప్రశ్నలనేవి ఎక్కడున్నా ఒకేలా ఉండాలిగాని…. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఉండకూడదన్నది మా వెర్షన్ అంటున్నారు వాళ్ళు. ఇందుకు డిప్యూటీ సీఎం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.