Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం శీతకన్ను వేసిందంటూ తెగ ఫీలవుతున్నారట తమ్ముళ్లు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సెగ్మెంట్స్‌లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్‌లు లేరు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా… మిగతా మూడింటిని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయటానికి కొందరు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేసినా… మిత్రపక్షాలకు కేటాయించడంతో కామ్ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో మూడు నియోజకవర్గాల్లో కనీసం ఇన్ఛార్జ్‌లను నియమించుకోలేకపోవడం ఏంటంటూ… తీవ్ర అసహనంగా ఉన్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. దీనివల్ల లోకల్‌గా అటు లీడర్స్, ఇటు క్యాడర్ రకరకాల ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. గెలిచిన పార్టీ నాయకులతో.. పలు అంశాల్లో విబేధాలు పెరుగుతున్నాయట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని చాలామంది ప్రయత్నించారు. కొందరైతే పోరాటాలు కూడా చేశారు. అయినాసరే… చివరికి బీజేపీకి కేటాయించటంతో ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
Read Also: Off The Record: కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్.. బీఆర్ఎస్ అధినేత స్పందిస్తారా..?
బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా…. ఇక్కడ టీడీపీకి పట్టు ఎక్కువ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్ధికి ఈ సెగ్మెంట్‌లో మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఇన్చార్జి లేకపోయినా ఎంపీ కేశినేని చిన్నికి విజయవాడ వెస్ట్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో… ఏ పని కావాలన్నా క్యాడర్ అంతా కూడా ఎంపీ ఆఫీస్ దగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరోవైపు ఇన్చార్జి పదవి కోసం పార్టీలో సీనియర్స్, జూనియర్స్ మధ్య పోటీ పెరిగి అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇదే సమయంలో టీడీపీ గ్రూపు గొడవను బీజేపీ అవకాశంగా తీసుకుని బలపడే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల్లో ఒకరిద్దరిని మాత్రమే బీజేపీ స్థానిక నాయకత్వం ప్రోత్సహించటంతో మిగతా వారు లోలోపల ఉడికి పోతున్నట్టు సమాచారం. ఇన్చార్జి లేకపోవటంతో డివిజన్ కమిటీలు కూడా వేయలేదు. ఒకవేళ వేద్దామన్నా…లీడర్ల గొడవతో ముందడుగు పడటంలేదట. దీంతో పార్టీ పదవులు లేక, నామినేటెడ్ పదవులు రాక, పనులు చేయించుకోవటానికి ఇన్చార్జి లేక… విజయవాడ వెస్ట్ టీడీపీ కేడర్ డీలా పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన తరపున మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు వరకు టీడీపీ అవనిగడ్డ ఇన్చార్జిగా ఉన్నారు బుద్ధప్రసాద్. ఎన్నికల సమయంలో పార్టీ మారి జనసేన నుంచి గెలిచారాయన. ఆ తర్వాత.. కొందరు టీడీపీ కార్యకర్తలు జనసేనలోకి వెళ్ళారు. కానీ… ఎక్కువ మంది మాత్రం పార్టీ మారలేదు. గతంలో టీడీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నాసరే… జనసేన నుంచి గెలిచాక మండలి తమను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ… రగిలిపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో ఇదే విషయాన్ని ఇన్చార్జి మంత్రి ఎదురుగానే స్పష్టం చేయటం ద్వారా కూటమిలో ఉన్న విబేధాలు బయట పడ్డాయంటున్నారు. లోకల్‌గా ఇసుక, మట్టి తవ్వకాలకు సంబంధించి పోస్టులు పెట్టిన తెలుగు యువత కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారని ఈ సమావేశంలో చెప్పడంతో వ్యవహారం రచ్చకెక్కిందట.
Read Also: Raja Singh: “నేనూ అధ్యక్ష పదవి అడుగుతా”.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
అలాగే… టీడీపీ నేతలకు స్థానిక అధికారులు ఏ పనులు చేయటంలేదని, అధికారంలోకి వచ్చినా కూడా ఈ గతేంటని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో బుద్ధప్రసాద్ వైఖరి మీద నియోజకవర్గాల వారీగా అంతర్గత సమావేశాలు పెట్టుకుని మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు కైకలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ ఇన్చార్జి పదవి లేకపోవటంతో తీవ్ర నిరాశగా ఉందట కేడర్. 2014 -2019 సమయంలో కూడా ఇక్కడ నుంచి బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఇన్చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఉన్నారు. ఆ ఐదేళ్ళు క్యాడర్ కు ఏ అవసరం వచ్చినా… ఆయన ముందుండేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచి వైసీపీలోకి తాజాగా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. దీంతో ఇక్కడ ఇన్చార్జి పదవి కోసం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆధిష్టానం ఎవర్నీ నియమించకపోవడంతో… నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు కూడా పెద్దగా జరగడం లేదంటున్నారు. ఇప్పటికైనా…. ఈ మూడు చోట్లా టీడీపీ ఇన్ఛార్జ్‌లను నియమించకుంటే… కూటమి స్థానిక నేతల మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయి… అంతిమంగా మూడు పార్టీల అధిష్టానాలకే సవాల్‌గా మారవచ్చని అంటున్నారు విశ్లేషకులు. కనీసం త్రీ మెన్ కమిటీలను వేసి అయినా… కేడర్‌లో ఉన్న అసంతృప్తిని కొంతవరకు తగ్గించాలని కోరుతున్నారు తమ్ముళ్ళు.