Off The Record: ముద్రగడ పద్మనాభం…కాపు ఉద్యమ నేత. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల బరిలో నిలవలేదు. గత ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేశారు. 2016 తుని రైలు దహనం కేసులు నమోదయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కాడిని వదిలేశారు. గత నెలలో ఆ కేసుని కొట్టేసింది రైల్వే కోర్టు. తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్ కావడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన్ను కలవడానికి వచ్చిన నేతలను…తన వైఖరితో తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట. మీరు పెద్దవారు పార్టీలో చేరి…పెద్దరికంగా వెనక ఉండి నడిపించండి…మీ అబ్బాయిని మాకు వదిలేయండి…సీఎం కూడా భరోసా ఇచ్చారని కీలక వైసీపీ నేత…ముద్రగడ ముందు ప్రపోజల్ పెట్టారట. తన సహజ శైలిలో…మా అబ్బాయిని మీకు వదిలేయడం ఏంటి… మీకు, మీ అధినేతకు వారసులు లేరా అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారట. ఎన్నికల బరిలో నేనే ఉంటాను…దానికి తగ్గట్లుగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని తెగేసి చెప్పేశారట. అయినా పదవులన్నీ మీ సామాజిక వర్గానికే ఇస్తున్నారు…మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటున్నారని అందుకోవడంతో ఉలిక్కిపడ్డారట సదరు వైసీపీ నేత.
జిల్లా ఎమ్మెల్యేలతో సైతం అదే విషయాన్ని చెప్పారట ముద్రగడ. ఆయన వైఖరి ఏంటి అలా ఉంది.. మాట్లాడటం చాలా కష్టం అనిపించిందని ముద్రగడతో జరిగిన సంభాషణ సారాంశాన్ని వాళ్ళ ముందు ఉంచారట సదరు వైసీపీ నేత. అప్పుడు మెయిన్ ట్రాక్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు…మీకు కొత్తగా ఉంటుందండి.. ఆయనతో వ్యవహారం మామూలుగా ఉండదండి..తెగేదాకా లాగుతారు తెగిన తర్వాత ఎందుకు తెంపారు అంటారు…నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అంటూ ఏమీ లేదని.. పార్టీ తరపున ప్రపోజల్ మాత్రమే పెట్టినట్లు రాయలసీమ నేత అన్నారట. మాకు తెలుసండి కానీ పార్టీ అధిష్టానానికి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని సూచించారట. ముద్రగడ పార్టీలో చేరిన తర్వాత బహిరంగ లేఖలు అంటే ఇబ్బంది అవుతుందని గుర్తు చేస్తున్నారట.. జిల్లాలో ఒక్క కాకినాడ సిటీ తప్ప మిగతా చోట్ల కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కో ఆర్డినేటర్లే ఉన్నారు. ఒక వేళ అభ్యర్థులను మార్చినా…సామాజిక వర్గాలను మాత్రం మార్చే అవకాశం లేదట.
జనసేన అధినేత వారాహి యాత్ర ఈ నెల 14 నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానుంది. దానికి మద్దతు ఇవ్వాలని ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేత…ముద్రగడ పద్మనాభం కలిశారట. ఆయన నోటి నుంచి ఆ మాట రావడమే తరువాయి…మీకు మీరుగా వచ్చారా…మీ పార్టీ అధ్యక్షుడు పంపితే వచ్చారా అని ప్రశ్నలు సంధించారట. గతంలో తాను చేసిన ఉద్యమానికి ఎప్పుడైనా మీ అధినేత మద్దతు ఇచ్చారా ? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని ముఖం మీద అడిగేశారట. మీ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందా ? మీరు చెబుతారా ? మీ పార్టీ అధినేత చెబుతారా అని నిలదీశారట. ఇదేదో క్రిటికల్ వ్యవహారంలా ఉందని…అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యానని ఆయన ముఖం మాడ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఏదో మర్యాదపూర్వకంగా కలిశాను…కాసేపు మాట్లాడదాం అనుకుంటే…వెళ్లి వెళ్ళగానే ఆయన వైఖరి చూసి అవాక్కయ్యారట. ముద్రగడతో మాట మంతి అంటే ఇలాగే ఉంటుందని జనసేన జిల్లా నేతలు హితబోధ చేశారట.
తన వైఖరితో పార్టీలను ముద్రగడ చెడుగుడు ఆడుకుంటున్నారు. వారసుడ్ని ప్రమోట్ చేయడానికి అధికార పార్టీకి ఇబ్బంది లేకపోయినా…ఆయన మాత్రం నేను లేనా ? అని సీన్‌లోకి ఎంటర్ అయిపోతున్నారట. ఆచి తూచి స్పందించి ఆయనతో వ్యవహారం చెక్కబెట్టాలని…ఎమ్మెల్యేలు పార్టీకి క్లారిటీ ఇస్తున్నారట.. మరి ఎన్నికల ఏడాది కావడంతో ఆయన ఎటు వెళ్లి…ఏం ఆశిస్తున్నారో…దానికి అవతలి వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.