Off The Record: తెలంగాణ కాంగ్రెస్ సాధారణ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తోంది. ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులతో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ థాక్రే ఒక క్లారిటీ ఇచ్చారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని ప్రకటించేశారు. ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కదా అని పనిచేయకుండా టికెట్లు కావాలంటే కుదరదని తేల్చేశారు. పనిచేస్తేనే పదవులు, లేదంటే టికెట్ ఇచ్చేది లేదంటూ పీసీసీ చీఫ్ కూడా ప్రకటనలు చేశారు. కానీ.. ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీలో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇవ్వడం సాధ్యమేనా ? అసలది జరిగే పనేనా?
పార్టీ అధికారంలోకి రావాలంటే గెలిచే అభ్యర్థి ఎవరో తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుంచి పనిచేసే వాళ్లు కొందరు ఉంటారు.. డబ్బుతో జనంలో హడావుడి చేసేవారు మరికొందరు ఉంటారు. రెండూ ఉన్నవాళ్ళు ఇంకొందరు ఉంటారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వడం అనేది ప్రామాణికంగా పెట్టుకుని అందులో మెరిట్‌ని వెతికితే మంచిది. కానీ.. కేవలం సర్వేలనే ఆధారంగా చేసుకుని టికెట్లు ఇస్తే… దశాబ్దాల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని పక్కన పెట్టినట్టు అవుతుందన్న చర్చ మొదలైంది. కొన్ని నియోజకవర్గాలలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాంటి చోట్ల
పరిస్థితి ఏంటి? అన్నది ఇంకా క్లారిటీ లేదు. తుంగతుర్తి , జనగామ, సూర్యాపేట , దుబ్బాక, ఉప్పల్ , మునుగోడు లాంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా పాత కాంగ్రెస్ నేతలకు, కొత్తగా వచ్చినవారికి మధ్య వైరం ఉంది. ఇలాంటి పంచాయతీలు ఉన్నచోట నాయకులను పిలిచి మాట్లాడకుండా సర్వేలే ఫైనల్ అని చెప్పేస్తే… నష్టం జరుగుతుందన్న వాదన బలంగా ఉంది. ఒక నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారందరినీ పిలిచి నచ్చజెప్పాకే అభ్యర్థుల ఎంపిక జరగాలన్నది కొందరు సీనియర్లు చేస్తున్న సూచన. సర్వే రిపోర్ట్‌తో పాటు నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని కూడా చెరిపి కలిసి పనిచేసేలా కార్యాచరణ ఉండాలని సూచిస్తున్నారు. అయితే గతంలో కూడా పనితీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. పారాచ్యూట్ లీడర్స్‌కి టికెట్లు లేవని చెప్పిన రాహుల్ గాంధీ…. నామినేషన్ డెడ్‌లైన్‌కి ముందురోజు వచ్చిన నలుగురైదుగురికి బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది.
సర్వేలే ప్రామాణికం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు ఎంతవరకు ఆచరణ సాధ్యం అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. పార్టీ సమావేశాలకు రాని ప్రధాన కార్యదర్శుల పదవులను పీకేస్తామని ఇన్చార్జి ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి తొలగిస్తామని కూడా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. కాంగ్రెస్‌లో నాయకులు మాటలు చెబుతారు… తప్పా అవి అమలయ్యే వరకు నమ్మకం ఉండదన్నది గాంధీభవన్ సర్కిల్స్‌లో బలమైన నమ్మకం. ఇప్పుడు అంతా కర్ణాటక మోడల్ అని చెప్తున్నా… అక్కడ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యర్థులను ప్రకటించగలిగారు. మరి తెలంగాణలో అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయగలగా అంటే…. ఠక్కున ఎస్ అన్న సమాధానం మాత్రం రావడం లేదు. ఆ తరహాలో చేయగలిగితేనే ఫలితాల్ని రాబట్టగలుగుతామన్నది సీనియర్స్ మాట. అసంతృప్తులను బుజ్జగించకుండా ఎకాఎకిన అభ్యర్థులను ప్రకటిస్తే… జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ అన్న వాదన బలంగా ఉంది. పార్టీ అధిష్టానం ఈ సూచనలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.