Off The Record: నాకు అడుక్కోవడం తెలియదు… కావాల్సింది లాక్కుంటా. రావాల్సింది మంత్రి పదవి, ఇవ్వాల్సింది అధిష్టానం…. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నోటి నుంచి దూసుకొచ్చిన ఈ మాటల తూటాలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయట. ప్రత్యేకించి ఎన్నికల ముంగిట్లో కావడంతో పార్టీలో పొలిటికల్ హీట్ సమ్మర్ సెగలతో పోటీ పడుతోందంటున్నారు. కొంతకాలంగా స్నేహితులు, అత్యంత సన్నిహితుల దగ్గర మాత్రమే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా ఎంపీ ఎన్నికల ప్రచార వేదిక మీద మాట్లాడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట పార్టీ లీడర్స్. ఆ స్టేట్‌మెంట్ చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. తనకు పదవులు వద్దు వద్దంటూనే.. కుర్చీ మీదున్న ఆశను, ఆసక్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు రాజగోపాల్. అంతేకాదండోయ్.. కేవలం కేబినెట్ బెర్త్ గురించే మాట్లాడితే కిక్కేముందని అనుకున్నారో ఏమో.. పోర్ట్‌ఫోలియోను కూడా ఆయనే డిసైడ్ చేసేకున్నారట. నన్ను హోం శాఖ మంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ.. బంతిని ఆ కోర్ట్‌లోకి విసిరేయడం చూసి ఔరా… ఏం గడుసుతనమంటూ గుసగుసలాడుకుంటోందట కేడర్.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం… భువనగిరి ఎంపీ స్థానానికి ఇన్చార్జిగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వడం… స్వయంగా సీఎం.. రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి… పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించడం లాంటివన్నీ ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్‌ని పెంచేసి ఉండవచ్చంటున్నారు పరిశీలకులు. ఆ సమీక్షా సమావేశం తరువాతనే రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచడాన్ని ప్రస్తావిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాకు అడుకునే అలవాటులేదు…. కావాల్సింది లాక్కుంటానన్న కామెంట్స్ చుట్టూనే చర్చ తిరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండగా.. ఇప్పుడాయన కొత్తగా ఎవరి పదవి లాక్కుంటారంటూ సొంతపార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కామెంట్స్ మంత్రి పదవిపై ఆయనకున్న భరోసాను చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన నిఖార్సైన లీడర్ నేనేనని చెప్తుడటాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు కొందరు నేతలు. ఇప్పటికే జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్నారు. అలాంటప్పుడు ముచ్చటగా మూడో వ్యక్తికి అవకాశం ఉంటుందా? లేక మునుగోడు ఎమ్మెల్యే ఉన్నవాళ్ళలో ఎవరో ఒకరి పదవి లాక్కుంటారా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ కేడర్‌లో. పైగా… ఒకే ఉమ్మడి జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి అవకాశం ఇస్తారా….? సీఎం రేవంత్ రెడ్డి సామాజిక సమీకరణలను బేరీజు వేసుకోకుండా ఉంటారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయట.
తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ బెర్త్ ను అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి… ఉత్తమ్ కుమార్ రెడ్డితో భర్తీ చేయడాన్ని గర్తు చేస్తున్నారు కొందరు సీనియర్ నేతలు. ఆ ఎపిసోడ్ చాలాకాలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గ్యాప్‌కు కారణమైందని,ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తుచేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కారణం ఏదైనా…మంత్రి వర్గంలో స్దానంపై రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కాన్ఫిడెంట్ కామెంట్స్‌పై ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిరకరమైన చర్చే జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా జరిగితే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వడగాడ్పులకు కార్చిచ్చు తోడైనట్లే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.