Off The Record: అమలాపురం వైసీపీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు….మినిస్టర్లు, ఎంపీల మధ్య కోల్డ్ వార్ ఎప్పుడైనా బద్దలవుతుందన్న డిస్కషన్ సాగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ మధ్య భగ్గుమంటున్న విభేదాలే. చింతా అనూరాధ పార్టీలో చేరిన తర్వాత…స్వగ్రామం మొగళ్ళమూరుకు ర్యాలీగా వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో… అనూరాధ ఫొటో పెద్దదిగా వేసి సీనియర్ నేత అయిన విశ్వరూప్ ఫొటో చిన్నదిగా వేశారని మొదలైన విబేధాలు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి.
ఎంపీ స్వగ్రామం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అల్లవరం మండలం మొగళ్లమూరు. దీనితో ఒకే నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్లు ఉండటంతో అప్పుడప్పుడు ఫైర్ బయటపడుతోంది. కార్యకర్తలు ఇద్దరి వైపు చీలిపోయి ఉండటంతో, సఖ్యత చెడింది.
దీనితో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంతో ఎంపీ అనూరాధ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తూ…మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరవుతున్నారు. అల్లవరం మండలం మొగళ్లమూరు లో నివాసం ఉంటున్న ఎంపీ అనూరాధ…ఆ మండలానికే పరిమితం అయ్యారనే విమర్శలూ స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఓఎన్జీసీ సీఎస్సార్ నిధులైన 25 కోట్లలో…ఒక్క రూపాయి కూడా మిగతా మండలాలలకు ఇవ్వకుండా…ఒక్క అల్లవరం రోడ్ కే కేటాయించడం పట్ల మంత్రి అసంతృప్తి గా ఉన్నారట. పైగా చింతా అనురాధ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం సైతం ఇద్దరి మధ్య విభేదాలకు మరో కారణమని తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోతే తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, మంత్రి కుమారుడిని లోక్‌సభ కు పోటీ చేయించాలని ఎంపీ అనురాధ ప్రతిపాదన తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనితో మంత్రి, ఎంపీ మధ్య మరింత గ్యాప్ పెరిగింది. అనూరాధ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి లోకల్ కావడంతో మంత్రి ఇన్ సెక్యూరిటీ గా ఫీల్ అవుతున్నారట.
ఇటీవల విజయవాడలో జరిగిన ఎస్సీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఎంపీ అనూరాధ చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశం అయ్యాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎస్సీలలో అసంతృప్తి ఉందని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారని…దీనిని అడ్డుకోవాలని వైసిపి పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ కామెంట్స్ మంత్రికి లడ్డూలా దొరికాయి. తనకు ఇష్టంలేకపోతే, పార్టీకి నష్టం చేస్తారా అనే యాంగిల్ లో ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి విశ్వరూప్.
బహిరంగంగానే ఎంపీ కామెంట్లను ఖండించారు మంత్రి విశ్వరూప్. ఎస్సీ పథకాల అమలులో ఆమెకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎంపీ వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి విశ్వరూప్ వివరణ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు 52 వేల కోట్ల రూపాయల లబ్ది కలిగిందని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. భవిష్యత్ లో ఎస్సీ లకు మేలు చేసే పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఘాటుగా స్పందించారు. సొంత పార్టీ ఎంపీని బహిరంగంగా మంత్రి తప్పుపట్టడంతో మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ వ్యాఖ్యలతో ఎం.పి. అనూరాధ పైనా, పార్టీ పైనా మంత్రి విశ్వరూప్ అసంతృప్తితో ఉన్నారా అనే అపోహలు కలుగుతున్నాయని అనురాధ వర్గీయులు మండిపడుతున్నారట. వాస్తవ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళితే తప్పేంటని మంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఇవ్వన్నీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణమని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీకి వ్యతిరేకంగా మంత్రి విశ్వరూప్ చేసిన కామెంట్స్ అధిష్టానానికి చేరడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. తన కామెంట్స్ పై ఎంపీ అనూరాధకు ఫోన్ చేసి మంత్రి విశ్వరూప్ స్వయంగా వివరణ ఇచ్చుకున్నారట. దీనితో ఇరువురి మధ్య విభేదాలు తొలగిపోతాయా లేక మళ్ళీ భగ్గుమంటాయా అనేది చూడాలి.