Off The Record: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టబోతోంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించే స్క్రీనింగ్ కమిటీని కూడా ప్రకటించేసింది. అయితే కమిటీ నియామకంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయట . పీసీసీ మాజీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డికి ఇందులో చోటు కల్పించడంపై చర్చ జరుగుతోంది. ఎవరికి చెక్ పెట్టడం కోసం ఆయన్ని స్క్రీనింగ్ కమిటీలో చేర్చారన్న దిశగా ఆ చర్చలు జరగడమే హాట్ హాట్‌గా మారింది. అభ్యర్థుల ఎంపికలో పాత కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నది చాలా రోజులుగా గాంధీభవన్‌లో వినిపిస్తున్న మాట. పార్టీలో కీలకంగా… ముఖ్య స్థానంలో ఉన్న నాయకుడు అందరిని కలుపుకొని పోవడం లేదని.. కొత్త కొత్త వారిని తీసుకువచ్చి అభ్యర్థులుగా ప్రకటిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్లు అధిష్టానానికి విన్నవించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఉత్తమ్‌ని కమిటీలో చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ఉన్న నాయకులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించి బయటకు పంపే కుట్రలు జరుగుతున్నాయన్నది ఎక్కువ మంది సీనియర్స్‌లో ఉన్న అభిప్రాయం అట. ఇదే అంశాన్ని పార్టీ అగ్ర నాయకుల దగ్గర ఉత్తం ప్రస్తావించినట్టు తెలిసింది. ఎన్నికల వేళ ఇలాంటివి జరగడం మంచిది కాదని సూచించినందునే రెండు వర్గాలను బ్యాలెన్స్ చేయడానికి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా ఉండే స్క్రీనింగ్ కమిటీలో ఉత్తంకుమార్ రెడ్డి పేరు చేర్చారని టాక్. పాత నాయకులను పక్కనపెట్టి కొత్తవారి డోస్ పెంచితే జరిగే నష్టం పై కూడా అధిష్టానానికి సీనియర్లు నివేదించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉన్నారు. ఉత్తం, భట్టి ఇద్దరూ పార్టీ కోసం పనిచేసిన సీనియర్స్‌కు అన్యాయం జరగకుండా చూస్తారని, లాయల్ గా పనిచేసిన వారిని పికప్ చేయడానికి ఉపయోగపడతారని అధిష్టానం భావించినట్లు చెబుతున్నారు. ఎవ్వరూ.. ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకోకుండా.. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని జాగ్రత్తగా కూర్చినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక కు సంబంధించిన ఎఐసిసి ముఖ్య నాయకుడు ఒకరు ఇటీవల పిసిసిలో కీలక నాయకుడికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో చర్చించినట్టు తెలిసింది. ఎంపికకు, సదరు వ్యక్తికి ఏంటి సంబంధం? అన్నది సీనియర్ల వాదన. ఇదే అంశాన్ని ఏఐసీసీ కీలక నాయకుల దృష్టికి తీసుకువెళ్ళారని, దీంతో … ఓ ముఖ్య నాయకుడిని కంట్రోల్ చేయడానికే వ్యూహాత్మకంగా కమిటీని వేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో స్క్రీనింగ్ కమిటీ నియామకంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ చెప్పిన సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో జరుగుతుందా..? లేదా అన్నది చూడాలి.