Off The Record: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అందరి దృష్టి ఒక్కసారిగా గజ్వేల్ వైపు మళ్ళింది. కేసీఆర్‌ను తమ దగ్గర్నుంచి పోటీ చేయమంటే.. తమ దగ్గర్నుంచి చేయమని అనేక జిల్లాల వాళ్ళు అడుగుతున్నారని అన్నారు హరీష్‌రావు. అంటే.. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదా? అన్న అనుమానాలు ఒక్కసారిగా బయలుదేరాయి. ఆయన ఎందుకలా ఆలోచిస్తున్నారన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌తో పాటు మిగతా పార్టీల నాయకులు కూడా ఎవరికి వారు తమకు నచ్చిన భాష్యం చెప్పుకుంటున్నారట.
కేసీఆర్ సీటు మారే విషయంలో వాస్తవావస్తవాలను కాసేపు పక్కనబెడితే… కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో ఒక చర్చ మాత్రం జరుగుతోందట. కేసీఆర్ ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే దాని ప్రభావం చుట్టుపక్కలుండే పాతిక, ముఫ్పై నియోజకవర్గాల మీద ఉంటుందని, అందుకే పార్టీ కాస్త బలహీనంగా ఉండే చోట నుంచి ఆయన బరిలో దిగితే బాగుంటుందన్న అభిప్రాయం ఉందట. తాజాగా హరీష్‌రావు చేసిన కామెంట్స్‌తో ఆ అభిప్రాయం నిజమే అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్న ఆరాలు మొదలయ్యాయట.
సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా చట్ట సభకు మొదటి సారి ఎన్నికయ్యారు కేసీఅర్. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఇతర ప్రాంతాల్లో పోటీ చేశారు. కరీంనగర్ ఎంపీగా మూడు సార్లు ఎన్నికయ్యారాయన. మహబూబ్ నగర్ ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు సార్లు గెలిచారు కేసీఆర్. తాజాగా హరీష్ రావు కామెంట్స్ తో ఆయన ఉత్తర తెలంగాణ, లేదా దక్షిణ తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్న ఆసక్తి సర్వత్రా పెరుగుతోందట. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేసేందుకు కేసీఅర్ వ్యూహాత్మంగా నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందట. దీంతో ఆ టైంకి సీఎం చూపు ఎటువైపు ఉంటుందోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో పెరిగిపోతోందట.