Off The Record: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం తెగ నానుస్తోందంటూ అసహనం పెరిగిపోతోందట పార్టీ వర్గాల్లో. ఏదైనా నానబెట్టడం వీళ్ళకు అలవాటే కదా.. అంతకు మించి కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాంలే… అన్న పెదవి విరుపులు సైతం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే మార్చిలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా డిసైడైంది తెలంగాణ కమలం పార్టీ. ఇంకేముంది… ఫలావాళ్ళు అభ్యర్థులు, ఫలానా ఈక్వేషన్స్‌తో ఎంపిక చేయబోతున్నారంటూ చాలా రోజుల క్రితమే హడావిడి జరిగింది. కొన్నాళ్ల పాటు రాష్ట్ర పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. కానీ… ఉన్నట్టుండి ఆ అంశం పక్కనపడిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే అసలా ఊసే లేదు. దీంతో అప్పుడు పేర్లు ప్రచారంలోకి వచ్చిన నాయకులు, ఇతర ఆశావహులు సైతం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారట. ఒకవైపు టైం దగ్గర పడుతోంది. ఇటు చూస్తే… ఇక్కడ చడీ చప్పుడు లేదు. అసలు ఏమీ లేనప్పుడు… ఇంకా బోల్డంత టైం ఉన్నప్పుడే హంగామా చేసిన రాష్ట్ర నాయకత్వం ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందో అర్ధంగాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట సదరు లీడర్స్. రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పి రెండు నెలలు గడుస్తున్నా… ఆ ఊసే ఎత్తకపోవడంతో… తెర వెనక అసలేం జరుగుతోందోనని ఆరా తీసేపనిలో ఉన్నట్టు సమాచారం.
Read Also: Re-notification to 53 Bars: ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్.. 23 వరకే అవకాశం..
అసలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటీ కూడా వేసింది తెలంగాణ బీజేపీ. ఆ కమిటీ అన్ని కేటగిరీల్లోని పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి రిపోర్ట్ ఇచ్చింది. అయినా సరే… నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన ఎందుకంటూ… పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు. విషయం ఏదైనా… నాన్చడం మనోళ్ళకి అలవాటే కదా…. ఎప్పుడు మారతారో ఏంటో.. అనుకుంటూ సణుక్కునే బ్యాచ్ కూడా పెరిగిపోతోందట పార్టీలో. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వ్యూహాలను చూసి, వాళ్ళు అభ్యర్థుల్ని ప్రకటించాక మనం ఓ నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ… అందుకు కూడా కన్విన్స్ అవలేకపోతున్నారట లీడర్స్. ఆ రెండు పార్టీలు గ్రాడ్యుయేట్ స్థానికి పోటీ చేస్తాయి తప్ప… టీచర్ సీట్లకు పోటీలో ఉండవని, అలాంటప్పుడు కనీసం ఆ రెండు సీట్లరైనా పేర్లు ప్రకటిస్తే… మా పని మేం చేసుకుంటాం కదా అంటున్నట్టు తెలుస్తోంది. వివిధ ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులుగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండాలనుకుంటున్న నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల ఓట్ల కోసం స్కూల్స్‌కు తిరుగుతున్నారు.
Read Also: Roasted Almonds: కాల్చిన బాదంపప్పును తినండి.. ఈ సమస్యలకు గుడ్ బై చెప్పండి
కానీ…ఈ విభాగంలో కూడా పోటీ చేయాలనుకున్న బీజేపీ మాత్రం అభ్యర్థుల్ని డిసైడ్ చేయకపోవడంపై ఆందోళనగా ఉన్నారట నాయకులు. ఒకవేళ లాస్ట్ మినిట్‌లో టిక్కెట్ ఫైనల్ చేస్తే… అప్పటికప్పుడు ఏం చేయాలన్న టెన్షన్ కనిపిస్తోందని చెబుతున్నారు. ఇవి సాధారణ ఎన్నికల టైప్ కాదు కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడాలని, లాస్ట్ మినిట్‌లో టిక్కెట్ వస్తే… అటు కాదనలేక, ఇటు డబ్బు ఖర్చుపెట్టి ఏదన్నా తేడా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఆందోళన బీజేపీ నేతల్లో ఉందంటున్నారు. చివరికి ఎవరు తెర మీదికి వస్తారో చూడాలి మరి.