Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో వర్కౌట్ చేయడం మొదలుపెట్టాయి. ముఖ్యనేతలంతా వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఈసారి డూ ఆర్ డై అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. అందుకే ఆచితూచి అడుగులేస్తోంది నాయకత్వం. చేరికలకు సంబంధించిన నిర్ణయాలన్నీ…పూర్తిస్థాయిలో ఏఐసీసీ కనుసన్ననల్లోనే జరుగుతున్నాయి. ఒకవేళ ఏవైనా పార్టీలతో పొత్తంటూ ఉంటే… సీట్ల సర్దుబాటు గురించి ఇప్పటికి ఇప్పుడు తేల్చేసేయాలని అనుకోవడం లేదు గాంధీభవన్ వర్గాలు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న మాటకే కట్టుబడి ఉంది అధిష్టానం. ఇప్పుడే ఇతరులకు కమిట్‌మెంట్ ఇచ్చేస్తే తర్వాత ఇబ్బందులు వస్తాయని అనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకత్వానికి టచ్‌లోకి వచ్చారన్న ప్రచారం కలకలం రేపుతోంది. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటోందట ఆ పార్టీ.
Read Also: Off The Record: బీఆర్ఎస్‌కు కొందరు కార్పొరేటర్లు కంట్లో నలుసులా మారారా?
అధికార పార్టీనుంచి వచ్చేస్తున్నారు కదా అని ఎకాఎకిన గేట్లెత్తేయకుండా… ముందు అలాంటి వారి గురించి స్టడీ చేయాలనుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు. కొందరు పార్టీ మారతామని ఫీలర్స్ వదిలి… బీఆర్‌ఎస్‌లోనే తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని, అలాంటి వారి విషయంలో తొందరపడితే… అభాసుపాలవుతామని అనుకుంటోందట కాంగ్రెస్ నాయకత్వం. మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆఖరు నిమిషంలో అవసరాన్నిబట్టి అలాంటి వారికి ఓకే చెప్పాలని అనుకుంటోందట.
Read Also: Off The Record: పీక్స్‌కు పవన్ కల్యాణ్, పేర్ని నాని వార్.. మాజీ మంత్రిని టార్గెట్ చేసిన కాపులు..!
కాంగ్రెస్ నాయకత్వానికి టచ్‌లోకి వచ్చిన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. ఆయన నియోజకవర్గంలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉందట. దాన్ని తట్టుకోలేక బీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చేయాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు బీఆర్‌ఎస్ సీనియర్స్, ఒక ఎమ్మెల్సీ, మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోతామంటూ కాంగ్రెస్ నాయకత్వానికి టచ్‌లోకి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే పొరుగు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కోరుకుంటున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారట. అధికార పార్టీలో ఆ అవకాశం లేదు గనుక కాంగ్రెస్ గూటికి చేరాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న ఆ నాయకుడు కాంగ్రెస్ నాయకత్వంతో సీరియస్‌గానే చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అయితే చేరికల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదట.. సదరు ఎమ్మెల్సీ అడుగుతున్న సీటును మరొకరికి ఇప్పిస్తామని కాంగ్రెస్‌లోని ఇద్దరు కీలక నాయకులు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు ఆయన్ని కాదని బయటి నుంచి వచ్చే వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా లొల్లి ఉంటుందని అంచనా వేస్తున్న గాంధీభవన్ వర్గాలు ఎమ్మెల్సీకి గ్రీన్ సిగ్నల్‌పై వేచి చూసే ధోరణిలో ఉన్నాయట.
Read Also: Airtel Offers: ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్లు.. ఈ రీఛార్జ్‌లతో 5జీ డేటా, 15 ఓటీటీ ఛానెల్స్ ఫ్రీ
బీఆర్‌ఎస్ నుంచి వచ్చేస్తామంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ నాయకత్వానికి అనుమానాలు గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు పార్టీ మారతామని ఫీలర్స్ వదిలి సొంత గూట్లో డిమాండ్ పెంచుకునే ఎత్తుగడలు వేస్తున్నారా? లేక నిజంగానే కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. అందుకే అధికార పార్టీ నుంచి వచ్చే వారి విషయంలో… అందునా పదవిలో ఉండి వస్తామనే వారితో జాగ్రత్తగా ఉండాలని డిసైడయ్యారట కాంగ్రెస్ నేతలు. నిజంగా మారేదెవరు? సొంతగా మార్కెటింగ్ చేసుకున్నదెవరో తేలాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందే.