Off The Record: ఏపీ బీజేపీకి సీన్ సితారవుతోందా?.. భవిష్యత్ బ్లర్‌గా కనిపిస్తోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అడకత్తెరలో పోక చెక్కలా.. ఇంకా చెప్పాలంటే ఆటలో అరటి పండులా మారిపోయిందట ఏపీ బీజేపీ పరిస్థితి. ఒకప్పుడు భయమో.. భక్తో ..లేక భయంతో కూడిన భక్తితోనో ఏపీలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి విలువ ఇచ్చేవి, లేకుంటే ఇచ్చినట్టు నటించేవి. అదే సమయంలో కాషాయ దళం కూడా కాలరెగరేసేది. చూడండి.. చూస్తూ ఉండండి.. మేమేం చేస్తామోనంటూ గంభీరంగా ప్రకటనలు ఇచ్చేవారు. కానీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఏపీలో ఆ పార్టీకి సీన్ సితారవుతోందట. కీలకం.. లకలకం అనుకుంటూ.. ఎన్నెన్నో అంచనాలు వేసుకుంటే.. బొమ్మ బొక్క బోర్లా పడింది. ఇప్పుడు భవిష్యత్ అంతా బ్లర్‌గా కన్పిస్తోందట ఏపీ బీజేపీకి. అందుకు వాళ్ళనో, వీళ్ళనో సాకుగా చూపి తప్పు పట్టాల్సిన అవసరం లేదని, అంతా అధిష్టానమే చేసిందని, వాళ్ళ వైఖరి వల్లే… ఏపీలో పార్టీ ఎదుగు బొదుగు లేకుండా పోతోందని పిక్చర్ క్లియర్ అయిందట స్థానిక నాయకులకు. నేతల మధ్య జరుగుతున్న అంతర్గత సంభాషణల్లో బీజేపీ నేతల్లో నిర్వేదం.. నిస్సాయత.. అనాసక్తత వంటివి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయట. మనమేం చేయగలం.. అంతా పైవాడే చేయాలంటూ ఎదురుగా ఉన్న పార్టీ పెద్దల ఫోటోలవైపు చేతులెత్తి చూపుతున్నారట ఏపీ నేతలు.
మరీ ముఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తు ఖరారయ్యాక.. దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏపీ బీజేపీ నేతలది. అయితే… పవన్ తప్పు చేశారనో, లేదంటే మనం కూడా వాళ్ళతో కలిసి వెళతామనో, ఇంకా కాదంటే పరీశీలిస్తున్నామనో చెప్పాలిగానీ… ఇలా సైలెంట్‌గా ఉండటం ఏంటని అడుగుతున్నారట. కనీసం పవన్‌తోగానీ, ఇతర జనసేన నేతలతో గానీ సంప్రదింపులు జరపకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని తమలో తాము మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ఢిల్లీ పెద్దలు వ్యవహరించడం కరెక్ట్ కాదని రాష్ట్ర నాయకుల అభిప్రాయం. అలాగే ఏపీలో రాజకీయ పరిస్థితిని, బీజేపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద లేదా..? అని గుర్రుగా ఉన్నారట మరికొందరు. ఈ మాత్రం దానికి అధ్యక్ష స్థానంలో సోము వీర్రాజు కూర్చొంటే ఏంటీ..? పురంధేశ్వరి ఉంటే ఏంటీ..? సామాన్య కార్యకర్త అయితే ఏంటీ..? అనే గుసగుసలు ఇంటర్నల్‌గా వినిపిస్తున్నాయి.
Also Read
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగితే సీట్లే కాదు.. ఓట్లు కూడా రావంటూ.. జాప్యంపై రుసరుసలాడుతున్నారు కమలం నేతలు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం కమలానికి కారం పూసే వ్యవహారంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే వాదనను గట్టిగా ఖండించాలని, వెంటనే స్పందించకుంటే… ఇప్పటికే జీరోలో ఉన్న పార్టీ మైనస్‌కు వెళ్లడం ఖాయమంటున్నారు కొందరు నాయకులు. ఏకంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా బీజేపీ పాత్ర ఉందో.. లేదో దేవుడికే తెలియాలంటూ నర్మగర్భంగా కామెంట్స్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తరహా ప్రచారానికి వీలైనంత త్వరగా చెక్ చెప్పాలనేది మెజార్టీ కమలం నేతల వాదన. అటు పవన్‌తో పొత్తు విషయంలోనూ ఏం చెప్పక.. ఇటు చంద్రబాబు అరెస్ట్ విషయంలోనూ ఎలాంటి స్పందన లేక, మౌన మునిలా కూర్చొంటే రాజకీయం ఎలా చేయగలమనేది బీజేపీ నేతల వాదన. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ కొన్ని ఓట్లు రావాలన్నా.. ఒకటో రెండో సీట్లు గెలవాలన్నా.. టీడీపీ-జనసేన కూటమితో వెళ్లక తప్పదనేది ఎక్కువ మంది ఏపీ నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. అలా కాకుండా.. మేమింతే.. మా స్టైలింతే అంటూ కాలాయాపన చేస్తూ ఉంటే.. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి గొంతులో పెట్టుకున్నట్టే అవుతుందనేది వాళ్ళ మాట. ఏపీలో బీజేపీ ఈ దుస్థితిలో ఉండడానికి అధిష్టానమే కారణం అన్న అభిప్రాయం స్థానిక నేతల్లో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో నేతల చేతులు కట్టేసి.. రాజకీయం చేయమంటే ఎలాగన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే అంతా… మీరే చేశారని అటువైపు చేతులు చూపుతున్నారు లోకల్ లీడర్స్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!