ఏపీలో బీజేపీ తన మీద పడ్డ మచ్చను చెరిపేసుకునే పనిలో ఉందా? ఛార్జ్‌షీట్ కార్యక్రమం అందుకు ఉపయోగపడుతుందా? వైసీపీ, బీజేపీ ఒకటేనన్న ప్రచారం నుంచి బయటపడటానికి కమలనాథులు నానా తంటాలు పడుతున్నారా? వాళ్ళ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది?
ఏపీ బీజేపీ తమ మీదున్న మచ్చను చెరిపేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది. కొందరు నేతల తీరుతో పార్టీల పరంగా వేరైనా.. వ్యవహారపరంగా బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం ఇరుకున పడ్డ కీలక సందర్భాల్లో కొందరు బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు వైసీపీకి కలిసి వచ్చిందనే భావన ఉంది. దీనికి తగ్గట్టు పవన్ చేసే కొన్ని కార్యక్రమాలను బీజేపీలోని స్థానిక నేతలు అడ్డుకున్నారనే ప్రచారమూ పెద్ద ఎత్తున జరిగింది. ఈ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడినట్టు చెబుతున్నారు. దీంతో తమ మీదున్న మచ్చను చెరిపేసుకునేలా బీజేపీ అధినాయకత్వం బలమైన ప్రయత్నం చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. దీంట్లో భాగంగానే అధికార పార్టీ నేతలపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది.
ప్రజల నుంచే అవినీతి ఆరోపణల సమాచారాన్ని సేకరించి.. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఫిర్యాదులు చేయాలనే రీతిలో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఓ రేంజ్‌లో అభిప్రాయాలు స్వీకరించారు. ఎక్కడిక్కడ స్థానిక నేతలంతా ఆయా సెగ్మెంట్లల్లో అధికార పార్టీ నేతల మీద ఛార్జీ షీట్లు దాఖలు చేస్తున్నారు. ఇక కీలకమైన నాయకులు ఉన్న చోట మాత్రం అగ్ర నేతలు స్వయంగా పాల్గొని ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో ఉన్నారు. గుడివాడలో కొడాలి నాని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసే కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ పాల్గొన్నారు. క్యాసినో వ్యవహరంతో పాటు.. ఇంకొన్ని ఆరోపణలను ప్రస్తావిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో మాజీ మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు బీజేపీ అగ్ర నేతలు. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఉన్న దేవినేని అవినాష్ గంజాయి విక్రయాలు సహా అనేక అక్రమాలకు.. అరాచకాలకు ప్రొత్సహం అందిస్తున్నారని.. అవినాష్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేసి.. నగర బహిష్కరణ చేయాలని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా వివిధ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలే చేపట్టారు ఏపీ కమలనాధులు.