Off The Record: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది క్లారిటీ లేదు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభలో అడుగు పెట్టిన ఆనంకు ఇప్పుడు సొంత నియోజకవర్గమంటూ లేకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారాయన. టీడీపీ నుంచికాంగ్రెస్ లోకి వెళ్ళి.. 2014లో తిరిగి తెలుగుదేశం గూటికే చేరారాయన. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి వెంకటగిరి నుంచి గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది కాలంలోనే.. ప్రభుత్వంతో పాటు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బహిరంగంగానే విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేసింది వైసీపీ. తర్వాత మరోసారి టీడీపీకి దగ్గరైన ఆనంకు.. యువ గళం పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.
గతంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఆయన కూడా ఆత్మకూరు బాధ్యత తీసుకున్నారు. అయితే స్థానిక టిడిపి నేతలను కలుపుకోలేకపోవడంతో వారంతా ఆనంకు దూరమయ్యారట. ఆత్మకూరుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆయన అనుకుంటున్నా.. స్థానిక నేతల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందలేదట. బహిరంగంగా తన మనసులోని మాటను బయటపెట్టడంతో పాటు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు టీడీపీ అధిష్టానానికి చెప్పారట ఆనం. కానీ, హై కమాండ్ ఆ సంగతిని పట్టించుకోకుండా మరో మాజీ మంత్రి నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనే అక్కడ అభ్యర్థి అన్నది తేలిపోయింది. ఇక చేసేది లేక మళ్లీ ఆత్మకూరు వైపు చూసినా.. అక్కడి నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో.. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నుంచే పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారట రామ నారాయణరెడ్డి.
అక్కడే దృష్టిపెట్టి ఆత్మకూరును పూర్తిగా వదిలేశారంటున్నారు స్థానిక కార్యకర్తలు. ఇక జోరు పెంచేందుకు వెంకటగిరిలో టీడీపీ ఆఫీస్‌ని ప్రారంభించాలని అనుకున్నా.. అధినాయకత్వం అందుకు అనుమతి ఇవ్వలేదట. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారాయన. అలాగే బీసీ కోటాలో తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు డాక్టర్ మస్తాన్ యాదవ్. ఈ పరిస్థితుల్లో ఆనం ఆఫీస్‌కు పర్మిషన్ ఇస్తే.. గందరగోళం పెరుగుతుందన్నది టీడీపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. దీంతో అయోమయంలో పడిన రామనారాయణరెడ్డి.. ఏ స్థానం అయితే బాగుంటుందంటూ అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారట. అంత అనుభవం ఉన్న నాయకుడికి తాను అనుకున్న ఆత్మకూరులో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, పోటీ చేయాలనుకున్న నెల్లూరు చేజారిపోవడం, వెంకటగిరి ఏమవుతుందో తెలియకపోవడంలాంటి రాజకీయ అనిశ్చితి రావడం ఇబ్బందికర పరిణామమేనంటున్నాయి రాజకీయ వర్గాలు.