పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోనే పార్టీ అధిష్టానానికి చెప్పానని, జనంలో తిరస్కరించినబడిన వాళ్లు.. పదవుల కోసం విమర్శలు చేస్తున్నారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఠాగూర్, ఠాక్రే మీద ఆరోపణలు,వాస్తవాలను బయట పెట్టింది… అధిష్టానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఇద్దరు ఇంచార్జీలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తే.. ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు జైలుకు, ఇంచార్జిలు ఇంటికి పోతున్నారని, కారు ఇచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు మాట్లాడితేనే ఆధారాలు బయటపెడుతానన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, బీజేపీ, కాంగ్రెస్ పాత్ర పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని, అప్పులు పుట్టే పరిస్థితి కనబడటం లేదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అంతేకాకుండా.. పాలన, పరిపాలన సాగాలంటే అప్పులు తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, బీఆర్‌ఎస్ పంథాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానా లేక ఇబ్బందులు పడుతుంటే.. సలహాదారులు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దుబారాను తగ్గించుకోవాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ నియామకాలను నిలిపివేయాలన్నారు. కార్పొరేషన్ నియామకాలన్ని రాజకీయ నియామకాలేనని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్ మితి మీరి మాట్లాడుతుందని, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం మానుకోకపోతే క్రిమినల్ చర్యలు ఎదుర్కోకతప్పదన్నారు.