*ఒకటి, రెండు సీట్లకే బీజేపీ అధికారంలోకి వస్తుందా?
తెలంగాణలో గెలిచే ఒకటో రెండో సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందా హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో బీజేపీ ఒకే సీటు గెలిచిందని, ఈసారి కూడా ఒక్క సీటు మాత్రమే వస్తుందన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీజేపోడు బావి దగ్గర మీటర్ పెడుతా అంటున్నాడు.. కాంగ్రెసోడు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. కేసీఆర్ మాత్రం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తా అంటున్నాడని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ యువతను మోసం చేసిందన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఈ తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. మరి ఇచ్చాడా? ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎరువు బస్తాలు, కరెంట్ కోసం ఎన్నో తిప్పలు పడ్డామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్న హరీష్ రావు.. ఇప్పుడిప్పుడే తెలంగాణను బాగు చేసుకుంటున్నామన్నారు. చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు.
*నేను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో తాను దీక్ష చేశానని తెలిపారు. కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండని రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే.. ఇయ్యాల ఎర్రవల్లిలో ఎట్లుండు అని ప్రశ్నించారు. రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోయేందుకే ప్రాధాన్యతనిచ్చిండని తెలిపారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలని ఈ సందర్భంగా అక్కడి జనాలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకొనివ్వం.. ముమ్మాటికీ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బక్కోడు కాదు… లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని విమర్శించారు. తాను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండని అన్నారు. నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు.. ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందామని తెలిపారు. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా? అని కేసీఆర్ పై మండిపడ్డారు.
*కేటీఆర్, కేసీఆర్‌లపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
చొప్పదండి ప్రచారంలో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై కేటీఆర్ నోరు పారేసుకోవడాన్ని ఆయన ఖండించారు. బుధవారం చొప్పదండి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కేటీఆర్, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా? అని మండిపడ్డారు. ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాం హౌజ్‌లు కట్టుకున్నారని, పేదలకు మాత్రం గూడు కల్పించరా? అన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం సంగతేమైంది? అని ప్రశ్నించారు. ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ తాంత్రిక పూజలను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 5 లక్షల కోట్ల అప్పు చేశారు.. మరి ఆ అప్పు ఎట్లా తీరుస్తారు? ప్రశ్నించారు. అవినీతిలో బీఆర్ఎస్ కిటీకీలు తెరిస్తే… కాంగ్రెస్ ఏకంగా తలుపులా బార్లా తెరుస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనని, అధికారంలోకి వస్తే కుప్పకూలడం తథ్యమని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలు మడిచి పెట్టుకోండని.. గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇవ్వగలరా?
*కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుంది..
కేసీఆర్‌ను గెలిపిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. బుధవారం ఆమె జోగులాంబ గద్వాల్ జిల్లా అలాంపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ పదేళ్లు యువత, నిరుద్యోగులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. పదేళ్లు యావత్ తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేసి నిరుపేదల భూములను లాకున్నారని వాపోయారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో ప్రజలపై దండయాత్ర చేసి దోపిడీ చేశారని విజయశాంతి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. 420 గాళ్లతో బీజేపీ చేతులు కలిపిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని… రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే యావత్ తెలంగాణ గెలిచినట్టేనని రాములమ్మ అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి దోపిడికి చరమగీతం పాడాలన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను మీకు అందిస్తుందని… మీరు మాత్రం కేవలం ఓటు వేసి మీ గ్యారెంటీని చాటుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.
*ఎమ్మెల్యే షకీల్పై కాంగ్రెస్ దాడిని ఖండించిన ఎమ్మెల్సీ కవిత
బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ పై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించింది. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కవిత కోరారు. ప్రతి చోట అల్లర్లు, దాడులు చేసే చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లాలకు ఐటీని విస్తరిస్తే కాంగ్రెస్ అల్లర్లను విస్తరిస్తుందని కవిత మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుండాయిజం, రౌడీయిజం చేసేవాళ్లకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆమే కోరారు. బీసీ టికెట్లను అమ్ముకున్న రేవంత్ రెడ్డి.. బీసీల గురించి మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంతర్గత గొడవలతో సతమతమౌతున్నారని ఆమే తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అస్థిరత పాలన ఉందని ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని మాట తప్పారన్నారు. కేసీఆర్ కోరుకున్నట్లు మన బిడ్డలు డాక్టర్లు, సైంటిస్టులు కావల్నా.. లేదా బీజేపీ, కాంగ్రెస్ లు కోరినట్లు నక్సలైట్లు, లేదా పకోడీలు వేసుకునే వారు కావాలా అని ప్రశ్నించారు.
*బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు
వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ప్రదీప్ రావును మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇన్ని రోజులు తెలంగాణా ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని నన్ను చాలా మంది అడిగారని పవన్ కల్యాణ్ తెలిపారు. కానీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పైన విమర్శలు చేయవద్దు అని అనుకున్నానని చెప్పారు. ఉద్యమ పోరాటంతో, సకల జనుల సమ్మెతో, ప్రజల బలిదానంతో సాధించిన తెలంగాణ రాష్టంలో తప్పులు లేకుండా ఉంటుంది అని భావించానని చెప్పుకొచ్చారు. దశాబ్దం పాటు పెదవి మెదపలేదని.. అయితే 10 ఏళ్ళు గడిచిన తెలంగాణలో మార్పు రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నపుడు నేను తెలంగాణకు వస్తా అనుకున్నా.. ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నరు అందుకే వచ్చానని పేర్కొన్నారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణాలో అలాగే తిరుగుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో తిరుగుతని అన్నారు. మహిళ మాన, ప్రాణాల కోసం తెలంగాణలో పర్యటిస్తానని తెలిపారు. తెలంగాణలో కూడా జనసేన ఉంటుందని పవన్ అన్నారు. బలిదానాలు ఇచ్చిన తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమిషన్ తీసుకుంటున్నారని నేతలు చెబుతున్నారు.. అంటే ఇక్కడ అవినీతి ఎంత ఉందో అర్ధం అవుతుందని పవన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని తండాలకు వెళ్ళితే కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. అలాగే తెలంగాణ యువత పూర్తిగా మనసూర్తిగా కోరుకుంటే అనుకున్నది సాధించవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అక్కడ గుండాల పాలన నడుస్తోందని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని పవన్ తెలిపారు. కాగా.. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినని అన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుంది.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించండని కోరారు.
*అహంకార సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలి..
తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచారంలో దూకుడు పెంచాయి. అలాగే మద్దుతుగా ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం నల్గొండలో ప్రచారం చేపట్టారు. నల్గొండ చేరుకున్న ఖర్గే.. మొదట ఫ్లోరైడ్‌తో పోరాడి చనిపోయిన అంశల స్వామికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అహంకార సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని నల్గొండ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీకి బీజేపీ, హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఒక్కటే..మోడీ, కేసిఆర్ పాలనలో పేదల జీవితాలు దుర్భరంగా మరాయని మండిపడ్డారు. ఇందిరమ్మ మహా నేత.. ఆమెపై కేసిఆర్ చేస్తున్న విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నాగార్జున సాగర్ లాంటి గొప్ప ప్రాజెక్ట్ ఇందిరా గాంధీ నిర్మించారని ఆయన గుర్తు చేశారు. నాగార్జున సాగర్ నిర్మాణం జరిగి ఉండకపోతే… వరి సాగుకు తెలంగాణ ధాన్యాగారం అయ్యేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మ అని ఖర్గే పేర్కొన్నారు.
*రేపటి నుంచి శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం
రేపటి నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం నిరంతరాయంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఇది నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్ ధరను రూ.వెయ్యిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస హోమంలో భక్తులు నేరుగానే కాకుండా వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలు నుంచి 11 గంటలు వరకు హోమం నిర్వహిస్తామని, భవిష్యత్‌లో స్లాట్ రూపం టికెట్స్‌ను అందుబాటులో తీసుకువస్తామన్నారు. టీటీడి ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. టీటీడిలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తామని దళారీలు చెప్పే మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ ఉద్యోగాలు అన్నీ పారదర్శకంగా , అవినీతికి అస్కారం లేకుండా భర్తీ చేస్తామన్నారు.. దీని వెనుక దళారులు పోస్టులు ఇప్పిస్తామని మోసం చేస్తే నమ్మవద్దు. ఈ నియామకాలు చెన్నై ఐఐటీ వారితో నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు వస్తాయని.. దళారులు, రికమండేషన్‌తో వస్తాయి అని చెప్పే వారి మాటలు నమ్మవద్దన్నారు. ఉద్యోగాలు కల్పనలో ఛైర్మన్, ఈవోల ప్రమేయం ఉండదన్నారు. భవిష్యత్తులో ఈ శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్‌కు చాలా డిమాండ్ వస్తుందన్నారు. శాశ్వతంగా హోమం కోసం భవనాలను నిర్మిస్తామన్నారు. ఈనెల 26న ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.
ఇదిలా ఉండగా.. తిరుమలలో ఎల్లుండి(శుక్రవారం) శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జరగనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటలలోపు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు.పురాణాల ప్రకారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొలుపడం రివాజు. సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.
*”ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు”.. ఇజ్రాయిల్-హమాస్ ఒప్పందాన్ని స్వాగతించిన మోడీ..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ… ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాది ప్రధాని నరేంద్రమోడీ మరోసారి నొక్కి చెప్పారు. బుధవారం జీ 20 సమ్మిట్ వర్చువల్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జీ 20 సభ్య దేశాలతో కలిసి నడవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇజ్రాయిల్- హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు. ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ నేను ఈ వర్చువల్ సమ్మిట్ ప్రతిపాదించిన సమయంలో ఈ రోజు ప్రపంచ పరిస్థితి ఇలా ఉంటుందని ఊహించలేదు. గత కొన్ని నెలల్లో కొత్త సవాళ్లు ఎదురయ్యాయి’’ అని అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో అభద్రతన, అస్థిరత పరిస్థితులు మనందరికి ఆందోలన కలిగించే విషయమని అన్నారు. సంక్షోభాన్ని పశ్చిమాసియా ప్రాంతం అంతటికి పాకకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్-హమాస్ మరణాల గురించి మాట్లాడుతూ.. పౌరుల మరణాలు ఖండించదగినవేనని, అలాగే ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పారు. బందీల విడుదలను స్వాగతిస్తూ.. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతానికి మానవతా సాయాన్ని సకాలంలో అందించాలని కూడా ప్రధాని చెప్పారు. అక్టోబర్ 7 నాటి దాడుల్లో హమాస్ ఉగ్రవాదులు 1200 మందిని చంపడంతో పాటు ఇజ్రాయిల్ లోని 26 దేశాలకు చెందిన 240 మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. వీరి విడుదలపై ప్రస్తుతం ఒప్పందం కుదిరింది. ఇజ్రాయిల్ పాలస్తీనాకు చెందిన 150 మంది ఖైదీలను నాలుగు రోజుల్లో నాలుగు దశల్లో విడుదల చేస్తామని చెప్పింది, అందుకు ప్రతీగా ప్రతీ రోజు 10 మందిని మొత్తంగా 50 మంది ఇజ్రాయిల్ బందీలను అప్పగించనున్నారు.
*విశాఖ వేదికగా తొలి టీ20.. భారత్-ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
విశాఖ వేదికగా రేపు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. వైజాగ్ లోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రేపటి మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సిరీస్‌లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ గా మాథ్యూ వేడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో.. ప్రపంచ కప్ 2023లో భాగమైన కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అందులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు. కాగా.. సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరనున్నాడు. విశాఖపట్నంలోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌లకు పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పిచ్ పేసర్లు, స్పిన్నర్లకు మంచిగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ లో సెకండ్ ఛేజింగ్ బ్యాటింగ్ 67 శాతం మ్యాచ్‌లను గెలుచుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా జట్టులో 15 మంది సభ్యులు ప్రపంచ కప్‌లో ఆడినవారు ఉన్నారు. ఈ క్రమంలో భారత్.. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది కావున ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టీమిండియా ప్లేయింగ్ లెవన్ అంచనా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ/అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవన్ అంచనా:
స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.