*సమ్మె విరమించిన జేపీఎస్‌లు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె విరమించినట్లు ప్రకటించారు. వెంటనే విధుల్లో చేరతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై సానుకూలంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలపడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేపీఎస్ నేతలు ప్రకటించారు. దీంతో జేపీఎస్ సమ్మెకు పుల్ స్టాప్ పడింది. అయితే నేటి నుంచి జేపీఎస్ లు విధులకు హాజరు కావడంతో ప్రశాంతత నెలకొంది. తమను రెగ్యులరైజ్ చేయాలని 16 రోజుల పాటు సమ్మె చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న జేపీఎస్ లకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సమ్మె విరమించి ఇవాల మధ్నాహ్నం 12 లోపు విధులకు హాజరు కాకుంటే తమ పేర్లను లిస్ట్ లేనట్టే అని హెచ్చరించింది. సమ్మె చేస్తున్న పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పింది. ఇవాల మధ్యాహ్నం 12 గంటల లోపు డ్యూటీలో ఉన్నవారి లిస్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించింది. డ్యూటీలో లేనివారు ఉద్యోగులు కారంటూ ప్రకటించింది. 12 గంటల లోపు డ్యూటీలో లేని వారిని గుర్తించి, ఆయా గ్రామాలను గుర్తించి.. లిస్ట్ డిపిఓలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీలలో గ్రామ సభ పెట్టి డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ లుగా నియామకం చేయాలని వెల్లడించింది. గతంలో పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, లేదా రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించాలని సూచించింది. సమ్మె విరమించి వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చని పేర్కొంది. లేదంటే ఇప్పటికి వారి టర్మ్ ముగిసింది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని వివరించింది. అయితే జేపీఎస్ లకు లాస్ట్ గా ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి జేపీఎస్ లు మధ్యాహ్నం 12 లోపు విధులకు హాజరవుతారా? సమ్మె కొనసాగిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో జేపీఎస్ లు విధుల్లో చేరుతామని ప్రకటించారు. దీంతో జేపీఎస్ ల సమ్మెకు పుల్ స్టాప్ పడింది.
*కర్ణాటక ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు
కర్ణాటక ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీచమైన, ద్వేషపూరిత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను మెప్పించడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకర్షించడంలో విఫలమైందని, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్ అన్నారు. నీచమైన, విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక వసతుల కల్పనలో, దేశ భవిష్యత్తు కోసం హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఆకాంక్షించారు. కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. కర్ణాటక ప్రజలు మోడీని ఓడించి, జేడీఎస్‌కి మద్దతు పలికిన కేసీఆర్ ని ఓడించారని, హాంగ్ రావాలని కేసీఆర్ చూశారన్నార టీ కాంగ్రెస్ నేతలు అన్నారు. మోడీని, కేసీఆర్ ఆలోచన కర్ణాటక ప్రజలు తిరస్కరించారని.. అదే ప్రభావం తెలంగాణ ఎన్నికలపై చూపుతాయన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారని ఎక్కడ ప్రజల తీర్పుని స్వాగతించలేదని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. మోడీ ఓడిపోతే కేటీఆర్ ఎందుకు బాధ పడుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర లో సభలు పెట్టె కేసీఆర్..కర్ణాటక లో ఎందుకు పెట్టలేదు. మోడీ ని ఓడించండి అని ఎందుకు పిలుపు ఇవ్వలేదు. తెలంగాణలో కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
*తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమలలోని అంజనాద్రిపై ఈ నెల 14వ తేదీ(నేటి) నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అంజనాద్రి ఆకాశ గంగ, జాపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాల వద్ద హనుమజ్జయంతి వేడుకలు జరగనున్నాయి. హనుమజ్జయంతి రోజున ఈ ఆలయాల్లో ఆంజనేయస్వామికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు, నివేదనలు నిర్వహిస్తారు. ఉదయం 7:30 గంటలకు బేడి ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు ఆకాశగంగ ఆంజనేయస్వామివారికి అభిషేకం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు టీటీడి తరపున జాపాలి ఆంజనేయస్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏడవ మైలు వద్ద ఆంజనేయస్వామి వారికి అభిషేకం జరగనుంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. మరోవైపు హనుమజ్జయంతి సందర్భంగా నేడు పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆకాశగంగ, పాపనాశనం ప్రాంతాల వద్ద పార్కింగ్ సమస్య ఉంటుందని.. అందుకే తిరుమల నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు గమనించి, సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.
*కర్ణాటకలో సెంటిమెంట్ రిపీట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఫలితాల్లో బీజేపీ 65 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటక రాజకీయ ఆనవాయితీ పునరావృతమైంది. కర్ణాటక ఎన్నికల్లో ఓ పార్టీ ఈ స్థాయిలో మెజార్టీ దక్కించుకోవడం దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. కర్ణాటకలో గత 38 సంవత్సరాలుగా ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. 1983, 1985 సంవత్సరాలలో జనతా పార్టీ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. ఆ తర్వాత నుండి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలవలేదు. 2013లో కాంగ్రెస్ పార్టీ గెలవగా, 2018లో బీజేపీ, ఇప్పుడు 2023లో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో అత్యధిక మెజార్టీ. 1989లో కాంగ్రెస్ 179 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ పార్టీయే 1999లో 132 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా 136 స్థానాలు గెలిచి 1999 రికార్డును బద్దలు కొట్టింది. కాంగ్రెస్ పార్టీకి 1989లో వచ్చిన 179 సీట్ల తర్వాత అత్యధికం ఇదే. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 40 శాతానికి కాస్త అటు, ఇటుగా మాత్రమే ఉంది. బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం భారీగా తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. అధికారం విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ చెరోసారి అధికారంలోకి వస్తున్నాయి. చామరాజనగర్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రుల పాలిట శాపంగా మారిందనే అపవాదును కొన్న ఏళ్లుగా మోస్తూనే ఉంది. చామరాజనగర్‌లో అడుగుపెట్టిన సీఎం.. ఆ పదవిని కోల్పోతారనే నమ్మకం కర్ణాటకలో పాతుకుపోయింది. తాజా ఫలితాలతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రెండుసార్లు ఈ జిల్లాలో పర్యటించారు. ఫలితాల్లో బీజేపీ ఓటమిపాలవ్వడంతో బొమ్మై సీఎం పదవి కోల్పోక తప్పలేదు. మే 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 73.19శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2013లో 71.83శాతం, 2018లో 73.36శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
*కర్ణాటకలో ఓడిపోయిన మంత్రులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హస్తం పార్టీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. కాంగ్రెస్ ధాటికి బీజేపీ మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఏకంగా 136 సీట్లు గెల్చుకుంది. మరోసారి అధికారం చేజిక్కించుకుంటామని భావించిన బీజేపీ కేవలం 64 స్థానాలకు పరిమితమైంది. కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామని ప్రకటనలు చేసిన జేడీఎస్ 20 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కేబినెట్ మంత్రులు సైతం కాంగ్రెస్ దెబ్బకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో తాజా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సహా 12 మంది మంత్రులు విజయం సాధిస్తే 11 మంది మంత్రులు మాత్రం ఓడిపోయారు. హిజాబ్ ఆందోళనను పెంచి పోషించడమే కాకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలతో సంచలనం రేపిన మరో మంత్రి బీసీ నగేష్ సైతం ఓడిపోయారు. ఓడిపోయిన మంత్రుల్లో రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్న, ఎల్లాపూర్ నుంచి శివరామ్ హెబ్బార్, వరుణ నుంచి వి సోమన్న, బళ్లారి నుంచి బీఎస్ శ్రీరాములు, చిక్కనాయకపల్లి నుంచి మధుస్వామి, ముథోల్ నుంచి గోవింద కరజోల్, చిక్ బళ్లాపూర్ నుంచి కే సుధాకర్, హోస్కోట్ నుంచి ఎంటీబీ నాగరాజ్, హీరేకెరూర్ నుంచి బీసీ పాటిల్, బీళగి నుంచి మురుగేష్ నిరాణి తో పాటు బీసీ నగేశ్, శంకర్ పాటిల్ తదితరులు ఓటమిపాలయ్యారు.
*పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేధించలేకపోయింది. 136 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో.. పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నిజానికి.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ కలిసి ప్రారంభంలో కురిపించిన పరుగుల వర్షం చూసి.. ఢిల్లీ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ ఔట్ అయ్యాడో.. అప్పటి నుంచి ఢిల్లీ పతనం మొదలైంది. అదేదో పెళ్లి భోజనాలకు పరుగులు తీసినట్టు.. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. పంజాబ్ బౌలర్ల ధాటికి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో.. రన్ రేటు పెరిగిపోతూ వచ్చింది. ఇక చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్లూ లేకపోవడంతో, 136 పరుగులకే ఢిల్లీ చాపచుట్టేయాల్సి వచ్చింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (65 బంతుల్లో 103) సెంచరీతో చెలరేగడం వల్లే పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. మొదట్లో వార్నర్, సాల్ట్ కలిసి తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. పవర్ ప్లేలో ఇద్దరు దంచికొట్టారు. ముఖ్యంగా.. వార్నర్ అయితే బౌండరీల మోత మోగించేశాడు. తొలి వికెట్‌కి వీళ్లు 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లు కొట్టిన కొట్టుడు చూసి.. ఢిల్లీ విజయం ఖాయమని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ.. సాల్ట్ వికెట్ పడ్డాక అంతా తలక్రిందులైంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఔట్ అవుతూ వచ్చారు. అప్పటికే 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 54 పరుగులు చేసిన వార్నర్ అయినా జట్టుని ఆదుకుంటాడని అనుకుంటే.. అతడు కూడా 86 టీమ్ స్కోర్ వద్ద వికెట్ కోల్పోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దిగిన మనీష్ పాండే ఎప్పట్లాగే ఉసూరుమనిపించాడు. సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఒక మ్యాచ్‌లో అర్థశతకంతో అందరినీ ఆశ్చర్యపరిచిన హకీమ్ ఖాన్ సైతం ఈసారి చేతులెత్తేశాడు. ఇలా మంచి బ్యాటర్లందరూ ఈసారి హ్యాండ్ ఇవ్వడంతో.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. తన 4 ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. నథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో పంజాబ్ జట్టు తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగలిగింది. డీసీ ఇంటిదారి పట్టింది.