*నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు అమరావతి సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి తమకు సమాచారం అందినట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో అయినా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం, తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సాయంత్రం 4.30 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ జులై నాటికి ప్రస్తుత పీఆర్సీ గడువు పూర్తి కానుంది. గతంలో డీఏ, ఇతర పెండింగ్ బకాయిల విడుదలకు టైంబాండ్ పెట్టింది.
*తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో డ్రోన్ షో
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులో డ్రోన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ చిత్రాలు ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 3న రైతు దినోత్సవం ఘనంగా జరుపుకున్న ప్రజానికం.. జూన్ 4న సురక్షా దినోత్సవం జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు. ఆ లేజర్ షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ.. వాటి విజువల్స్ ను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపిస్తూ.. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేములవాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం, సైబరాబాద్ పోలీస్ లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్అనే నినాదంతో ఈ లేజర్ షో ముగిసింది. ఈ లేజర్ షోను చూసేందుకు వచ్చిన ప్రజలు.. ఆ షోను చూసి ఆనందం, కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు.
*బాసర ట్రిపుల్ ఐటీలో సిబ్బంది నిర్వాకం
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి హాస్టల్‌కు రావడంతో.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగటంతో వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కాస్మోటిక్స్, డ్రెస్సెస్, సర్టిఫికెట్స్ బయట పడేసారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగి హాస్టల్ కు వచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అయితే మరోవైపు రూమ్ లకు తాళాలు వేయవద్దు, ఎలాంటి సామాగ్రి రూమ్ లలో ఉంచవద్దని ముందే విద్యార్థులకు చెప్పాము అని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తెలిపింది. రూమ్ ల మరమత్తులు, క్లీనింగ్ లో భాగంగా చెత్త ఒక వైపు, అవసరం వచ్చే సామాగ్రి మరో వైపు వేసాము అని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెల్లడించారు. సామాగ్రిని ఎక్కడ బయట పడేయలేదు అని డైరెక్టర్ అన్నారు.. స్టోర్ రూంలో భద్రపర్చామని తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
*ఇమ్రాన్ ఖాన్‌పై మిలిటరీ కోర్టులో విచారణ
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కలవరపెడుతోంది. ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపడుతుండటం, దీనికి ప్రజా మద్దతు ఉండటంతో అక్కడి ప్రభుత్వం, సైన్యం, ఐఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ ను, అతని పార్టీ పీటీఐని దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు కేసుల్లో కోర్టుల నుంచి రక్షణ పొందుతున్న ఇమ్రాన్ ఖాన్ ను మిలిటరీ కోర్టులో విచారించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత మే 9న పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై సైనిక కోర్టులో విచారణ చేయవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. మే 9న సైనిక, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసిన కేసులో ఇమ్రాన్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే మే 9 ఘర్షణలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఏదైనా ఆధారాలు బయటపడితే సైనిక కోర్టులో విచారించే అవకాశం ఉంది. ఒక మాజీ ప్రధానిని సైనిక కోర్టులో విచారించే అవకాశం ఉందా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. తప్పకుండా విచారించే అవకాశం ఉందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. అంతకుముందు మే 9 అల్లర్లకు ముఖ్య కారణం ఇమ్రాన్ ఖాన్ అని హోంమంత్రి రాణా సనావుల్లా అన్నారు. ఈ ఆందోళన సమయంలో రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కార్ప్స్ కమాండర్ నివసించే లాహోర్‌లోని జిన్నా హౌస్‌పై దాడి చేయడంతో పాటు దేశంలోని వివిధ ఆర్మీ కంటోన్మెంట్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. అంతకుముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ..మే 9 దాడులకు పాల్పడినవారు, ప్లాన్ చేసినవారిని ఆర్మీ చట్టం కింద విచారిస్తామని, వారి పట్ల ఉదాసీనత చూపబోం అని అన్నారు. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో తన ప్రమేయం లేదని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను జైలులో ఉన్నానని, ప్రభుత్వమే కావాలని తనపై దేశద్రోహం కేసు నమోదు చేసి, పదేళ్లు జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
*ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదలైన యుద్ధం
ప్రపంచంలోని రెండు దేశాలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతోంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. అదే సమయంలో, రెండు మతోన్మాద ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ పోరు నీటి గురించే కావడమే పెద్ద విషయం. మీడియా కథనాల ప్రకారం ఆదివారం, సరిహద్దులో ఇరు దేశాల సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఇందులో నలుగురు జవాన్ల మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఇరాన్ సైనికులు కాగా, ఒకరు తాలిబన్ సైనికులు. ఇస్లామిక్ రిపబ్లిక్ సరిహద్దులో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ గురించి ఇరాన్ ప్రభుత్వ ఏజెన్సీ IRNA సమాచారం ఇచ్చింది. సమాచారం ప్రకారం, వారి మధ్య కాల్పులు ఇరాన్‌లోని సిస్తాన్, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని నిమ్రోజ్ ప్రావిన్స్ సరిహద్దులో జరిగాయి. వాస్తవానికి హెల్మాండ్ నది నీటి విషయంలో రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ నీటిపై ఇద్దరూ తమ హక్కులను చాటుకున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం, రెండు దేశాల మధ్య ఈ వివాదం చాలా తీవ్రంగా మారింది. ఇరాన్ హెల్మాండ్‌లో నీటి కొరత పై తాలిబాన్లను నిందించింది. ఆ సమయంలోనే ఇరాన్‌కు నీటి సరఫరాను ఆపలేదని తాలిబాన్ చెబుతోంది. ఆఫ్ఘన్ తాలిబాన్ ఇరాన్‌ను హెచ్చరించింది. కేవలం 24 గంటల్లో ఇరాన్‌పై విజయం సాధించగలమని తాలిబాన్ కమాండర్ హమీద్ ఖొరాసాని అన్నారు. దీనితో పాటు, ఇరాన్ మొదట కాల్పులు ప్రారంభించిందని తాలిబాన్ ఆరోపిస్తోంది. తాలిబానీ కమాండర్ అబ్దుల్ హమీద్ ఖొరాసానీ ఒక వీడియో ట్వీట్ చేసాడు. ఇందులో ఇరాన్ రెచ్చగొట్టే చర్యకు దిగిందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఇరాన్ హెచ్చరించింది. నిజానికి ఆగస్టు 2021 నుండి, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై నియంత్రణలో ఉంది. ఆయన 2001 నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అమెరికా తాలిబాన్లను కాబూల్ నుండి తరిమికొట్టింది. అదే సమయంలో, 2021 సంవత్సరంలో US సైన్యం వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, తాలిబాన్ మళ్లీ కాబూల్‌ను స్వాధీనం చేసుకుని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
*టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్.. రూ.80వేలు తగ్గింపు
అమ్మకాలను పెంచుకునేందుకు టెస్లా మరోసారి ఆఫర్ల వర్షం కురిపించింది. ఈసారి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై దాదాపు రూ.80,000 తగ్గింపు లభించనుంది. అమెరికన్ ఆటో కంపెనీ మోడల్ ఎస్, మోడల్ ఎక్స్‌లపై ఈ తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సేవ మూడు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇది రెఫరల్ ప్రోగ్రామ్, అయితే ఇప్పటికే టెస్లా కస్టమర్‌లుగా ఉన్నవారు మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోగలరు. రెఫరర్లు, కారు కొనుగోలుదారులు కూడా క్రెడిట్‌లను పొందుతారు. ఈ క్రెడిట్‌లను ఉచిత సూపర్‌చార్జర్ కోసం రీడీమ్ చేయవచ్చు. టెస్లా ఆన్‌లైన్ స్టోర్ నుండి కొనుగోళ్లకు, సైబర్‌ట్రక్ రాఫిల్ కోసం క్రెడిట్‌లను ఉపయోగించవచ్చు. నిజానికి టెస్లా రిఫరల్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది, అయితే ఎలక్ట్రిక్ కార్ కంపెనీ దానిని పునఃప్రారంభించింది. టెస్లా లూట్ బాక్స్‌ను అప్‌డేట్ చేసింది. ఇది మొబైల్ యాప్‌లో భాగం, ఇది రెఫరల్ ప్రయోజనాలను రెఫరల్ ప్రోగ్రామ్‌గా మారుస్తుంది. మోడల్ ఎస్ , మోడళ్ల ఎక్స్ కొనుగోలుపై సుమారు రూ.80,000 తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కాకుండా, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సేవ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. మోడల్ 3, మోడల్ Y పై కూడా క్రెడిట్‌లు అందుబాటులో ఉన్నాయి. టెస్లా ఈ రెండు కార్ల కోసం దాదాపు రూ. 1.23 లక్షల లూట్ బాక్స్ క్రెడిట్‌లను అందిస్తోంది. టెస్లా చాలా కాలంగా తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీని కోసం, ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ మరిన్ని కార్లను విక్రయించడానికి వివిధ చర్యలు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లో తుఫాను సృష్టించిన కంపెనీ 2022లో ధరను గణనీయంగా తగ్గించింది. సంస్థ ఈ ప్రయత్నం 2023 మొదటి త్రైమాసికం వరకు కొనసాగింది. టెస్లా రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని చేస్తోంది. గతంలో చైనాలో కూడా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించింది.
*సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే
ఆదివారం జరిగిన ఒపెక్ ప్లస్ సమావేశంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా అటువంటి నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా భవిష్యత్తులో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే అవకాశాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను పెంచాల్సిన అవసరం లేదని అంచనాలు ఉన్నాయి. OPEC ప్లస్ సమావేశంలో సౌదీ అరేబియా జూలై నుండి రోజుకు ఒక మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. మిగిలిన OPEC ప్లస్ దేశాలు 2024 చివరి నాటికి ఉత్పత్తిని తగ్గించుకుంటాయి. ఈ నిర్ణయం తర్వాత ముడిచమురు ధరలో పెరుగుదల కనిపిస్తోంది.సౌదీ ఇంధన శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇది మాకు గొప్ప రోజు. సమావేశంలో ఏకాభిప్రాయం కుదరడం అభినందనీయమన్నారు. ఉత్పత్తి కోసం నిర్దేశించబడిన కొత్త లక్ష్యాలు మరింత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తగ్గుతున్న చమురు ధరలు అమెరికన్ డ్రైవర్లు తమ ట్యాంకులను మరింత చౌకగా నింపడంలో సహాయపడాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ద్రవ్యోల్బణం నుండి కొంత ఉపశమనం కలిగించాయి. రాబోయే నెలల్లో ఇంధన డిమాండ్‌లో అనిశ్చితి ఉన్నందున మరింత కోత అవసరమని సౌదీ అరేబియా భావించింది. కోవిడ్ -19 తర్వాత కూడా చైనా నుండి డిమాండ్ ఆశించినంతగా కనిపించలేదు.OPEC చమురు కార్టెల్‌లో.. సౌదీ అరేబియా ప్రధాన ఉత్పత్తిదారు మరియు OPEC సభ్యులలో ఒకటి. ఇది ఏప్రిల్‌లో రోజుకు 1.16 మిలియన్ బ్యారెల్స్‌కు ఉత్పత్తి చేసింది. ఇందులో సౌదీ అరేబియా వాటా 500,000. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ఒక నెల ముందు.. రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లను తగ్గించనున్నట్లు OPEC+ అక్టోబర్‌లో ప్రకటించింది. అయితే, ఆ కోతలు చమురు ధరలకు కొద్దిగా శాశ్వత ప్రోత్సాహాన్ని అందించాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 87డాలర్లకు పెరిగింది, అయితే కొన్ని రోజుల తర్వాత ధర బ్యారెల్‌కు 75డాలర్లకు పడిపోయింది. అమెరికా క్రూడ్ 70డాలర్ల దిగువకు పడిపోయింది. సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం తీసుకురావాలని భావిస్తోంది. అంటే అది తన సంపాదనను చమురుపై మాత్రమే ఆధారపడాలని అనుకోవడం లేదు. దాని ఆలోచనలను కొనసాగించడానికి అధిక చమురు ఆదాయం అవసరం. అందుకే చమురు ఉత్పత్తిని తగ్గించి ధరలను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. సౌదీ అరేబియా దాని క్యాపెక్స్‌ను చేరుకోవడానికి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 81డాలర్లు ఉండాలి, ఇది చాలా కాలంగా బ్యారెల్‌కు 75 నుండి 77డాలర్ల వరకు ట్రేడ్ అవుతోంది.
*రికార్డులు ఉంటే రాసి పెట్టుకోండి… 24 గంటల్లో అన్నీ లేస్తాయ్…
రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ని సీతాదేవిగా చూపిస్తూ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్, ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకూ జరగనంత గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి రెడీ అయ్యారు. తిరుపతిలో అయోధ్య కనిపించేలా దాదాపు రెండు కోట్ల ఖర్చుతో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆ స్థాయిలో ఇంకా చెప్పాలి అంటే ఆ స్థాయిని మించి జరగబోతున్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఇదే. 200 మంది సింగర్స్, 200 మంది డాన్సర్స్, వేల మంది అభిమానుల మధ్య ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. 2:27 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్, ఆదిపురుష్ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలని తారాస్థాయికి తీసుకోని వెళ్లేలా ఉంటుందని సమాచారం. ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ పైన ద్రుష్టి పెట్టి సెకండ్ ట్రైలర్ ని కట్ చేశారట. ఆదిపురుష్ ప్రీరిలీజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ ఫాన్స్ ఈ సెకండ్ ట్రైలర్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యం ఇప్పటివరకూ ఉన్న డిజిటల్ రికార్డులని బ్రేక్ చేస్తాం, కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాం అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే జరిగితే మరో 24 గంటల్లో సోషల్ మీడియాలో తుఫాన్ రావడం గ్యారెంటీ.