*ఉమ్మడి ఏపీ భవన్ విభజన, తెలంగాణ భవన్ నిర్మాణంపై సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉమ్మడి ఏపీ భవన్ విభజన, తెలంగాణ భవన్ నిర్మాణం పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై.. తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో ముఖ్యమంత్రి చర్చించారు. కాగా.. ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, తెలంగాణ నూతన భవన్ నిర్మాణ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇదిలా ఉంటే.. ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చించనట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, ఇటీవల వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించారని సమాచారం. అంతేకాకుండా.. లోక్ సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, సోనియాగాంధీ పోటీ తదితర అంశాలపై సీఎం రేవంత్ అధిష్ఠానం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
*మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు
తెలంగాణలో 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తెలంగాణ రోడ్లు భవనాల శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించి సెక్రటేరియట్ లోని చాంబర్లో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలోనే తనకు దిల్ రాజు ఒక్కడే కాల్ చేసి విష్ చేశాడని అయన తప్ప మరెవరూ విష్ చేయలేదని అన్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వెళ్లి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రముఖులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. నిర్మాతలు దిల్ రాజు, సుధాకర్ రెడ్డి, సురేష్ బాబు, సి కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నట్టి కుమార్ వంటి వారి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఇక సినీ కార్మికులకు ఉన్న కష్టాలు, జూనియర్ ఆర్టిస్టులకు ఉన్న సమస్యలు, షూటింగ్ కోసం కొత్త పర్మిషన్లు ఇలా..సంక్షేమం వంటి విషయాల్లో ఎలాంటి కొత్త నిర్ణయాలతో మంత్రిత్వ శాఖ సహకరిస్తుందేమో చూడాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సమానంగా అందరికీ నంది అవార్డులు ఇచ్చిన విషయం తెల్సిందే, త్వరలోనే నంది అవార్డుల విషయం మీద ఒక ఒక నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డిని కలిసి కోరినట్టు తెలుస్తోంది.
*ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. కొంచెం ఓపిక పట్టండి
ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం ముగిసింది. ప్రజావాణి కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రెండు వైపులా భారీ క్యూ లైన్ బారులు తీరారు. ప్రజల సమస్యలను అధికారులు ఆన్లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటల వరకు దరఖాస్తుల స్వీకరించారు. ఉదయం 10 గంటలలోపు హాజరైన వారికి అవకాశం కల్పించారు. భారీగా అగ్రి గోల్డ్ బాధితులు తరలి వచ్చారు.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారిని ఆదుకోవాలని వారి సమస్యలను తెలిపారు. అనేక జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాభవన్‌కు చేరుకున్నారు.. ధరణి సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం సమస్యలతో జనం ఎక్కువగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని అన్నారు. కాగా.. తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ టీఎస్‌పీటీఎంఎం ఆధ్వర్యంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాలపై పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించడం, ఓలా, ఉబర్, ర్యాపిడ్ బైక్‌ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించడం వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలో ఆటో యూనియన్లతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు 5126 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చారని అన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని, వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆ విషయం మా దృష్టికి వచ్చిందని అన్నారు. ఆటో వాళ్లు మా సోదరులే… వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వ ఆలోచన ఉంటుందని అన్నారు. ఎవరూ నిరసపడొద్దని, త్వరలోనే మీ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతామని తెలిపారు.
*హైకోర్టు మెట్లెక్కిన మల్లారెడ్డి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కేశవాపురం గ్రామంలో భూకబ్జా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదైన కేసును కొట్టివేయాలని మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ కె. సురేందర్ ముందు విచారణకు వచ్చింది. అయితే ప్రజాప్రతినిధుల కేసును విచారిస్తున్న ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గతవారం కేసు నమోదైన విషయం తెలిసిందే.. గిరిజనుల భూములు ఆక్రమణకు గురయ్యాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలాల్లోని కేశవరం గ్రామంలో లంబాడీలకు చెందిన సర్వే నంబర్ 33, 34, 35లో 47 ఎకరాల 18 గుంటలు. తమకు సంక్రమించిన భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన 9 మంది అనుచరులు కుట్రతో మోసం చేసి అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఈ మేరకు సమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. లంబాడీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన 9 మంది బినామీ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకుని కబ్జాకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, ఆయన అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్‌రెడ్డి, కేశవపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరిమోహన్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్‌ను పోలీసులు విచారించారు. సొసైటీ, సమీర్‌పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై సమీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటింగ్ కేసు నమోదైంది.
*సీట్లల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు..
ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. కాగా, సీట్లల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తుంది.. మార్పులు చేర్పులకు అవకాశం ఉండే సెగ్మెంట్లు ఇవే..?
1. ఉమ్మడి తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గం పేట, పి.గన్నవరం, రామచంద్రాపురం.
2. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు.
3.ఉమ్మడి కృష్ణా: విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగడ్డ, పెడన.
4. ఉమ్మడి ప్రకాశం జిల్లా: దర్శి.
5. ఉమ్మడి గుంటూరు జిల్లా: పొన్నూరు.
6. ఉమ్మడి అనంతపురం జిల్లా: పెనుగొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం.
ఇవే కాకుండా మరిన్ని మార్పులు చేర్పులకు ఆస్కారం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి. కొంత మందికి సరిగ్గా పని చేసుకోమని వార్నింగ్ ఇచ్చేందుకు సీఎం జగన్ పిలుస్తున్నారని సమాచారం వస్తుంది. ఇక, ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెళ్లారు. కాగా, ఇప్పటికే రాయలసీమకు చెందిన మరికొందరు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్ కు కూడా పిలుపు రావడంతో ఆమె కూడా వెళ్లారు.. ఈ మార్పుల తర్వాత ఎన్నికల కోసం వైసీపీ పార్టీ కసరత్తు చేయనుంది.
*హైదరాబాద్ లో పెరిగిన కూరగాయల ధరలు.. సామాన్యుల జేబులకు చిల్లే..
మొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నగరంలో నిన్న చికెన్ ధరలు కొండేక్కాయి.. నేడు కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ పెరిగిన ధరలు సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి.. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి… కానీ ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం లేదని జనాలు వాపోతున్నారు.. గత సోమవారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా తగ్గాయి.. అందులో చికెన్ ధరలు వందకు పడిపోయాయి.. దీంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. దానితోపాటు చలికాలం కావడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, పంట చేతికి సరిగా అందకపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయి.. ప్రస్తుతం బీన్స్ ధరలు రూ. 50 ఉండగా, చిక్కుడు కాయల ధరలు మాత్రం రూ. 65 దగ్గర ఉన్నాయి.. అదే విధంగా దొండకాయలు 50 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, అతి తక్కువగా అంటే టమాటో ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది.. అంతేకాదు ఉల్లి, వెల్లుల్లితో పాటుగా అల్లం, ఆకుకూరల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. హోల్‌సేల్ లో కిలో వెల్లుల్లిపై ధర 240 పలుకుతోంది ఇక పావు కిలో అల్లం ధర 40 రూపాయలు ఉండగా కిలో అల్లం ధర 150 రూపాయలకు పైనే ఉంది అంటూ వ్యాపారాలు చెప్తున్నారు.. మొన్న కురిసిన వర్షాలకు పంట లేకపోవడం.. నాణ్యత లేకపోవడం, కొత్త పంట రాకపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.. కాయ కష్టం చేసుకొని నోటికి రుచిగా తినడానికి లేకుండా పోయింది సామాన్యులకు..
*సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు..
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదా శివనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం బయటపడిందని ఎస్పీ పేర్కొన్నారు. నవంబర్ 29న ప్రసాద్ ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. అంతేకాకుండా.. హత్యలు చేయడానికి వాడిన కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు నగదు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు ఎస్పీ చెప్పారు. ఫోన్లు కూడా మృతులవేనని తెలిపారు. ఆస్తి కోసమే ఈ హత్యలు చేశారు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రాథమిక విచారణ అని.. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
*ఇండియా కూటమి సమావేశం.. పొత్తులపై అలయెన్స్ కమిటీ ఏర్పాటు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై నిరసన తెలిపిన 141 మంది విపక్ష ఎంపీలపై ఉభయ సభల్లో వేటు పడిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడమే కాకుండా సస్పెన్షన్‌పై భవిష్యత్ కార్యచరణను ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఇండియా కూటమి నేతల సమావేశం జరుగుతోంది. ఈ కీలక సమావేశానికి హాజరైన సోనియా గాంధీ, లాలూ యాదవ్, టీఆర్ బాలు, ఎంకే స్టాలిన్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై ఏఐసీసీ నేషనల్ అలయెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురితో ఏఐసీసీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కన్వీనర్‌గా ముకుల్ వాస్నిక్‌ను నియమించారు. సభ్యులుగా . అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్‌లను ప్రకటించారు. ఈ కమిటీ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమికి ఇది మొదిటి సమావేశం కాగా.. మొత్తానికి ఇది నాల్గవ సమావేశం.
*ఇప్పటి వరకు పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెండ్
ఈరోజు లోక్‌సభలో గందరగోళం సృష్టించిన 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ ఎంపీలు మొత్తం శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ చర్యతో ప్రస్తుత సెషన్‌లో సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 141కి చేరింది. సోమవారం నాడు 33 మంది లోక్‌సభ ఎంపీలు, 45 మంది రాజ్యసభ ఎంపీలు అంటే మొత్తం 78 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో డానిష్ అలీ, ప్రతిభా సింగ్, దినేష్ చంద్ర యాదవ్, ఎస్టీ హసన్, శశి థరూర్, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్, రవ్‌నీత్ సింగ్ బిట్టు ఉన్నారు. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ, చందేశ్వర్ ప్రసాద్, మాలా రాయ్, కార్తీ చిదంబరం కూడా సస్పెండ్ అయ్యారు. ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనపై పలువురు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఎంపీని తిట్టిన వాడు సభలో కూర్చుంటాడని, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తున్నారని, ఇది ఏ ప్రజాస్వామ్యమని ఓ ఎంపీ అన్నారు. నియంతృత్వానికి స్వస్తి పలకాలి. లోక్‌సభలో ప్లకార్డులతో నిరసన తెలిపి, హెచ్చరించిన తర్వాత కూడా రచ్చ కొనసాగించినందుకు ఈ ఎంపీలను సస్పెండ్ చేశారు. మహాబలి సింగ్, ఎం. ధనుష్కుమార్, ఎస్. సెంథిల్‌కుమార్, దినేశ్వర్ కామత్‌లను కూడా సస్పెండ్ చేశారు. కొత్త సభకు ఎవరూ ప్లకార్డులు తీసుకురాకూడదని ఇప్పటికే నిర్ణయించామని, అయినా అదే చేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ ఎంపీలందరినీ శీతాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాత, డింపుల్ యాదవ్ మాట్లాడుతూ, మేము మా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నాము కాబట్టి ఈ చర్య తీసుకున్నాము. పార్లమెంట్ భద్రత విషయంలో జరిగిన పొరపాట్లపై చర్చ జరగాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు. పోలీసులంతా అమిత్ షా ఆధ్వర్యంలోనే ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయారని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
*కేంద్రం కొవిడ్ అలర్ట్ జారీ.. కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..
గుర్తించబడిన కొత్త కొవిడ్-19 వేరియంట్ భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అధికారులు, సాధారణ ప్రజలలో భయాందోళనను కలిగిస్తోంది. JN.1 కోవిడ్ సబ్‌వేరియంట్ మొదటగా లక్సెంబర్గ్‌లో గుర్తించబడింది. ఇది పిరోలా వేరియంట్ (BA.2.86) వారసుడిగా పరిగణించబడుతోంది. దీని మూలాలు ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లో ఉన్నాయి. ఈ రూపాంతరం భారతదేశంలో క్రియాశీల కొవిడ్ కేసుల పెరుగుదలకు దారితీసింది. డిసెంబర్ 18 నాటికి కొవిడ్ కేసుల సంఖ్య 1,828కి చేరుకుంది. కేరళలో JN.1 కారణంగా ఇటీవల కనుగొనబడిన ఒక మరణంతో నివేదించబడింది. ఈ పరిణామానికి ప్రతిస్పందనగా తగిన ఆరోగ్య ఏర్పాట్లు ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీ చేసింది.
కొవిడ్-19 వేరియంట్ JN.1 లక్షణాలు:
*ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, కొత్త కొవిడ్ వేరియంట్‌తో సంబంధం ఉన్న లక్షణాలు సాధారణంగా తేలికపాటి నుంచి మితమైనవి.
*జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఉండవచ్చు.
*చాలా మంది రోగులు తేలికపాటి ఎగువ శ్వాసకోశ లక్షణాలను అనుభవిస్తారు. ఇవి సాధారణంగా నాలుగు నుంచి ఐదు రోజులలో మెరుగుపడతాయి.
*కొత్త వేరియంట్ కారణంగా ఆకలిని కోల్పోవడం, నిరంతర వికారంతో ఉండవచ్చు. ఆకస్మికంగా ఆకలిగా అనిపించడం ప్రత్యేకించి ఇతర లక్షణాలతో పాటుగా JN.1 వేరియంట్ వల్ల కనిపించవచ్చు. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.
*JN.1 వేరియంట్ మరొక ముఖ్యమైన సంకేతం విపరీతమైన అలసట. విపరీతమైన అలసట, కండరాల బలహీనత ద్వారా వర్గీకరించబడిన ఈ లక్షణాలు సాధారణ కొవిడ్ అలసటను మించి ఉంటాయి. సొంత పనులు కూడా చేసుకోవడానికి కూడా శరీరం సహకరించకుండా పోతుంది. అటువంటి అలసటను ఎదుర్కొంటున్న వ్యక్తులు వైద్యులను సంప్రదించాలి.
*అరుదైన సందర్భాల్లో, JN.1 వేరియంట్‌తో సోకిన వ్యక్తులు జీర్ణశయాంతర సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇది జీర్ణ ఆరోగ్యంలో మార్పులకు దారితీస్తుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలు సంభవించవచ్చు.
*ఐపీఎల్ చరిత్రలో రికార్డు.. అత్యధిక ధర పలికిన స్టార్క్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. గత 8 సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ఆడలేదు. అయితే.. 2023 వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఫైనల్ లో జట్టు విజయం కోసం కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. స్టార్క్ మునుపు ఉన్న ఫామ్ కంటే, ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నారు. ఈ క్రమంలో అతను ఈ ఐపీఎల్ లో.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో అతని పేరు రాగానే.. స్టార్క్ ను సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పెద్ద మొత్తంలో వేలం వేసింది. ఆ తర్వాత ఆ ఫ్రాంఛైజీలు తప్పుకోవడంతో.. కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ వేలంలోకి వచ్చాయి. ఈ రెండు ఫ్రాంఛైజీల మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగింది. చివరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. పాట్ కమిన్స్ రూ. 20.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టి, మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లు చెల్లించి తమ జట్టులోకి చేర్చుకుంది. మిచెల్ స్టార్క్ తన చివరి ఐపీఎల్ 2015లో ఆడాడు. ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ స్వింగ్ బౌలర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 27 మ్యాచ్‌లు ఆడాడు. అతను 20.38 సగటుతో మరియు 7.17 ఎకానమీ రేటుతో మొత్తం 34 వికెట్లు తీశాడు. అయితే.. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మిచెల్ స్టార్క్ ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి మరీ…