*చంద్రబాబుపై మంత్రి సీదిరి సీరియస్ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్‌లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడు అంటూ ఆయన ప్రశ్నించారు. తన సంపదను తాను సృష్టించుకోవడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు మాయా ప్రపంచాన్ని సృష్టించాడు.. అది ఒక పెద్ద స్కాం అని మంత్రి ఆరోపించారు. తాత్కాలిక సెక్రటేరియట్‌కే వెయ్యి కోట్లు పెట్టారంటే ఎవరూ నమ్మలేరన్నారు. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం అని సాక్షాత్తు ప్రధాని మోడీనే చెప్పారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ బిడ్డింగ్ ట్రాన్స్ కోయ్ సంస్థకి వస్తే వాటిని తప్పించి నవయుగకు ఇచ్చేశాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇప్పుడు దొరికిపోయిన దొంగ… అందుకే కిక్కుమని మాట్లాడటం లేదని మంత్రి ఆరోపణలు చేశారు. ఐటీ సెంట్రల్ శాఖ నోటీస్‌లు ఇస్తే.. ఇక్కడ పరిధిలో ఉన్నవారితో నోటీసులు ఇప్పించండి అంటున్నాడని.. సిగ్గుందా చంద్రబాబుకు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇప్పటికీ వ్యవస్థలో ఉన్న సంస్థలను మేనేజ్ చేస్తున్నాడు తప్ప సమాధానం చెప్పటం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు ఐటీ నోటీసులపై స్పందించవూ.. నువ్వు సపోర్ట్ చేసిన గవర్నమెంట్‌లో జరిగిన అవినీతి ఇది అని మంత్రి ప్రశ్నించారు. మీరంతా తోడు దొంగల్లా.. నువ్వు ప్యాకేజ్ తీసుకోకపోతే నీ యజమానిని నువ్వు ప్రశ్నించు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ స్పందించక పోతే.. ఆయనకు, చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో అర్థమవుతుందన్నారు. సడెన్‌గా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం.. ఎన్టీఆర్ పేరిట చెల్లని కాయిన్ రిలీజ్ చేయటం ఒక స్పాన్సర్ ప్రోగ్రాం ఆని ఇపుడు అర్థమయిందన్నారు. బీజేపీ వాళ్లు చంద్రబాబును దగ్గరకు రానివ్వటం లేదని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ వాళ్ల శరణు కోరడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని ఆయన ఆరోపించారు. అధికారం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారిపోతాడని ఆయన విమర్శించారు. విజన్ 2047 అనే ప్రోగ్రాంను చంద్రబాబు పెట్టాడని.. ఆయనకున్న ముగ్గురు ఎంపీల బలంతో నువ్వు భారత్‌ను ముందుకు తీసుకెళ్తావా అంటూ ప్రశ్నించారు. నీ విజన్ 2020, నీ విజన్ 420 అన్ని చూశామని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు విచారణకు అర్హుడు..14ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో ఉంటాయని.. వాటిపై విచారణ చేపట్టి జైలులో పెట్టాలన్నారు.
*మెట్రో రైలు ఫేజ్-3 డీపీఆర్‌ల కోసం 4 ఏజెన్సీలు ఎంపిక
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఫేజ్ – 3 ప్రాజెక్ట్ కోసం అధికారిక ప్రక్రియను వేగవంతం చేసింది. మెట్రో మూడో దశ కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (DPRలు) సిద్ధం చేయడానికి HAML కన్సల్టింగ్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ ఏజెన్సీలు రెండు నెలల్లోగా ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్టులను (PPR) సిద్ధం చేయాలి. HAML మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించి, ఐదు కన్సల్టెన్సీ ఏజెన్సీలు ప్రాజెక్ట్ కోసం తమ ప్రతిపాదనలను సమర్పించాయి. HAML టెండర్ కమిటీ మూల్యాంకనం తర్వాత, వీటిలో నాలుగు ఏజెన్సీలు – ఆర్వీ అసోసియేట్స్, సిస్ట్రా, UMTC, RITES, ఈ పనిని చేపట్టడానికి సాంకేతికంగా అర్హత పొందాయి. ఆర్వీ అసోసియేట్స్ మొదటి రన్నర్‌గా నిలిచింది, అత్యధిక సాంకేతిక స్కోర్‌ను సంపాదించి, నాలుగు ప్యాకేజీలకు అత్యల్ప ఆర్థిక బిడ్‌లను అందిస్తోంది. Aarvee అసోసియేట్స్‌కు రెండు ప్యాకేజీలు లభించాయి, మిగిలిన రెండు అత్యంత తక్కువ ఆర్థిక బిడ్‌తో సరిపోలిన తర్వాత రెండవ అత్యధిక సాంకేతిక స్కోరర్ అయిన Systraకి మంజూరు చేయబడ్డాయి. ఎంపిక చేసిన కన్సల్టెన్సీ ఏజెన్సీలు రెండు నెలల్లోపు ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికలను (PPR) సిద్ధం చేస్తాయి. DPRలో ట్రాఫిక్ సర్వేలు, ప్రయాణ డిమాండ్ అంచనాలు, రైడర్‌షిప్ అంచనాలు, ప్రత్యామ్నాయ ఎంపికల విశ్లేషణ మరియు ప్రజా రవాణాకు తగిన రీతులను సిఫార్సు చేయడం వంటివి ఉంటాయి.మెట్రో రైలు అమరిక, వయాడక్ట్/ఎట్-గ్రేడ్/అండర్ గ్రౌండ్ ఎంపికలు, స్టేషన్లు, డిపోలు, ఎలక్ట్రిక్ ట్రాక్షన్, సిగ్నలింగ్ & రైలు కమ్యూనికేషన్, కోచ్‌లు, పర్యావరణం/సామాజిక ప్రభావ అంచనా, రవాణా-ఆధారిత అభివృద్ధి, చివరి మైలు కనెక్టివిటీ, ఖర్చు అంచనాలు, ఛార్జీల నిర్మాణం, ఆర్థిక విశ్లేషణ, మరియు ప్రాజెక్ట్ అమలు ప్రణాళికలు DPRలో చేర్చబడతాయి. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఎంపిక చేసిన అన్ని కారిడార్లలో ఏకకాలంలో క్షేత్రస్థాయి సర్వేలు ప్రారంభించాలని ఎంపిక చేసిన ఏజెన్సీలను ఆదేశించామన్నారు.
*ఇది భారత సమాఖ్యపై దాడి.. “ఒకే దేశం-ఒకే ఎన్నిక”పై రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాజకీయాలు అన్నీ ముందుస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే చర్చ మొదలైంది. దీనికి అనుగుణంగానే కేంద్రం మాజీ రాష్ట్రపతితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఒకే దేశం-ఒకే ఎన్నికపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇండియా కూటమికి భయపడే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని, ఈ డిసెంబర్ లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’పై స్పందించారు. ఇది భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నికపై ముందుకు వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే ఆలోచన భారత యూనియన్, అన్ని రాష్ట్రాలపై దాడి. భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఏకకాలంలో లోకసభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించే విషయమై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరికి చోటు కల్పించారు. అయితే తాను ఈ కమిటీలో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు మొత్తం 8 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో అమిత్ షా, గులాంనబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, ఎస్కే సింగ్ ఉన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేయాలని ఎనిమిది మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం కోరింది.
*తమిళనాడు సీఎం కొడుకు వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు తమిళనాడుతో మొదలు దేశంలోని నాయకులు డీఎంకే, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని ద్వేషిస్తోందని, అది మన వారసత్వంపై దాడి చేస్తోందని అమిత్ షా అన్నారు. రాజస్థాన్ లోని దుంగార్ పూర్ బీజేపీ పరివర్తన యాత్రను ప్రారంభించిన సందర్భంగా షా మాట్లాడుతూ.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మపై ఉదయనిధి వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలగా ఆయన అభివర్ణించారు. 2010లో రాహుల్ గాంధీ లష్కరేతోయిబా కన్నా హిందూ రాడికల్ సంస్థలు పెద్ద ముప్పు అన్న వ్యాఖ్యలను అమిత్ షా ప్రస్తావించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న సమయంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ నాయకులు డీఎంకే పార్టీ, ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాజస్థాన్ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. సనాతన ధర్మం ప్రజల హృదయాలను శాసిస్తోందని అన్నారు. రాముడి జన్మస్థలంలో జనవరిలో రామమందిరం సిద్ధమవుతోందని, ఇండియా కూటమి దీన్ని అడ్డుకోలేదని, కాంగ్రెస్ ఏళ్ల తరబడి రామమందిరాన్ని అడ్డుకుందని అమిత్ షా అన్నారు.
*హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ “పిరోల”.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 పీడ విరగడయ్యేలా కనిపించడం లేదు. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. BA.2.86 లేదా పిరోలా అనే కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది.. అమెరికా, యూకే, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పిరోలా వేరియంట్ ఇజ్రాయిల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో కనుగొనబడింది. 2021లో బయటపడిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలో కేసుల పెరుగుదలతో పాటు భారీగా మరణాలకు కారణమైంది. అయితే ఇప్పుడు దీని సబ్ వేరియంట్ ‘పిరోలా’ మరెంత ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అని పరిశోధకులు భయపెడుతున్నారు. గతంలో ఓమిక్రాన్ శరీర వ్యాధినిరోధక శక్తిని, టీకా ప్రభావాన్ని తట్టుకుని ఇన్ఫెక్షన్లకు కారణమైంది. అయితే ఇప్పుడు కొత్త BA.2.86(పిరోలా) వేరియంట్ గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండటం పరిశోధకుల భయాలకు కారణవుతోంది. ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌పై ఏకంగా 30 ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్స్) ఉన్నాయి. ఇది మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి. పిరోలా మల్టీ మ్యుటేషన్స్ మునపటి కరోనా వైరస్ వేరియంట్లతో పోలిస్తే దాని నిర్మాణంలో పూర్తి భిన్నంగా ఉందని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎరిక్ టోపోల్ రాయిటర్స్‌తో అన్నారు.
*మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రాజధాని ఢిల్లీలో ఐదు రోజుల పాటు మద్యం షాపులు బంద్ అవుతాయి. దీని కారణంగా ప్రజలు తాగేందుకు మందు దొరకడం కష్టమవుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా రాజధానిలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు భయాందోళనలకు గురై మద్యం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి, సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 10 వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసివేయబడవచ్చు. వాస్తవానికి సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీ మద్యంలో జి-20 సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పలు ఆంక్షలు విధించారు. దీని కారణంగా మద్యం ప్రియులకు టెన్షన్ పెరిగింది. వారాంతాలు, సెలవుల కారణంగా గత వారం రోజులుగా మద్యం దుకాణాల వద్ద జనం రద్దీ పెరిగింది. కాబట్టి వచ్చే వారం ఢిల్లీలో మద్యం దుకాణాలు ఎప్పుడు, ఎందుకు మూసివేయబడతాయో తెలుసుకుందాం. జీ20 సమ్మిట్ దృష్ట్యా ఢిల్లీలో సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించబడింది. ఈ సమయంలో రాజధానిలో అన్ని మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు, మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఢిల్లీలో నాలుగు డ్రై డేలను ప్రకటించింది. మొహర్రం, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, ఈద్-ఎ-మిలాద్ నాడు ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ప్రభుత్వం తెలిపింది. జన్మాష్టమి కారణంగా 6, 7 తేదీలలో ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. జన్మాష్టమి కారణంగా సెప్టెంబర్ 6, 7 తేదీలలో.. జీ20 కారణంగా సెప్టెంబర్ 8-10 తేదీలలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఆగస్టు 22 తర్వాత మద్యం దుకాణాలకు ఎక్కువ మంది వినియోగదారులు వస్తున్నారు. జీ20 సమ్మిట్‌కు సన్నాహాలు జరుగుతున్నందున ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. కరోనా మహమ్మారి సమయంలో 6 నెలల పాటు మూతపడిన మద్యం షాపుల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మదిలో సజీవంగా ఉన్నాయి. అప్పట్లో ఆరు నెలల పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ప్రజలు ఇప్పటికే మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జీ20 సందర్భంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. న్యూఢిల్లీ పోలీస్ జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.
*సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ బాధ్యతలు..
జాతులు మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ జాతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో మయన్మార్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన పారాకమాండోకు కీలక బాధ్యతను అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన రిటైల్ అయినా మణిపూర్లో పరిస్థితి శాంతిని నెలకొల్పేందుకు ఈ రిటైర్ ఆర్మీ అధికారి సాయం తీసుకుంటున్నారు. రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్ ని ఇటీవల మణిపూర్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు కాంబాట్ విభాగానికి సీనియర్ సూపరింటెండెంట్ గా నియమించింది. ఈ పదవిలో ఆయన 5 ఏళ్లు కొనసాగనున్నారు. మూడు నెలల క్రితం మణిపూర్ రాష్ట్ర మంత్రివర్గం ఆయన నియామకంపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను కట్టడి చేసేందుకు ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో నెక్టార్ సంజెన్‌బాయ్ సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్స్ లో పనిచేశారు. సైన్యం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కీర్తిచక్ర, శౌర్యశక్ర అవార్డులను అందుకున్నారు. 2015 మయన్మార్ లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ లో నెక్టార్ కీలక పాత్ర పోషించారు. 2015 జూన్ లో డోగ్రా బెటాలియన్ పై మణిపూర్ చండేల్ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 18 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనను మోదీ ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సరిహద్దు దేశం మయన్మార్ లో ఉన్నారనే సమాచారంతో, సైన్యంతో అత్యున్నతమైన పారా కమాండోలను రంగంలోకి దించింది. జూన్ 8-9 రాత్రి సమయంలో పారా ఎస్ఎఫ్ టీం మయన్మార్ అడవుల్లోకి ప్రవేశించి అక్కడ దాగి ఉన్న 20 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సాహసోపేత ఆపరేషన్ తర్వాత టీంలోని 8 మమది సభ్యులకు ఆగస్టు 15న మకేంద్రం గ్యాలెంట్రీ అవార్డులను అందించింది.
*టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నామని, మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోరును నమోదు చేయాలనుకుంటున్నామని షకీబ్ తెలిపాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని అఫ్గానిస్తాన్ సారథి హష్మతుల్లా షాహిదీ చెప్పాడు. గ్రూప్ ‘బి’ నుంచి సూపర్–4కు ముందంజ వేయాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. దాంతో తొలి మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో శ్రీలంక చేతిలో బోల్తాపడిన షకీబుల్ బృందం.. అఫ్గాన్‌తో జరిగే పోరులో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓటమిపాలైతే టోర్నీ నుంచే నిష్కమ్రించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్ధినైనా కంగుతినిపించగలదు. తమ తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో అఫ్గాన్ బరిలోకి దిగనుంది.
*చంద్రముఖి-2 ట్రైలర్ విడుదల
బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది. ఈ మూవీలో రజినీకాంత్, జ్యోతిక చేసిన పెర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ముఖ్యంగా జ్యోతిక పెద్ద పెద్ద కళ్లతో దెయ్యంలా నటిస్తుంటే వెన్నులో వణుకుపుట్టింది. విద్యాసాగర్ ఇచ్చిన మ్యూజిక్ రజినీకాంత్ ఇంట్రడక్షన్ ని ఎలివేట్ చేయగా… క్లైమాక్స్ లో రజినీకాంత్ ‘వేంకటపతి రాజా’గా విశ్వరూపం చూపించాడు. లకలకలక అంటూ రజినీకాంత్ రాజు గెటప్ లో వచ్చిన తర్వాత నుంచి చంద్రముఖి దెయ్యం డాన్స్ పెరఫార్మెన్స్ అయ్యే వరకూ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మూవీ. ఇలాంటి మూవీకి పీ వాసు గతంలో ‘నాగవల్లి’ అనే సీక్వెల్ చేసాడు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు.ఈసారి చంద్రముఖి 2 అంటూ కొత్త సినిమాని సెప్టెంబర్ 15న ఆడియన్స్ ముందుకి తీసుకొని రాబోతున్నారు. పీ వాసు డైరెక్షన్, కీరవాణి మ్యూజిక్ ఇస్తున్న చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ ‘రాజు’ పాత్రలో నటిస్తుండగా, చంద్రముఖిగా టైటిల్ రోల్ ని కంగనా రనౌత్ ప్లే చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చంద్రముఖి 2 ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో వడివేలు, రాధికా, రావు రమేష్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియర్ లు కనిపించారు. చంద్రముఖి చూసిన ఏ ఒక్కరికీ చంద్రముఖి 2 ట్రైలర్ కనెక్ట్ కూడా అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఏదో కొత్త హారర్ సినిమా చూసినట్లు, రాఘవ లారెన్స్ కాంచన సీరీస్ లో ఎదో సినిమా చేస్తున్నట్లు ఉంది కానీ చంద్రముఖిలా అనిపించకపోవడం బాధాకరం. మరి ఓవరాల్ గా సినిమా థియేటర్స్ లో ఎలా అలరిస్తుందో చూడాలి.