*సీఐడీ కస్టడీకి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చంద్రబాబును 2 రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ చెప్పింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని జడ్జి పేర్కొన్నారు. విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లను ఇవ్వాలని న్యాయమూర్తి ఏపీ సీఐడీని ఆదేశించారు. చంద్రబాబు విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని న్యాయమూర్తి కోరారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.
*చంద్రబాబుకు హైకోర్టు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.. క్వాష్ పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏకవాక్యం చెప్పి వెళ్లిపోయారు హైకోర్టు న్యాయమూర్తి.. దీంతో, చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఊరట దక్కకుండా పోయింది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల వినిపించిన వాదనలతో ఏకీభవించింది హైకోర్టు.. ఇక, క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తేల్చేయడంతో.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు కోసమే వేచి చూస్తూ వచ్చింది ఏసీబీ కోర్టు.. క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో.. ఏసీబీ కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. చంద్రబాబు రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.. దీనికి సంబంధించిన పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.. అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను హైకోర్టు తిరస్కరించినట్టు అయ్యింది.. 17 ఏ సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించలేదు హైకోర్టు.. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ వాదనలతో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది.. ఈ సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల మాట్లాడుతూ.. ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే నని.. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పక్కాగా ఉందని చెబుతున్నారు.. ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశ ఉందని.. ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి.. ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందేనని.. ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిందని అంటున్నారు సీఐడీ తరఫు లాయర్లు.
*బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమేనా.. అసెంబ్లీలో చేతకాదా?
టీడీపీ నేతలు సభకు చర్చకోసం కాదు.. రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ నేత బాలకృష్ణపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీ బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి మనసు రావడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు చంద్రబాబు సీటు మీద మనసు లాగినట్లుంది.. అందుకే చంద్రబాబు కుర్చీ ఎక్కి విజిల్స్ వేసి పిచ్చి పిచ్చి వేషాలేశాడని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ అసెంబ్లీలో తొడగొట్టడం కాదు.. మీకు చేతనైతే హైకోర్టుకు పోయి జడ్జి ముందు తొడకొట్టండి అంటూ రోజా అన్నారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని ప్రజలు, యువత గమనించారన్నారు. ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు జైలుకి పోతే…జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. గజదొంగ చంద్రబాబు సాష్టాంగపడి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడ దోచుకుని పక్కరాష్ట్రంలో ప్యాలెస్‌లు కట్టిన చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలని ఆమె అన్నారు. టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చి ఎందుకు పారిపోయారని.. చంద్రబాబు స్కామ్ చేశాడని, దోచుకున్నాడని టీడీపీ నేతలకు కూడా తెలుసని ఆమె పేర్కొన్నారు. టీడీపీ నేతలకు కూడా స్కిల్ స్కామ్‌లో వాటా ఉందా.. బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమే డైలాగ్ చెప్పడం వచ్చా.. అసెంబ్లీలో మాట్లాడటం చేతకాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుండి పార్టీని నడిపిస్తానని చెప్పిన బాలయ్య ఎందుకు పారిపోయాడంటూ ప్రశ్నించారు. మా దగ్గర ఆధారాలు లేవని చెబుతున్న మీరు ఎందుకు చర్చ నుంచి పారిపోయారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కామ్‌కు పథకం వేశాడని ఆమె ఆరోపించారు. జీవోలో లేనప్పుడు ఒప్పందాలపై ఎలా సంతకాలు చేశారని మంత్రి రోజా అడిగారు. బాలకృష్ణ, టీడీపీ నేతలకు ఇదే నా ఛాలెంజ్ అంటూ మంత్రి రోజా సవాల్ విసిరారు. సోమవారం వస్తారో… మంగళవారం వస్తారో..బుధవారం వస్తారో మీ ఇష్టమని, స్కిల్ స్కామ్ మొదలు చంద్రబాబు అన్ని స్కాముల పైనా చర్చిద్దామంటూ మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు. బాలకృష్ణ సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు.. అసెంబ్లీకి వచ్చి మా బావ తప్పు చేయలేదు..ఈడీ ఎంక్వైరీ వేయండి అని అడగాలన్నారు. ఢిల్లీకి వెళ్లి బహిరంగ చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసురుతున్నాడని.. లోకేష్ నీకెలాగూ సభకు వచ్చే సీన్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. బాలకృష్ణను సభకు పంపించు.. తాము చర్చకు సిద్ధమని లోకేష్‌కు సవాల్ విసిరారు. టీడీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందన్నారు మంత్రి రోజా. వ్యవస్థలను దోచుకున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఇలా దొరికిపోయానేంటో అనే భయంలో ఉన్నారని ఆమె వెల్లడించారు. టీడీపీ నేతలు ప్రజల సమస్యలను తీర్చే బదులు ప్రజలకు సమస్యగా మారారని ఆమె విమర్శించారు. టీడీపీ పాపాలు పండాయని.. ఇకపై మా నాయకుడి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే సహించేది లేదని మంత్రి రోజా తెలిపారు.
*అక్టోబర్ మొదటి వారంలో గ్రూప్-4 ఫలితాలు!
తెలంగాణలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్ 20 విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు గ్రూప్-4 ఫలితాలు కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జూలై 1న నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఫలితాలను ప్రకటించే ముందు, కమిషన్ తుది కీని విడుదల చేస్తుంది. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని కమిషన్ ఇప్పటికే విడుదల చేసింది. అలాగే, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 మధ్య అభ్యంతరాలను ఆహ్వానించింది. ప్రాథమిక కీకి సంబంధించిన అభ్యంతరాలు సమీక్ష కోసం నిపుణుల కమిటీకి పంపబడ్డాయి. వారి డిక్లరేషన్ తర్వాత, తుది కీ విడుదల చేయబడుతుంది. కీలక ప్రకటన అనంతరం గ్రూప్ 4 ఫలితాలను కమిషన్ విడుదల చేస్తుందని ఆయా వర్గాలు తెలిపాయి. గ్రూప్ 4 సర్వీసుల కోసం, వివిధ ప్రభుత్వ శాఖల్లో 8180 ఖాళీల కోసం కమిషన్ ప్రకటన చేసింది. దాదాపు 9.51 లక్షల మంది రిక్రూట్‌మెంట్‌పై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ నమోదు చేసుకున్నారు. అయితే, TSPSC గ్రూప్ 4 పరీక్షకు నమోదైన వారిలో కేవలం 7,62,872 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రైమరీ కీకి సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత పరీక్ష రాసేవారు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలయ్యే వరకు, విద్యార్థులు తమ OMR షీట్లను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేసుకోవచ్చని సంబంధిత విభాగాలు తెలిపాయి.
*మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందో లేదో..! కేంద్రంపై విసుర్లు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిల్లును ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలన్నారు. దీనికి డీలిమిటేషన్ ఎందుకని ప్రశ్నించారు. నేటి నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ మంచిదే అయినప్పటికీ.. అందులో రెండు లోపాలున్నాయని తెలిపారు. ముందుగా రిజర్వేషన్ అమలు చేయడానికి ముందు జనాభా గణన, డీలిమిటేషన్ చేయవలసి ఉంటుందని కేంద్రం తెలపగా.. అవసరం లేదని అన్నారు. ఈ రెండు పనులు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అప్పటికి అది అమలవుతుందో లేదో అనేది ఎవరికీ తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం మళ్లింపుకు పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓబీసీ జనాభా లెక్కల నుంచి మళ్లింపు జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శులు, క్యాబినెట్ కార్యదర్శుల కులాల వర్గం గురించి ఆయన ప్రస్తావించారు. ఓబీసీల కోసం ఇన్ని పనులు చేస్తుంటే 90 మందిలో కేవలం ముగ్గురే ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉండటం ఏంటని అన్నారు. దేశ బడ్జెట్‌లో ఐదు శాతాన్ని ఓబీసీ అధికారులు నియంత్రిస్తున్నారని తెలిపారు. ఓబీసీల గురించి ప్రధాని ప్రతిరోజూ మాట్లాడుతున్నారని.. వారి కోసం ప్రధాని ఏం చేశారని ప్రశ్నించారు. నిర్ణయాధికారుల్లో ఐదు శాతం మందికి మాత్రమే ఎందుకు స్థానం కల్పించారని ప్రశ్నించారు. దేశంలో ఓబీసీ జనాభా ఐదు శాతం మాత్రమేనా.. దేశంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటానని రాహుల్ అన్నారు. 2010లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం ఓబీసీ కోటా కల్పించనందుకు చింతిస్తున్నారా అని రాహుల్ ను మీడియా ప్రశ్నించగా.. దీనికి ఆయన అంగీకరిస్తూ.. 100 శాతం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అది అప్పుడే జరగాల్సిందని తెలిపారు. కానీ తాము దానిని కచ్చితంగా పూర్తి చేస్తామని అన్నారు.
*ఉదయనిధి స్టాలిన్ కు షాక్.. సనాతన ధర్మంపై సుప్రీంకోర్టు నోటీసులు
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఏ టైంలో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయనను వదలడం లేదు. ప్రధాని మోడీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం ఈ విషయంపై మాట్లాడారు. ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిని సైతం చిక్కుల్లో పడేశాయి. అయినా వెనక్కి తగ్గని ఉదయనిధి తన వ్యాఖ్యలపై కట్టబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్ కు షాక్ ఇచ్చింది. తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజాతో పాటు మరో 14 మందికి సుప్రీంకోర్టు సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. దానిపై విచారించిన ధర్మాసనం వీటిపై స్పందన తెలియజేయాలంటూ ఉదయనిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు శాఖ, సీబీఐ, ఏ రాజా పాటు మరో 14 మందికి నోటీసులు జారీ చేసింది. ఇక సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ దానిని అరికటడం కాదు శాశ్వతంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమని వ్యాఖ్యనించారు. భారత దేశంలో చాలా మంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండటంతో వారందరి మనోభావాలను స్టాలిన్ వ్యాఖ్యలు దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. రాజకీయనాయకులు ముఖ్యంగా ఈ విషయంలో డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు ఉంటే డీఎంకే ఎంపీ ఏ రాజా మరో అడుగు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఏకంగా ఎయిడ్స్ తోనే పోల్చి నిర్మూలించాలని చెప్పారు. అందుకే ఆయనకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
*50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని వ్యాఖ్యలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంటా, బయట వ్యతిరేకత ఎదురుకొంటున్నారు. భారత్‌ని కాదని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కెనడా మిత్రదేశాలు వ్యవహరించే పరిస్థితి లేకపోవడంతో కెనడా ప్రభుత్వానికి చుక్కెదురు అవుతోంది. ఇదిలా ఉంటే కెనడాలో జస్టిన్ ట్రూడో తన ప్రజాధరణ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. కెనడా గ్లోబల్ న్యూస్ సర్వేలో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి. కెనడా ప్రజల మద్దతు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రేకు ఎక్కువగా ఉంది. దాదాపుగా 40 శాతం కెనడియన్లు పియరీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఆయన పార్టీకి 39 శాతం ఓట్లు వస్తాయిని పోల్స్ వెల్లడించాయి. లిబరల్ పార్టీ నేత, ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో పార్టీ అధికారాన్ని కోల్పోతుందని వెల్లడించింది. కెనడాలో 2025 చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. జూలై నెలలో జరిగిన సర్వేలో.. 50 ఏళ్లలో జస్టిన్ ట్రూడో అత్యంత చెత్త ప్రధానమంత్రి అని తేలింది. సీటీవీ న్యూస్ ప్రకారం..జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడో 1968-79, 1980-84 మధ్య కెనడా ప్రధానిగా పనిచేసి, అక్కడి ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ఖలిస్తానీ సానుభూతిపరుడైన భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ)తో అధికారాన్ని పంచుకుంటుంది. ప్రస్తుతం జగ్మీత్ సింగ్ పాపులారిటీ కూడా 26 నుంచి 22కి పడిపోయింది. 60 శాతం కెనడియన్లు ట్రూడోని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. భారత్ నుంచి పారిపోయి కెనడా పౌరసత్వం పొందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తానీ వేర్పాటువాదానికి ప్రధాన నేతగా ఉన్నారు. పలు సందర్భాల్లో ఇండియాకు వ్యతిరేకంగా కెనడా నుంచి తన కార్యకలాపాలను చేస్తున్నారు. జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో అతడిని గుర్తుతెలియని వ్యక్తులు చంపారు. అయితే ఈ హత్యకు భారత్ కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. ఇండియా వీటిన అసంబద్ద, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఖండించడంతో పాటు కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
*అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా
చైనా మరోసారి తన బుద్ధిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్‌ని నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా భారత క్రీడాకారులను అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యకు భారత్ శుక్రవారం నిరసన తెలిపింది. ఈ నేపథ్యం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అక్రిడేషన్, వీసా నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన క్రీడాకరుల పట్ల చైనా వివక్ష చూపింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమే అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. భారత అథ్టెట్లపై ఉద్దేశపూర్వకంగా చైనా ఇలా చేయడం ఆసియా క్రీడల స్పూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నెలలో జీ20 సమావేశాలకు ముందు చైనా ప్రామాణిక మ్యాపుల పేరుతో అరుణాచల్ ప్రదేశ్, లడాక్ ప్రాంతాలను తన మ్యాపుల్లో చూపించింది. ఇది ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం స్పష్టించించింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ లో అంతర్భాగమని వాదిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్, అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని చైనాకు ధీటుగా బదులిస్తోంది. ఇదిలా ఉంటే ఈ విషయంపై చైనా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికా ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. చట్టబద్ధంగా ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగతిస్తోందని ఆయన అన్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే చైనా ప్రభుత్వం దాన్ని గుర్తించలేదని, జాంగ్నాన్ (నైరుతి చైనా యొక్క జిజాంగ్ అటానమస్ రీజియన్ యొక్క దక్షిణ భాగం) చైనా భూభాగంలో భాగం” అని నింగ్ చెప్పారు.
*వంద సిక్సులు కొట్టిన డేవిడ్ వార్నర్.. ఖాతాలో మరో రికార్డ్
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌లో సిక్సర్ల శతకం పూర్తి చేసుకున్నాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో నేడు (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ భాయ్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన వార్నర్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ప్లేయర్ గా ప్లేయర్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ ఈ సిక్సర్‌తో పాటు మరో సిక్సర్ కూడా కొట్టి తన సిక్సర్‌ల సంఖ్యను కేవలం 148 మ్యాచ్ ల్లోనే 101కి పెంచుకున్నాడు.ఇక, ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 రన్స్ చేసి.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తూ 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. డేవిడ్ వార్నర్ (52 ), మిచెల్ మార్ష్ (4), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కామెరిన్ గ్రీన్(31)లు అవుట్ కాగా.. ప్రస్తుతం క్రీజులో జోష్ ఇంగ్లిస్ ( 15 ), మార్కస్ స్టోయినీస్ (4 ) ఉన్నారు. ఇక, టీమిండియా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాటర్లను కట్టిడి చేస్తున్నారు. ఇక, వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది.. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), రోహిత్ శర్మ (286), సనత్ జయసూర్య (270), మహేంద్ర సింగ్ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ (195), సౌరబ్ గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), విరాట్ కోహ్లి (141), వీరేంద్ర సెహ్వాగ్ (136), సురేశ్ రైనా (120) 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్నారు.
*ఎట్టకేలకు ఓటీటీలోకి ఏజెంట్..
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 న రిలీజ్ అయిన ఏజెంట్.. భారీ పరాజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ తరువాత పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్ ను మొదలుపెట్టారు. దీనికోసం అఖిల్ రెండేళ్లు కష్టపడి బాడీని పెంచాడు. సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఎన్నో వాయిదాల తరువాత ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది ఏజెంట్. అయితే సినిమా ఇన్ ఫుట్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఫ్యాన్స్ ఏజెంట్ ను పెద్ద డిజాస్టర్ గా మార్చారు. ఇక డిజాస్టర్ సినిమాలు ఓటిటీలో హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఏజెంట్ కూడా ఓటిటీలో మంచి టాక్ అందుకుంటుందేమో అని ఆ సినిమా ఓటిటీ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఇక్కడ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. మధ్యలో గొడవలు కూడా కావడంతో సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ, అనుకోని విధంగా ఈ సినిమా ఓటిటీ డేట్ ను అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు మేకర్స్ . ఏజెంట్ డిజిటల్ హక్కులను సోనీలివ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సెప్టెంబర్ 29 నుంచి సోనీలివ్ లో ఏజెంట్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏజెంట్ ఓటిటీ రాదేమో అనుకున్నాం.. ఇప్పటికైనా వదిలారు అదే సంతోషం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.