*ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లో ఆయన కీలకాంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. 2022లో బాబు పేరు బయటికి వచ్చిందని.. కానీ 2023 సెప్టెంబర్ 8న అరెస్ట్ చేయాలని భావించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
*ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 21 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో 2 రోజులు పెంచే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలపై గురువారం ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బిల్లులతో పాటు కీలకాంశాలపై ప్రస్తావన సభలో వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైఎస్సార్సీఎల్పీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మంగళవారం సీఎం జగన్‌తో చీఫ్ విప్ ప్రసాదరాజు భేటీ అయ్యారు. పలు కీలకాంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
*నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే జీ20 సమావేశాలు సక్సెస్ కావడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిని మరింత బలపరిచేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అమృత కాల సమయంలో కొన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
*నిపా “బంగ్లాదేశ్ వేరియంట్”.. కేరళలో 7 గ్రామాలు పూర్తిగా దిగ్భంధం..
నిపా వైరస్ మరోసారి కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మరణించారు. వీరితో సంబంధం ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన నిపా వైరస్ వేరియంట్ తక్కువ వ్యాప్తి ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ప్రకటించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళలోని కోజికోడ్ చేరుకున్నాయి. మొబైల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి నిపా పరీక్షలు, గబ్బిలాల సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీకి తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే నిపా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది. ప్రస్తుతం నిపా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్నది ‘బంగ్లాదేశ్ వేరియంట్’అని ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని, వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిపా రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీలను అందించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంగీకరించిందని ఆమె సభకు తెలిపారు. కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆమె ఆసెంబ్లీకి తెలిపింది. నిపాని ఎదుర్కొనేందుకు నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేశామని, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామపంచాయతీలు..అటాన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి మరియు కవిలుంపర కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, పూర్తిగా దిగ్భందించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
*లివ్-ఇన్ రిలేషన్‌లో మరో హత్య.. నిందితుడికి సాయం చేసిన భార్య..
సహజీవనం చేస్తూ సర్వస్వం అర్పిస్తున్న యువతులు హత్యకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య దేశంలో లివ్-ఇన్ రిలేషన్‌లో పరిణామాలను హెచ్చరించింది. ఏళ్లుగా సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే సరికి మహిళల్ని కడతేరుస్తున్నారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ సంస్కృతికి ఈ విధానం నష్టం చేకూరుస్తుందని పేర్కొంది. తాజాగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మరో మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న 28 ఏళ్ల మహిళ, తనపై లవర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత మహిళను ఆమె భాగస్వామి దారుణంగా హత్య చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ హత్యకు అతని భార్య కూడా సహాయం చేసింది. మహిళను చంపేసి పక్క రాష్ట్రం గుజరాత్ లోని వల్సాద్ లో పడేశారు. మరణించిన మహిళను చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్టుగా చేస్తున్న నైనా మహత్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మనోహర్ శుక్లాతో ఆమెకు 5 ఏళ్లుగా సంబంధం ఉంది. శుక్లా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా మహత్, శుక్లాపై ఒత్తిడి తెస్తుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి అతను నిరాకరించడంతో, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విత్ డ్రా చేసుకోవాలని శుక్లా, నైనా మహత్ ను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు. హత్య అనంతరం శుక్లా తన భార్య సహాయంతో ఓ సూట్‌కేస్ లో శవాన్ని పెట్టుకుని పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ కి సమీపంలోని చిన్న వాగులో పడేశారు. ఈ ఘటన ఆగస్టు 9న జరిగింది. అయితే నైనా కనిపించడం లేదని ఆగస్టు 9న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 12 తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ అయిందని మృతురాలు సోదరి జయ చెప్పింది. పోలీసుల విచారణలో శుక్లా నిందితుడని తేలింది. అతడిని, ఆయన భార్యను మంగళవారం అరెస్ట్ చేశారు.
*జీ20లో చైనా సిబ్బంది ఓవర్ యాక్షన్.. బ్యాగులు చెక్ చేసేందుకు నిరాకరణ..
ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారతదేశం జీ20 సదస్పును నిర్వహించింది. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి దేశాధినేతలు న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశాల్లో భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచ దేశాధినేతలకు మరిచిపోలేని విధంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలా ఉంటే చైనా అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా డేలిగేట్స్ బ్యాగులను చెక్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. గత వారం జీ20 సమ్మిట్ కోసం చైనా ప్రతినిధి బృందం వచ్చింది. ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో వీరికి బస ఏర్పాటు చేశారు. అయితే హోటల్ లో వీరి బ్యాగులను భద్రతా సిబ్బంది తనిఖీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ చాణక్యపురిలో ఉన్న తాజ్ ప్యాలెస్ హోటల్ లో చైనా ప్రతినిధి బృందం బస చేసింది. ఈ ప్రతినిధి బృందం హోటల్ కి ఓ బ్యాగును తీసుసువచ్చింది. ఈ బ్యాగును తనిఖీ చేసేందుకు భద్రతా సిబ్బంది కోరగా.. ఇందుకు వారు నిరాకరించారని పోలీసులు తెలిపారు. భద్రతా నియమావళి ప్రకారం బ్యాగ్‌ను తనిఖీ చేయాలని పోలీసులు పదేపదే పట్టుబట్టినప్పటికీ చైనా ప్రతినిధులు చలించకపోవడంతో గందరగోళం చెలరేగింది. చివరకు ప్రతినిధి బృందం బ్యాగ్ ని తనిఖీ చేయకుండానే చైనా రాయబార కార్యాలయానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాగులో ఏముందనే వివరాలు తెలియరాలేదు. ఈ పరిణామం తరువాత మరికొంత మంది చైనా ప్రతినిధులు హోటల్ చేరుకున్నారని, ఆ సమయంలో వారి బ్యాగులు చెక్ చేసేందుకు అభ్యంతరం తెలపలేదని పోలీసులు వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాల అధినేతలు వచ్చారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాలేదు. జిన్ పింగ్ స్థానంలో ఆ దేశ ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవ్వగా.. పుతిన్ స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సమావేశానికి హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో పుతిన్ దేశాన్ని విడవడం లేదు. ఏ సమావేశానికైనా సెర్గీ లావ్రోవ్ హాజరవుతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు రాకపోవడానికి మాత్రం స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.
*50 మందికి పైగా సజీవ దహనం
ఓ తొమ్మిది అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటల కారణంగా 50 మందికి బలైపోయారు. కొన్ని కుటుంబాలు చిద్రమైపోయాయి. అరుపులు, కేకలు, మంటలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. రాత్రి సమయం కొంతమంది నిద్రలో ఉన్నారు. కొంతమంది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోపలే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఎక్కడి వారిని అక్కడ చెల్లాచెదురు చేశాయి. తొమ్మిది అంతస్తుల భవనం మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ భారీ అగ్ని ప్రమాదం వియత్నాంలోని హనోయిలో జరిగింది. వివరాల ప్రకారం ఓ తొమ్మిది అంతస్తుతల భవంతిలో నిన్న రాత్రి రాత్రి 11.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వియత్నాంలోని హనోయిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జనాలు ప్రాణాలు కోల్పొయారు. రాత్రి సమయం కావడంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. ప్రమాదం సంభవించిన భవనంలో ప్రస్తుతం 45 కుటుంబాలు నివాసిస్తున్నాయి. భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక చర్యలు అందించడం కూడా కష్టంగా మారింది. చాలా మంది మంటల్లో చిక్కుకొని బయటకు రాలేకపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఆసుపత్రిలో చేర్పించగా వారిలో 54 మంది ఇప్పటి వరకు మరణించినట్లు అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రాత్రి సమయం కావడంతో ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏ కారణంతో అపార్ట్ మెంట్ లో మంటలు అంటుకున్నాయి అన్న దానిపై స్పష్టత లేదు. అయితే మంటలు అంటుకున్న వారి హహాకారాలతో ఆ ప్రాంతం భీతావాహంగా మారింది. ఇక ఇటీవల ప్రమాదాలు, విపత్తుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పొయారు. మొరాకోలో భూకంపం సంభవించి 2500 మందికి పైగా చనిపోయారు. లిబియాలో వరదల కారణంగా 5300 మందికి పైగా మరణించారు. ఇవి విపత్తులు అనుకుంటే ఇప్పుడు వియత్నం అగ్ని ప్రమాదంలో కూడా 50 మందికి పైగా సజీవ సమాధి కావడం అత్యంత విచారకరం.
ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏమిటో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరో హీరోయిన్ కు డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది.పలానా పాత్రలలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.. అలాంటి అవకాశాలు కనుక వస్తే వారు అసలు వదులుకోరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కూడా ఈ విధమైన ఒక డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది..స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు గా తానేంటో నిరూపించుకున్నారు.ఎలాంటి పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో పూర్తి న్యాయం చేస్తారు ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గాను గుర్తింపు పొందారు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో ఎంతో బిజీ గా వున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో ఈ పాత్రలో నటించడం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించే అవకాశం మాత్రం రాలేదని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటి అనే విషయానికి వస్తే…. ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించారు అయితే తన తాత గారిని కృష్ణుడి పాత్రలో చూసిన ఎన్టీఆర్ ఎంతో ఆనంద పడేవారని సమాచారం.తాను కూడా ఇలాంటి పాత్రలో నటించాలని కోరుకునేవారట.అయితే కృష్ణుడి వేషంలో కనిపించే పాత్రలు ఎన్టీఆర్ కి అసలు రాలేదు. బృందావనం సినిమాలో ఒక పాటలో ఎన్టీఆర్ మోడరన్ కృష్ణుడిగా కనిపించినప్పటికీ అది ఫుల్ లెన్త్ సినిమా కాదు దీంతో ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించాలన్న కోరిక అలాగే ఉండిపోయిందని తెలుస్తుంది.మరి త్వరలో తెరకెక్కబోయే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర దక్కించుకుంటారో లేదో చూడాలి.