*ఒడిశాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్..
ఒడిశాలో బాలాసోర్ రైలు ప్రమాదం విషాదం మరిచిపోక ముందే మరో ట్రైన్ పట్టాలు తప్పింది. ఇది కూడా ఒడిశా రాష్ట్రంలోనే జరిగింది. బారాగఢ్ లో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న సమయంలో సోమవారం పట్టాలు తప్పింది. గూడ్స్ రైల్ సున్నపురాయితో నిల్వలలో వెళ్తోంది. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డుంగ్రి సున్నపురాయి గనులు, బారాగఢ్ సిమెంట్ ప్లాంట్ మధ్య ప్రైవేట్ నారో గేజ్ రైలు మార్గం ఉంది. పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో ఈ రైలు నడుస్తోంది. శుక్రవారం సాయంత్రం బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 275 మంది చనిపోయారు. 1200 మంది గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అదే సమయంలో యశ్వంత్ పూర్ రైలు రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.
*ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. బాలాసోర్ లో జరిగిన రైలు దుర్ఘటనలో 275 మంది మరణించారు. అశ్విని వైష్ణవ్ దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతుల పనులు, రైళ్ల పునరుద్దరన గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తప్పిపోయిన ప్రయాణికులను వారి కుటుంబాలతో కలపడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తులను వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం మా లక్ష్యం అని, మా బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరించారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు వందేభారత్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాద స్థలం నుంచి వెళ్తున్నాయి. అయితే నియంత్రిత వేగంతో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్ర 7 గంటల ప్రాంతంలో బాలాసోర్ సమీపంలోని బహనాగబజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలోనే మరో ట్రాక్ పై యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రావడం, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు ఎగిరి వచ్చి యశ్వంత్ పూర్ రైలు వెళ్తున్న ట్రాక్ పై పడటంతో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టిన సంఘటన జరిగింది. రైల్వే చరిత్రలో మూడు దశాబ్ధాల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. ఈ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
*రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు (మంగళవారం) నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రూ.53 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం మరియు ఎస్పీ కార్యాలయాలతో పాటు దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి నాగర్ కర్నూల్ శివారులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్‌ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రం శివారులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నా.. ఖాళీ స్థలంలో సభ నిర్వహణకు ఏర్పాట్లును సభా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.. ఎస్పీ మనోహర్ పరిశీలించారు. సభాప్రాంగణాన్ని చదును చేసే పనులు రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. బహిరంగ సభకు సుమారు లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తమ తమ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం వస్తుండటంతో జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది.
*80 మందికి ఏఈ పేపర్ అమ్మిన డీఈ రమేష్.. విచారణలో షాకింగ్ విషయాలు..!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తీగ లాగితే DE రమేష్ లీక్స్ బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో A-50 ముద్దాయిగా ఉన్న రమేష్ లీలలు చూసి అధికారులే విస్తుపోతున్నారు. AEE, DAO ఎగ్జామ్స్‌లో ఇన్విజిలేటర్స్ సాయంతో హైటెక్ మాస్ కాపీయింగ్‌కి తెర లేపాడు.. దీంతో అతగాడి ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థుల జాబితాను సిట్ అధికారులు తయారు చేస్తున్నారు. మాస్ కాపీయింగ్‌కి పాల్పడ్డ పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సిట్ విచారణలో డీఈ రమేష్ విస్తుపోయే నిజాలను బయటపెట్టాడు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూల సురేష్ నుంచి ఏఈ పేపర్ తీసుకొచ్చిన డీఈ రమేష్.. పెద్దపల్లి, కరీంనగ్ జిల్లాల్లో అభ్యర్థులకు పేపర్ విక్రయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. స్థానిక ప్రజాప్రతినిధుల పిల్లలకు ఏఈ పేపర్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డీఈ రమేష్‌ను ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రమేష్ విచారణతో మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. అయితే డీఈ రమేష్ తాను పనిచేసిన ఏరియాలోని అభ్యర్థులకు పేపర్ అమ్మినట్లు తెలుస్తుంది. మాస్ కాపీయింగ్ కి అవసరమైన మైక్రో రిసీవర్స్, మైక్రో ఇయర్ బగ్స్ ఆన్‌లైన్‌లో కొన్నారు. మాస్ కాపీయింగ్ కోసం సేకరించిన డివైజెస్‌తో పలుసార్లు డెమో నిర్వహించారు. అంతా ఓకే అనుకున్నాక.. రమేష్ అతని బంధువు పూల సురేష్.. అభ్యర్ధుల కోసం సెర్చ్ చేశారు. సిటీలోని కోచింగ్ సెంటర్స్‌లో కోచింగ్ తీసుకుంటున్న కేండిడేట్స్‌తో కాంటాక్ట్ అయ్యారు. ఇందులో AEE, DAO పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులను గుర్తించారు. వాళ్లతో మాట్లాడి డీల్ సెట్ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు అని సిట్ అధికారులు గుర్తించారు.
*గ్రూప్-1 ప్రిలిమ్స్ పై హైకోర్టులో పిటిషన్.. తీర్పుపై ఉత్కంఠ..!
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. గ్రూప్-1 పరీక్షపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను కూడా జారీ చేశారు. వచ్చే ఆదివారం పరీక్ష నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో కోర్టులో పిటిషన్ వేయడంపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరినీ కూడా లోపలికి అనుమంతించేది లేదని టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పింది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానికి బదులుగా కొత్తది ఇవ్వలేమని వెల్లడించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే కరెక్ట్ గా బబ్లింగ్ చేయాలని సూచించింది. సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా, పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్ ఉపయోగించినా, డబుల్ బబ్లింగ్ చేసినా పత్రాలు చెల్లుబాటు కావని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకొని రావాలని క్లారిటీ ఇచ్చింది.
*రెండు రైళ్లలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించాం..
ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులతో కలిసి ఒడిశాలో రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లినట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. సీఎం ఆదేశాలతో బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు. రెండు రైళ్లలో మొత్తం 342 మంది ఏపీకి చెందిన వారిని గుర్తించామని.. 9 మందికి విశాఖలో చికిత్స జరుగుతోందన్నారు. రిజర్వ్ కంపార్ట్‌మెంట్‌లో 5 గురు ప్రయాణం చేసినట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. 276 మంది చనిపోయినట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించిందని అమర్‌నాథ్ తెలిపారు. 187 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ముగ్గురు ఐఏఎస్‌లు ఇంకా భువనేశ్వర్‌లోనే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు. రిజర్వ్ చేసుకోకుండా ప్రయాణం చేసిన వారు, ఆచూకీ లేరని కుటుంబ సభ్యులు ఎవరైనా సహాయం కోసం ఫోన్ చేస్తే వారికి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంబటి రాములు అనే వ్యక్తి కనిపించటం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారని ఆయన చెప్పారు. ఇతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి.. ఏపీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారని చెప్పారు. ఏపీకి చెందిన ఒక వ్యక్తి గురుమూర్తి మాత్రమే చనిపోయారని.. వారి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి వెల్లడించారు. 72 గంటల పాటు మార్చురీల్లో మృతదేహాలను ఉంచనున్నట్లు ఒడిశా అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత సామూహిక ఖననాలు చేస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. ఏపీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది, అధికారులు క్రిమేషన్ వరకు ఉండే అవకాశం ఉందన్నారు.
*జగిత్యాలలో దారుణం..అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు..
ఈరోజుల్లో మనుషుల మధ్య మానవత్వం లేదు.. సంబంధ బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండటం లేదు.. డబ్బులు సంపాదించాలనే కోరిక తప్ప బంధం, బంధుత్వం అనేది లేకుండా పోయింది.. డబ్బుల కోసం సొంతవాళ్ళను సైతం పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం జరిగింది.. ఆస్తి కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా చంపాడు ఓ తమ్ముడు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది..వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ అతి దారుణంగా రోకలితో కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది.. ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట ఒంటరిగా నిద్రిస్తున్న తిరుపతిపై తమ్ముడు శ్రీనివాస్ రోకలిబండ తో దాడి చేసినట్లు తెలుస్తుంది. తలకు బలమైన గాయం కావడంతో తిరుపతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై బుగ్గారం పోలీసులు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రక్తం పంచుకున్న అన్నదమ్ములు ఇలా ఆస్తి కోసం ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం.. అందరిని కలచివేస్తుంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
*యుద్ధంలో 500మంది పిల్లలను చంపిన రష్యా
రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 500 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం నాడు రెండేళ్ల బాలిక మరణించినట్లు చెప్పారు. చిన్నారుల మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం కష్టం. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో మృతి చెందిన చిన్నారుల సంఖ్య ఖచ్చితంగా తెలియడం లేదు. శనివారం, రష్యా ఉక్రెయిన్‌పై వేగవంతమైన దాడులను నిర్వహించింది, ఇందులో ఐదుగురు పిల్లలతో సహా 22 మంది గాయపడ్డారు. డ్నిప్రో నగరంలోని ఓ భవనం నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ప్రకటనలో “రష్య ద్వేషం, ఆ దేశ ఆయుధాలు ప్రతిరోజూ ఉక్రేనియన్ పిల్లలను చంపుతున్నాయి. వందలాది మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది పండితులు, కళాకారులు, భవిష్యత్తులో ఉక్రెయిన్ క్రీడా ఛాంపియన్‌లు కావచ్చు. ఉక్రెయిన్ చరిత్రకు దోహదం చేసి ఉండవచ్చు’ అన్నారు. శనివారం నాటి దాడిలో రెండు భవనాలు ధ్వంసమయ్యాయని, ఐదుగురు చిన్నారులు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. అనంతరం రెస్క్యూ టీమ్ బాలిక మృతదేహాన్ని గుర్తించింది.\
ఆదివారం కూడా డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో రష్యా ఉక్రెయిన్‌పై ఒకదాని తర్వాత ఒకటి దాడులు చేసింది. కీవ్‌తో సహా ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలను రష్యా లక్ష్యంగా చేసుకుంది. రష్యా ప్రయోగించిన నాలుగు స్వీయ-పేలుడు డ్రోన్‌లను, ఆరు క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాకు చెందిన రెండు క్రూయిజ్ క్షిపణులు క్రోపివాట్స్కీలోని సైనిక వైమానిక స్థావరంపై పడ్డాయి. దీని వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం అందలేదు.
*గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు
దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పెరుగుతున్న వడ్డీ రేట్ల నుండి గొప్ప ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ వారం RBI ద్రవ్య విధాన సమావేశం జరగబోతోంది. జూన్ 6 నుంచి 8 వరకు ఈ సమావేశం జరగనుంది. జూన్ 8న ఆర్బీఐ ఎంపీసీ పాలసీ రేటును ప్రకటించనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈసారి పాలసీ రేటులో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు. నిజానికి ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి చేరింది. అదే సమయంలో, రిటైల్ ద్రవ్యోల్బణం మేలో కూడా 5 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. అటువంటి పరిస్థితిలో RBI వడ్డీ రేట్లను మార్చదని భావిస్తున్నారు. అంతకుముందు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరిగాయి. దీని కారణంగా భారతదేశంతో సహా మొత్తం ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు రెపో రేటులో 250 బేసిస్ పాయింట్లు అంటే 2.50 శాతం పెరిగింది. ఆ తర్వాత రెపో రేటు 6.50 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నెలలో, RBI MPC వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈసారి కూడా అదే అంచనా. మార్చి, ఏప్రిల్ నెలల్లో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది. ఏప్రిల్లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం నుండి 4.7 శాతానికి తగ్గింది, ఇది 18 నెలల కనిష్ట స్థాయి. ఏడాది క్రితం రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతంగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా గణనీయంగా తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 నుంచి 6 శాతం వద్ద ఆర్‌బీఐ ఉంచింది. దేశ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి, ఏప్రిల్ రెండు నెలలలోనూ ఎగువ బ్యాండ్ 6 శాతం కంటే తక్కువగా ఉంది.
*పవన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు…?
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తారు. కానీ కొద్దీ రోజులుగా ఎలాంటి సినిమాను ఆయన ఒప్పుకోలేదు.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మళ్లీ వినిపిస్తున్న మాట ఏమిటంటే నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా దూరం కానున్నారు అని.. అయితే ఈసారి నాగబాబు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కోసం ఆయన సినిమాలకు దూరం కాబోతున్నాడు అని తెలుస్తుంది.. ఏదో ఒక సినిమా లో ముఖ్య పాత్రలు చేసిన నాగబాబు ఇప్పుడు కొత్త సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.ఇందుకు కారణం నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో అత్యంత క్రియాశీలక నాయకుడి గా ఆయన కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే నాగబాబు కు జనసేన పార్టీకి సంబంధించిన కీలక పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అందుకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆయన తన సమయాన్ని పూర్తి గా రాజకీయాల లో పరిమితం చేయనున్నారని సమాచారం..ఈ కారణంగానే సినిమాల నుండి ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే.. నో చెబుతున్నాడని తెలుస్తుంది.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో అప్పటివరకు మాత్రమే ఆయన సినిమాలకు దూరం కానున్నారా లేక మళ్ళీ సినిమాలను పునరావృతం చేస్తాడా అనే విషయం తెలియాలి.ఇకపోతే పూర్తిగా రాజకీయాలలోకి నాగబాబు వెళ్లి సినిమాలకు నో చెబుతున్న నేపథ్యం లో అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా నాగబాబు పాత్రలను మిస్ అవుతున్నారు అని తెలుస్తుంది.