ఎంపీ సంతోష్ కుమార్ కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు చోటు లభించింది. విద్యా, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సినిమా, వ్యాపారం, రక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లో అనితరసాధ్యమైన భారతీయుల కృషిని, విజయాలను గుర్తించి.. “లిమ్కాబుక్” రికార్డులో చోటు కల్పిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అవార్డును సామాజిక సేవా విభాగంలో “ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే” బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు రికార్డ్స్ లో చోటు కల్పించినట్లు లిమ్కాబుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ తెలిపారు. లిమ్కాబుక్ ప్రశంస పత్రాన్ని ఇవ్వాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందించినట్లు వారు తెలిపారు.తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, దుర్గా నగర్ లో 2021 జూలై 4వ తేదిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 వందల మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు సంస్థ వివరించింది. సమిష్టి కృషి, సామాజిక స్పృకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది.
ఆ నలుగురు అసంతృప్తితో ఉన్నారు

పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం అయ్యేటట్లు పర్యవేక్షించమని సీఎం జగన్ చెప్పారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం ముగిసింది. గంటన్నర పాటు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం అయిన ముఖ్యమంత్రి జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. జగన్ కు మా అభిప్రాయాలు చెప్పాం. ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి ఈ కార్యక్రమాలు చేరే విధంగా చూడమన్నారు.ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య విబేధాలు ఉంటే సరిదిద్దే బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్లది అని జగన్ పేర్కొన్నారని మంత్రి బొత్స తెలిపారు. ఏడాది పాటు సమావేశాలు నిర్వహించటం మా బాధ్యత అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకుని వెళతాం అన్నారు బొత్స సత్యనారాయణ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా రీజినల్ కో ఆర్డినేటర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. వాలంటీర్లు,గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను వీరి ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. నేతల మధ్య విభేధాలను తొలగించడం అసంతృప్తులను సంతృప్తి పరచే బాధ్యత మాదేనన్నారు. ఏడాదిలో ఎన్నికలు వస్తోన్న దృష్ట్యా అసంతృప్తుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం అన్నారు.
అరుణాచల్ లోని 11 ప్రాంతాలకు చైనా పేర్లు.. భారత్ అభ్యంతరం

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడాన్ని భారతదేశం తిరస్కరించింది. తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అరుణాచల్ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే ప్రయత్నాల్లో భాగంగా చైనా నిన్న 11 ప్రదేశాలకు కొత్త పేర్లను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను జంగ్నాన్‌గా పిలుస్తున్న చైనా.. “టిబెట్ యొక్క దక్షిణ భాగం జాంగ్నాన్” అని పేరు పెట్టింది. అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది మూడోసారి. చైనా విడుదల చేసిన పేర్ల జాబితాలో ఐదు పర్వత శిఖరాలు, రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు నదులు ఉన్నాయి. ఇప్పటికే అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు 2 సార్లు పేర్లు పెట్టింది. 2017లో ఆరు పేర్లతో కూడిన జాబితాను చైనా విడుదల చేయగా, 2021లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 స్థలాలను పేరుమార్చింది.ఇప్పుడు మళ్లీ 11 ప్రాంతాలకు పేర్లు పెట్టింది.
చార్‌ధామ్ యాత్రలో కరోనా గ్రహణం?!

ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డెహ్రాడూన్‌లో గరిష్టంగా కరోనా వైరస్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు రోగులు కూడా చనిపోతున్నారు. ఐదుగురు రోగులు ప్రస్తుతం డూన్ ఆసుపత్రిలో ఐసియులో చేరారు. ఒక్క డెహ్రాడూన్‌లోనే 21 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. డెహ్రాడూన్ జిల్లాలో జనవరి నుండి ఇప్పటి వరకు 165 మంది కరోనా బారిన పడ్డారు. చార్‌ధామ్ యాత్ర ప్రారంభం అవుతున్న సమయంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. చార్‌ధామ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో వైరస్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకుంది.చార్‌ధామ్‌ను సందర్శించే యాత్రికులు కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించని యాత్రికులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, కోవిడ్ పరీక్షల పరిధిని పెంచడానికి ప్రభుత్వం కఠినమైన సూచనలు కూడా ఇచ్చింది.
ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయా? నిజమెంత?

ఏపీలో జగన్ పాలనలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, మద్య నిషేధం మాటేమిటి అంటూ విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికి సంబంధించి FACT CHECK విడుదల చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయంటూ కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవం. నిజానికి 2014–2019 మధ్యే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. ఈ కింది టేబుళ్లే అందుకు నిదర్శనం అని పేర్కొంది. ఈ ప్రభుత్వం దశలవారీగా మద్య నియంత్రణకు కట్టుబడి ఉంది. అందుకే షాక్ కొట్టేలా ధరలు పెంచింది. మద్యంపై అదనపు పన్ను విధించింది. ఫలితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు సగటున 30 శాతం, బీరు విక్రయాలు సగటున 57 శాతం తగ్గాయని ప్రభుత్వం పేర్కొంది.గత ప్రభుత్వంలో ఐఎంఎల్ (మద్యం) విక్రయాలు, బీరు విక్రయాలు ఎలా వున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఐఎంఎల్ (మద్యం) విక్రయాలు, బీరు విక్రయాలు ఎలా వున్నాయో గణాంకాల రూపంలో వాస్తవాలను విడుదలచేసింది ప్రభుత్వం. అవేంటో చూద్దాం.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. డిపెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్‌నూ విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. చెన్నైపై ఐదు వికెట్ల విజయంతో తమ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించారు. మరోవైపు దిల్లీ తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూపై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నేడు గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని చూస్తోంది. అయితే.. అన్ని విభాగాల్లో రాణిస్తున్న హర్దిక్ పాండ్యజట్టుకు తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దూరమవడం పెద్ద లోటే. అతడి స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో భర్తీ చేశారు. మిల్లర్ రాకతో ఆ జట్టుకు మరింత బలం చేకూరింది. రిషబ్ పంత్ లేకుండా ఢిల్లీ బలహీనంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ లేని లోటును పూరించడానికి వారు పార్ట్ టైమ్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. రెండో విజయంపై గుజరాత్ కన్నేయగా…బోణి కొట్టాలని ఢిల్లీ ప్రణాళికతో బరిలోకి దిగింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఏ పక్షం ఆధిపత్యం చెలాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఓ వ్యక్తిపై 5 ఏళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధం

యూకేకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధించబడ్డాడు. వాహనాలను ముట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? దానికి కూడా కారణం లేకపోలేదు. 29 సంవత్సరాల నేరచరిత్ర కలిగిన నేరస్థుడు ఎలాంటి వాహనాలను తాకకుండా నిషేధించబడ్డాడు. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని పెన్నింగ్‌టన్‌కు చెందిన పాల్ ప్రీస్ట్లీ (44) కారు డోర్లు తెరవడానికి ప్రయత్నించి కెమెరాకు చిక్కాడు.మార్చి 25, మార్చి 26 తేదీలలో మూడు సందర్భాల్లో, అతను ఆర్టన్ నార్త్‌గేట్‌లోని సెవెనాకర్స్, ఓర్టన్ బ్రింబుల్స్, కిల్‌బ్రైడ్, కెల్‌బర్న్‌లలోని వాహనాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం సీసీటీవీలో కనిపించింది. అనంతరం అతడిని అరెస్టు చేయగా తాళం, కత్తి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వందలాది దొంగతనాలకు సంబంధించిన నేరాలను కలిగి ఉన్న ప్రీస్ట్లీ.. ఇప్పుడు యజమాని అనుమతి లేకుండా వాహనాన్ని తాకకూడదని లేదా ప్రవేశించవద్దని ఆదేశించబడింది. అతను బుధవారం పీటర్‌బరో మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు అయ్యాడు, అక్కడ అతను మోటారు వాహనంతో జోక్యం చేసుకోవడం, గంజాయిని కలిగి ఉండటం, బహిరంగ ప్రదేశంలో కత్తిని కలిగి ఉండటం వంటి మూడు నేరాలను అంగీకరించాడు.
బాలీవుడ్ గ్రీకువీరుడు.. చివరికి ఆమె చెప్పులు మోస్తూ..

ఎంతవారు కానీ, వేదాంతులైన కానీ.. వాలు చూపు సోకగానే తేలిపొదురోయ్ .. కైపులో అని ఏ మహాకవి రాశాడో కానీ.. అది అక్షర సైతం. ఎంత స్టార్ హీరోలు అయినా.. ప్రపంచాన్ని ఏలే రాజులే అయినా ప్రియురాలి ముందు, భార్య ముందు తగ్గాల్సిందే. దీనికి ఎవరు అతీతులు కాదు. మొన్నటికి మొన్న భార్య షాపింగ్ లు మోస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించి అందరి చేత.. ఔరా అని అనిపించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఇంకొంచెం ముందుకు వెళ్లి ప్రియురాలి చెప్పులు మోస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఏంటి నిజమా.. అంటే.. ఫోటో అంత క్లియర్ గా కనిపిస్తుంటే నిజమా అంటారేంటి. బాలీవుడ్ గ్రీకువీరుడుగా పేరు తెచ్చుకున్న హృతిక్ తన భార్య సుసానే ఖాన్ తో విడిపోయి.. మోడల్, నటి అయినా సబా ఆజాద్ తో ప్రేమలో పడిన విషయం తెల్సిందే. మాజీ భార్యతో విడిపోయినా ఇద్దరు ఫ్రెండ్స్ లానే కలుసుకుంటూ ఉంటారు. అదే విడ్డూరం అంటే.. మాజీ భార్య ప్రియుడు, తన ప్రియురాలు మొత్తం కలిసి పార్టీ కూడా చేసుకుంటారు. ఇదెక్కడి విచిత్రం రా బాబు అని నెటిజన్లు ఎన్ని కామెంట్స్ పెట్టిననా మేమంతా ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు హృతిక్, సుసానే.