*నేడు మన్యం బంద్
నేడు ఏపీవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనుల్లో వ్యతిరేకత నెలకొంది. బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీల పిలుపునిచ్చాయి. బోయలు, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శాసనసభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రంలోని మన్యం ప్రాంతంలో బంద్ నిర్వహించాలని వివిధ గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
*ఏపీకి వర్షసూచన
వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదలనంటున్నాడు. మరో నాలుగు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్నాడు. ఈ మేరకు రాబోయే మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో చెదురుముదురుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 2.6 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా నూతనకల్వలో 2 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
*పండుగపూట డీజేసౌండ్స్ తో మారుమోగిన తిరుమలగిరి
చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు అనే సామెత మనం వినే వుంటాము. ఎదురుగా కూర్చున్నప్పుడు అందరికి మంచి చేయాలి అందరిలో మనముండాలి, దేవుడంటే భయముండాలి, దేవునికి హారతులివ్వాలి ఇలాంటి నీతులు చెబుతుంటారు. కానీ వెనుక మాత్రం అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ వాటిని చూస్తూ వీరుకూడా ఆనంద పడటం ఇదికథ. ఇలాంటి శ్రీరంగ నీతులు చెప్పే నాయకులే తిరుమల గిరిలో వెలిసారు. నల్లగొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా రాములోరి కళ్యాణం, ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. తిరుమలగిరిలో మాత్రం శ్రీరామ నవమి సందర్భంగా రికార్డింగ్ డాన్సులతో మారుమోగింది. తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో శ్రీరామ నవమి రోజు అమ్మాయిలతో అశ్లీలంగా రికార్డింగ్ డ్యాన్సులు పోగ్రామ్ ను ఏర్పాటు చేయించారు. భక్తి శ్రద్దలతో చేయించాల్సిన నవమి వేడుకలను అమ్మాయిలతో డీజే సౌండ్స్ తో తిరుమలగిరి మారుగింది. వెనుక శ్రీరామ నవమి అని ప్లెక్సీలు ఏర్పాటు చేసి అందులో శ్రీరాముని బొమ్మకూడా వుండటం విశేషం. దాని ముందు స్టేజ్ ఏర్పాటు చేసి అశ్లీలంగా అబ్బాయిలు, అమ్మాయి కలిసి రికార్డింగ్ డాన్సులు చేయడం తీవ్ర కలకలం రేపింది. తిరుమలగిరి మండల కేంద్రంలోనే పోటాపోటీ ఆరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
*ఆర్మీ హెలికాప్టర్స్ ఢీ
అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కెంటకీలో ఢీ కొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్ బెల్ కు 30 మైళ్ల దూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. 101వ వైమానిక విభాగానికి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోవడంతో తొమ్మిది మంది US సర్వీస్ సభ్యులు మరణించారని అధికారులు తెలిపారు. రెండు HH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కూలిపోయాయి. టెన్నెస్సీ సరిహద్దు సమీపంలోని ట్రిగ్ కౌంటీలో, సమీపంలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ అధికారులు గురువారం తెల్లవారుజామున చెప్పారు. వారు “సంఘటన జరిగినప్పుడు సాధారణ శిక్షణా మిషన్‌లో పాల్గొంటున్నారు అని తెలిపారు.
హెలికాప్టర్లు ఎగురుతున్నప్పుడు క్రాష్ అయిందని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిరికి తరలించినట్లు వెల్లడించారు. విమానం బయలుదేరిన ప్రాంతం నుంచి వెళ్లి బహిరంగ మైదానంలో పడిపోయింది. కాబట్టి అదనపు ప్రాణనష్టం జరుగలేదన్నారు. క్రాష్ అయిన బ్లాక్ హాక్స్ శిక్షణ వ్యాయామంలో పాల్గొన్న మొత్తం నాలుగు హెలికాప్టర్లలో రెండింటికి ప్రమాదం జరిగిందని 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్ ప్రతినిధి స్టాఫ్ సార్జంట్ తెలిపారు.
*డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న డానాల్డ్ ట్రంప్ కు ఊహించిన షాక్ తగిలింది. ఆయనపై నేరారోపణలను దాదాపుగా ధృవీకరిస్తూ గురువారం ఆ దిశగా న్యూయార్క్ కోర్టు సంకేతాలు ఇచ్చింది. తద్వారా అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది. 2016 ఎన్నికల సమయంలో ఓ పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం ( నాన్ డిజ్ క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్ పై ఉన్నాయి. ఈ తరుణంలో సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పోర్న్ స్టార్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రోఫైల్ కేసుగా దర్యాప్తు విచారణ జరిపాయి. చివరికి ఈ నెల మధ్యలో ఈ వ్యవహారాన్ని ఖండిస్తూనే తన అరెస్ట్ కు రంగం సిద్దమవుతోందని.. ఆందోళనలకు సిద్దం కావాలంటూ అనుచరులకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పిలుపు ఇచ్చాడు. ఈ తరుణంలో న్యూయార్క్ గ్రౌండ్ జ్యూరీ గురువారం నాడు డానాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేక ఆయనే లొంగిపోతారా.. కేవలం కోర్టు విచారణతో సరిపెడతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వైపు ఈ పరిణామాంపై ఆయన అధ్యక్ష పోటీపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
*ఐపీఎల్ సమరానికి సిద్ధం
టీ20 క్రికెట్ అంటేనే రసవత్తర పోరాటాలకు కేరాఫ్ అడ్రెస్.. అలాంటిది ఇక ఐపీఎల్ అంటే ఆ మజానే వేరు.. దాని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటీ. గత 15 సీజన్ల నుంచి హోరాహోరీగా మ్యాచ్ లు.. ఊహించని మలుపులు.. కళ్లు తిప్పుకోనివ్వని ఉత్కంఠ క్షణాలు.. చివరి నిమిషం వరకు సాగే పోరాటాలు.. నిమిషాల్లో మారే ఫలితాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అసలు సిసలైన మజా ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఈ 16వ సీజన్ లో తొలి పోరులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే గతేడాది తమ తొలి సీజన్ లో ఛాంపియన్ గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ ఈ సారి లీగ్ లోనూ విజయాన్ని కొనసాగించాలని భావిస్తుంది. అలాగే గత సీజన్ లో గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లిన సీఎస్కే ఈసారి ఎలాగైన కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అలా ధోనీ కెప్టెన్సీ లో సీఎస్కే-హార్ధిక్ పాండ్యా గుజరాత్.. రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి.
*’ఉస్తాద్…’ హరీశ్ శంకర్ ఏం చేయబోతున్నారు?
మంచి సబ్జెక్ట్ దొరకలాలే కానీ, తకధిమితై ఆడించేస్తా అంటూ సరదాగా సాగుతుంటారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్, తనకు అచ్చివచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మొదట్లో ‘భవదీయుడు… భగత్ సింగ్’ అనే టైటిల్ అనుకున్నారు. తరువాత ‘భవదీయుడు’ స్థానంలో ‘ఉస్తాద్’ అని చేరింది. ఇప్పుడు పవన్ తో ‘ఉస్తాద్…భగత్ సింగ్’ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో హరీశ్ బంపర్ హిట్ కొట్టారు కాబట్టి, ‘ఉస్తాద్…భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీశ్ శంకర్ 1979 మార్చి 31న జగిత్యాల సమీపంలోని ధర్మపురిలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకైన హరీశ్ కు సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఎలాగైనా సరే వైవిధ్యంగా అలరించాలనీ తపించేవారు. చదువుకొనే రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకొని నాటకరంగంతో కొద్ది రోజులు సరదాగా సాగారు హరీశ్. నటించారు, నాటకాలు రచించారు, వాటికి దర్శకత్వం వహించారు. ఆ సరదాతోనే సినిమా రంగంవైపు పరుగు తీశారు. రచనలో చేయి చేసుకున్నారు, నటనలో కాలు పెట్టారు. చివరకు మెగాఫోన్ పట్టి అందరికీ ‘షాక్’ ఇచ్చారు. ఈ ప్రయాణంలో రచయిత కోన వెంకట్, దర్శకులు పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ వంటివారు హరీశ్ కు సహాయసహకారాలు అందించారు. రవితేజ హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘షాక్’తోనే హరీశ్ డైరెక్టర్ అయ్యారు.