Story Board: పాములపర్తి వెంకట నరసింహారావు ఈ పేరు నేటితరం వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ పీవీ నరసింహారావు అంటే తెలియనోళ్లు ఉండరు. నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకుని పైకి గంభీరంగా కనిపించే పీవీ, దేశ ప్రగతికి దార్శనికుడు. తన మేథస్సుతో, ఆర్థిక సంస్కరణలతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలపై ఎక్కించి అపర చాణక్యుడిగా పేరు పొందారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా PV నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన పీవీ దేశానికి పలు హోదాల్లో సేవలు అందించారని ప్రధాని మోడీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆేయన దార్శనిక నాయకత్వం ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.
పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న పీవీ.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకోవాల్సి వచ్చింది. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన.. ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది, ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 5లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు పీవీ.
ప్రధానిగా తన హయాంలో పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయనకు సంగీతం, సినిమా, నాటకాలంటే ఆసక్తి. భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి, రచనా వ్యాసాంగం, రాజకీయ వ్యాఖ్యానం, భాషలు నేర్చుకోవడం, తెలుగు, హిందీలో కవితలు రాయడం, సాహిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. తెలుగులో సుప్రసిద్ధ నవల వేయిపడగలను పీవీ సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ 17 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళం, ఉర్దూ పీవీ మాట్లాడగలిగే దేశీయ భాషలు కాగా.. ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, గ్రీక్, లాటిన్, పర్షియన్ విదేశీ భాషలు. పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా కొనసాగారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనత పీవీకే దక్కుతుంది. ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలే ప్రస్తుతం దేశాన్ని సుస్థిరం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, పండితుడు, రాజనీతిజ్ఞుడైన పీవీ దేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు.
ప్రధానమంత్రిగా పీవీ పదవీకాలంలో ప్రపంచ మార్కెట్లకు భారత్ ద్వారాలు తెరిచింది. ఇది ఆర్థిక అభివృద్ధి కొత్త శకాన్ని ప్రోత్సహించింది. విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు పీవీ అందించిన సహకారం మరవలేనిది. సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా పీవీ బహుముఖంగా ప్రజ్ఞ ప్రదర్శించారు.
రాజకీయాల్లో పీవీ అపర చాణక్యుడిగా పేరు పొందారు. దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షుగా సాగిన ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపారు. ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన తొలి గాంధీ కుబుంబేతరుడిగా పీవీ రికార్డు నెలకొల్పారు. పుణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పుచ్చుకుని.. కొన్నాళ్లు కాకతీయ పత్రికలో జయ-విజయ పేరుతో వ్యాసాలు రాశారు పీవీ. పీవీ పాలనలో ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవడం విదేశీ మారక ద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలీకమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది. గతంలో ఆహార ఉత్పత్తుల దిగుమతిలో అట్టడుగున ఉన్న భారత్ నేడు ప్రపంచానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను సరఫరా దేశంగా ఆవిర్భవించిందంటే పీవీ సంస్కరణలే కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసారు. అందుకే పీవీని ఆర్ధిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే. పీవీకి ముందు బంగారాన్ని తనఖా పెట్టి కొంత సొమ్ము తెచ్చి, అప్పులు తీర్చాల్సిన దుస్థితి. 67 టన్నుల బంగారాన్ని విమానాంలో ఇంగ్లాండ్‌కు పంపి ఐఎంఎఫ్ వద్ద కుదువపెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. ద్రవ్యలోటు 12.7 శాతానికి చేరి.. చారిత్రక గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ రుణం జీడీపీలో 53 శాతానికి చేరుకుంది. అప్పటి నుంచి సంస్కరణలు అమలు చేశారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. దీనిని రెండు విడతలుగా తగ్గించారు. 1991 జూలై 1 9 పైసలు, ఆ తర్వాత రెండు రోజులకు మరో 11 పైసలు తగ్గించారు. ఆయన సంస్కరణల వల్ల దీంతో ద్రవ్యోల్బణం తగ్గి, ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణను ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా నియమించారు.
పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చారు. ప్రయివేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించి పోటీతత్వాన్ని నింపారు. సెబికి 1992లో చట్టబద్దత కల్పించారు. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. ఎనిమిది రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రయివేటు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతించారు. కొన్ని రంగాల్లో 100 శాతం వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చింది. ప్రయివేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగింది. పీవీ నరసింహా రావు సంస్కరణలు, ఆ తర్వాత నరేంద్ర మోడీ వరకు వచ్చిన ప్రభుత్వాల దూరదృష్టి కారణంగా 1991లో ఈ మూడు దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు 500 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. లైసెన్స్ రాజ్‌కు చెల్లుచీటీ పాడారు. పీవీ అమలు చేసిన సంస్కరణలే నేడు.. దేశానికి వెన్నుముకగా నిలిచాయి. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. చివరికి కేంద్రం ఆ డిమాండ్ ను నెరవేర్చింది.