Commemorative Rs 100 NTR Coin Release Today: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరిట రూ. 100 వెండి నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గౌరవార్థం శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ ఈ నాణేన్ని ముద్రించింది. ఈ స్మారక నాణేన్ని నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం ఆరంభం కానుంది.
నాణెం విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అంతేకాదు సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సన్నిహితులు చాలా మంది హాజరవుతారు. దాదాపుగా 200 మంది అతిథులు హాజరుకానున్నారు.
Also Read: Gold Price Today: మహిళలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?
ఆదివారం రాత్రి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఇప్పటికే దేశ రాజధాని చేరుకున్నారు. అయితే నాణెం విడుదల కార్యక్రమానికి యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా? లేదా? అనేదానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. మరోవైపు హీరో కల్యాణ్ రామ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని గంటలు ఆగితే ఈ సందిగ్ధతకు తెరలేవనుంది. సినీ నిర్మాతలు చలసాని అశ్వినీ దత్, దగ్గుబాటి సురేశ్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు.