ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే సపరేటు అన్నట్లు ఉంటారు. ప్రపంచాన్ని గడగడలాడించే నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు. చిన్న దేశం అయినా క్షిపణి ప్రయోగాలు, అణ్వాయుధాలతో అగ్రరాజ్యం అమెరికాను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కిమ్ తగ్గేదేలే అంటూ క్షిపణి పరీక్షతో కాదు…అణ్వాయుధ ప్రత్యేక చట్టంతో అగ్రరాజ్యానికి కోపం తెప్పిస్తున్నాడు. అమెరికాను మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు. అసలు విషయానికి వస్తే అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో తొక్కి.. అణు ఆయుధాలను అపరిమితంగా తయారు చేసుకునే చట్టాన్ని రూపొందించింది నార్త్ కొరియా.
Also Read: Khairatabad-Balapur Ganesh Live Updates: ఖైరతాబాద్-బాలాపూర్ గణేష్ నిమజ్జనం లైవ్ అప్డేట్స్
అగ్రరాజ్యం, దాని మిత్ర పక్షాల నుంచి వచ్చే బెదిరింపులను తిప్పికొట్టాలనే ఉద్దేశ్యంతో డీపీఆర్‌కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశపెట్టింది నార్త్ కొరియా పార్లమెంట్. గురువారం ఉత్తర కొరియా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ జరిగ్గా.. ఈ సమావేశంలో.. కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్ర పక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాంగ్‌యాంగ్ అణు ఆశయాలను అణిచివేసేందుకు, దాని వ్యవస్థను నాశనం చేసేందుకు అమెరికా, దాని భాగస్వాములు ప్రయత్నిస్తున్నాయని కిమ్ అన్నారు. ఆ బెదిరింపులను నార్త్ కొరియా సమర్థవంతంగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేసిన కిమ్ దాని కోసం ఈ డీపీఆర్‌కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొ్న్నారు.
ఈ కొత్త చట్టం ప్రకారం ఉత్తర కొరియా అపరిమితంగా అణ్వాయుధాల్ని తయారు చేసుకోవచ్చు. అణ్వాయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, వాటిని వివిధ సేవల్లో ఉపయోగించుకోవడం లాంటి అవసరాన్ని ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ వివరించారు. ఉత్తరకొరియా ఇప్పుడే కాదు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి చర్యలకు పాల్పడింది. ఈ చట్టాన్ని రూపొందించడం ద్వారా ప్యాంగ్‌యాంగ్‌తో ఆర్థిక సాయం విషయంలో నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు అమెరికా చేసిన అభ్యర్థనను కిమ్ లైట్ తీసుకున్నట్లు అర్థం అవుతుంది. మరి ఈ చట్టంపై అగ్రరాజ్యం అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.