Cold Wave: ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న కోల్డ్‌వేవ్ పరిస్థితులు శుక్రవారం తీవ్రమయ్యాయి, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉదయం నైరుతి ఢిల్లీలోని ప్రాంతాలలో ఒకటైన ఆయా నగర్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సఫ్దర్‌జంగ్‌లో ఉష్ణోగ్రత 4.0 డిగ్రీలుగా ఉంది. ఢిల్లీలో చలి కారణంగా ప్రజలు చలిమంటల వద్దే కాలం గడుపుతున్నారు. తీవ్రమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశ రాజధానిలో పెరుగుతున్న చలిగాలుల కారణంగా, నిరాశ్రయుల కోసం షెల్టర్ హోమ్‌లు తెరవబడ్డాయి. ఢిల్లీలోని నిరాశ్రయులైన ప్రజలు దేశ రాజధాని ప్రాంతంలో వణుకు పుట్టిస్తున్న చలిగాలుల నుండి ఉపశమనం పొందేందుకు తమ ప్రాంతాల్లోని ఆశ్రయాలకు తరలివచ్చారు. ఢిల్లీలో 197 శాశ్వత షెల్టర్ హోమ్‌లు ఉన్నాయని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ సభ్యుడు విపిన్ రాయ్ అన్నారు. చలికాలంలో ఢిల్లీలో దాదాపు 250 టెంట్లు వేశామని.. నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశామని ఆయన చెప్పారు.
Aircraft Crash: ఆలయ శిఖరాన్ని ఢీకొట్టి కూలిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
భారత వాతావరణ శాఖ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. జనవరి 7, శనివారం వరకు కోల్డ్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇదే పరిస్థితులు జనవరి 11 వరకు కొనసాగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ కాన్‌పూర్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25 మంది మరణించారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. వీరిలో 17 మంది ఎలాంటి వైద్య సహాయం అందక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు తెలిపాయి. తీవ్రమైన చలి కారణంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.