కెనడా సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు నిరాధారమని తేలిపోయాయి. ఈ మేరకు ఆ దేశ దర్యాప్తు సంస్థ తేల్చిచెప్పింది. ఈ పరిణామం చెంపదెబ్బ కొట్టినట్టైంది. 2019, 2021 ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపించిన వ్యాఖ్యల్ని కెనడా వెనక్కి తీసుకుంది. తాజా అప్డేట్ ప్రకారం విదేశీ జోక్యం కేసుపై అధికారిక దర్యాప్తులో భారతీయుల హస్తం లేదని తోసిపుచ్చింది.
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటుందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తాజాగా తేలిపోయాయి. ఈ మేరకు తాజాగా విడుదలైన కమిషన్ నివేదికతో తేటతెల్లమైంది. దీంతో కెనడా సర్కారుకు గట్టి షాకే తగిలింది. ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైనట్లు నివేదికను సమర్పించాయి. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రూడో సర్కారుకు ఊహించని దెబ్బగానే చెప్పొచ్చు.
భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యపై భారత్‌ను నిందించిన ఆ సర్కారు.. అనంతరం కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని తాజాగా ఆ దేశ దర్యాప్తులో వెల్లడైంది. ఎన్నికల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.
కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అక్కడి విపక్షాలు ఆరోపించాయి. దీంతో ట్రూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల దర్యాప్తులో భారత్ పేరును చేరుస్తూ ట్రూడో సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కెనడా ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తేల్చి చెప్పింది. ఈ పరిణామాల వేళ దర్యాప్తునకు సంబంధించి కీలక విషయాలు తాజాగా బయటికొచ్చాయి. కెనడా రాజకీయాల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైంది. 2021 నాటి ఎన్నికలను ప్రభావితం చేసేలా భారత్ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్ అధికారి కమిషన్‌కు వెల్లడించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సదరు అధికారి చెప్పినట్లు తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు కమిషన్ ఎదుట జస్టిన్ ట్రూడో బుధవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2019, 2021లో కెనడాలో జరిగిన జాతీయ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో గతేడాది సెప్టెంబరులో ఈ కమిషన్ దర్యాప్తు చేపట్టింది. కాగా ఆ ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక వెల్లడించింది.