Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్‌ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్‌గా ఉన్నప్పటికీ.. నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు మంత్రికి వివరించారు.
ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప నేతృత్వంలోని సీయిర్ వైద్యుల బృందం సౌమ్యకు అత్యాధునిక చికిత్స అందిస్తోంది. ఆమె కోలుకునే వరకు అయ్యే ఖర్చు, బాధ్యత ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదు. నిందితులపై ఇప్పటికే ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేశామని తెలిపారు. తెలంగాణలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇలాంటి దాడులు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు.
ఈ దారుణ ఘటనపై ఎక్సైజ్ సీఐ స్వప్న సంచలన విషయాలను బయటపెట్టారు. గంజాయి రవాణా అవుతుందన్న సమాచారంతో తాము మాటు వేశామని ఆమె తెలిపారు. మేము స్మగ్లర్ల కారును అడ్డగించినప్పుడు, ఇద్దరు నిందితులు కారు దిగి పారిపోయారు. కానిస్టేబుల్ సౌమ్య కారు బానెట్ ముందు నిలబడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిందితులు కనికరం లేకుండా కారును ఆమెపైకి పోనిచ్చారు. కిందపడిపోయిన సౌమ్యపై నుంచి కారు వెళ్లడమే కాకుండా, మళ్లీ రివర్స్ తీసి రెండోసారి కూడా ఆమెను తొక్కించారని సీఐ స్వప్న కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రస్తుతం సోహెల్, రాహుల్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వారికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మతిన్ మాఫియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అలాగే తాను స్మగ్లర్లతో కుమ్మక్కయ్యానని వస్తున్న వార్తలను సీఐ స్వప్న తీవ్రంగా ఖండించారు. నేను వారితో చేతులు కలిపి ఉంటే అసలు దాడులకే వెళ్లేదాన్ని కాదు కదా? ఈ అసత్య ప్రచారాలు బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.