Journalist Accreditation Rules: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేపట్టింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా “తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ – 2025″కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం G.O. Rt.No.103ను విడుదల చేసింది. జనవరి 24, 2026న స్పెషల్ సెక్రటరీ సిహెచ్. ప్రియాంక జారీ చేసిన ఈ ఉత్తర్వుల ద్వారా జర్నలిజం రంగంలో మహిళలకు ప్రాధాన్యత పెరగడంతో పాటు, క్షేత్రస్థాయి జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుంది.
ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైన అంశం మహిళా రిజర్వేషన్. ఇకపై మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల నియామకంలో 33% సీట్లను తప్పనిసరిగా మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అక్రిడిటేషన్ కార్డుల మంజూరులోనూ మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో, 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు అదనంగా ఒక అక్రిడిటేషన్ కార్డ్ మంజూరు చేయనున్నారు.
పెద్ద, మధ్యస్థ పత్రికల కోసం ప్రత్యేక విభాగాల్లో కార్డులను ప్రభుత్వం పెంచింది. పెద్ద పత్రికలు (2.5 లక్షలకు పైగా సర్క్యులేషన్) స్పోర్ట్స్, కల్చర్, మరియు ఫిలిం విభాగాల్లో ఒక్కొక్కదానికి ఒక అదనపు కార్డు ఇస్తారు. ఇక మధ్యస్థ పత్రికలు (75,001 – 2.5 లక్షలు సర్క్యులేషన్)కు స్పోర్ట్స్, కల్చర్ లేదా ఫిలిం విభాగాలలో ఏదో ఒక దానికి అదనంగా ఒక కార్డు మంజూరు చేస్తారు. అలాగే రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC)ని మరింత బలోపేతం చేస్తూ కొత్త సభ్యులను చేర్చారు. ఇందులో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధితో పాటు, పెద్ద దినపత్రికల నుండి ఒక డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధికి చోటు కల్పించారు.
JSW Motors తొలి SUV ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో భారత మార్కెట్‌లోకి Jetour T2 i-DM..!
ఇప్పటి వరకు ఉన్న “మీడియా కార్డ్” అనే పదాన్ని ఇకపై అధికారికంగా “అక్రిడిటేషన్ కార్డ్” గా వ్యవహరిస్తారు. నిబంధనల్లోని “ఉర్దూ బిగ్ న్యూస్‌పేపర్” స్థానంలో “ఉర్దూ డైలీ న్యూస్‌పేపర్” అనే పదాన్ని చేరుస్తూ మార్పు చేశారు. ఈ సవరణల పట్ల జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.