Bihar Ministers List: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆయన బృందంలో 26 మంది మంత్రులుగా చోటు సంపాదించుకున్నారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, విజయ్ చౌదరి వంటి అనుభవజ్ఞులైన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే క్యాబినెట్ మంత్రుల జాబితాలో 12 మంది పేర్లు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఈ 12 మంది ఎవరు, వారి చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: India Missile Test: క్షిపణి పరీక్షకు సై.. NOTAM జారీ చేసిన భారత్
12 మంది మంత్రులు వీరే..
రామ్‌కృపాల్ యాదవ్: ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై దానాపూర్ నుంచి గెలిచిన ప్రముఖ నాయకుడు రాంకృపాల్ యాదవ్‌ను నితీష్ మంత్రివర్గంలో చేర్చారు. యాదవ్ 1974లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు, 1978లో ఎఎన్ కాలేజీ నుంచి బీఏ డిగ్రీ తీసుకున్నారు. అయితే ఆయనపై రెండు క్రిమినల్ కేసులు ఇప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన భార్య చరాస్తులు, స్థిరాస్తుల పరంగా ధనవంతురాలు. ఆయన వద్ద రూ.14.16 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, తన భార్య ఆస్తి విలువ రూ.30.27 లక్షలు. ఆయనకు రూ.1 లక్ష కంటే ఎక్కువ విలువైన జిప్సీ కూడా ఉంది. అలాగే ఆయనకు నౌబత్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దాదాపు ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన భార్యకు జమాల్ రోడ్‌తో సహా పాట్నాలోని వివిధ ప్రాంతాలలో ₹1.55 కోట్ల విలువైన భూములు ఉన్నాయి.
సంజయ్ సింగ్ టైగర్: అరా ఎమ్మెల్యే సంజయ్ సింగ్ రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజా నితీష్ కుమార్ మంత్రివర్గంలో కూడా ఆయన స్థానం సంపాదించుకున్నారు. భోజ్‌పూర్‌లోని బిహియా బ్లాక్‌లోని అమరై నవాడ నివాసి అయిన ఈ 50 ఏళ్ల సంజయ్ టైగర్ పాట్నాలోని ఎఎన్ కాలేజీ నుంచి బ్యాచిలర్, ఎల్‌ఎల్‌బీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కలిగి ఉన్నారు. నలుగురు సోదరులలో చిన్నవాడు సంజయ్. ఆయన తండ్రి బీహార్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేశారు.
అరుణ్ శంకర్ ప్రసాద్: బీజేపీకి చెందిన అరుణ్ శంకర్ ప్రసాద్ ఖజౌలి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆర్జేడీకి చెందిన బ్రిజ్ కిషోర్ యాదవ్‌ను 13 వేల ఓట్ల తేడాతో ఓడించి వరుసగా రెండవసారి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
సురేంద్ర మెహతా: బచ్వారా ఎమ్మెల్యే సురేంద్ర మెహతా రాజకీయ జీవితం భారత కమ్యూనిస్ట్ పార్టీతో ప్రారంభమైంది. విద్యార్థి దశలోనే ఆయన AISFలో పని చేశారు. ఆ తరువాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి అప్పటి బరౌని అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన 2015లో బెగుసరాయ్ నుంచి, 2020లో బచ్వారా నుంచి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సురేంద్ర మెహతా తన గత రికార్డును బద్దలు కొట్టి 1.30 లక్షల ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
నారాయణ్ ప్రసాద్: నౌతాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాల్గవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ నాయకుడు నారాయణ్ ప్రసాద్. ఆయన తేలి (సాహు) వర్గానికి చెందినవారు. ఇక్కడి స్థానికులు ఆయనను నారాయణ్ ప్రసాద్ సా అని పిలుస్తారు. నారాయణ్ ప్రసాద్‌కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఆయన సోదరుడు హరేంద్ర ప్రసాద్ ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన మంత్రివర్గంలోకి రావడం ఆయన మద్దతుదారులలో ఉత్సాహాన్ని ఇచ్చింది.
రామ నిషాద్: ఔరాయ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎన్నికైన రమా నిషాద్, ముజఫర్‌పూర్ మాజీ ఎంపీ అజయ్ నిషాద్ భార్య, కెప్టెన్ జయనారాయణ నిషాద్ కోడలు. ఆమె వార్డు కౌన్సిలర్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా, హాజీపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆమె రాజకీయ జీవితంలో ఆమె కుధ్ని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధమైంది. ఇంతలో మారిన రాజకీయ సమీకారణాలలో ఔరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వాస్తవానికి బీజేపీ నిషాద్ కమ్యూనిటీని ఆకర్షించడానికి ఈ చర్య తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
లఖేంద్ర కుమార్ రోషన్: పటేపూర్ నియోజకవర్గం నుంచి లఖేంద్ర కుమార్ రోషన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఆర్జేడీ అభ్యర్థి ప్రేమా చౌదరిని 22,380 ఓట్ల తేడాతో ఓడించారు.
శ్రేయసి సింగ్: జముయ్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి శ్రేయసి సింగ్. తాజాగా నితీష్ కుమార్ మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆమె అతి పిన్న వయస్కురాలు, అలాగే ఏకైక అథ్లెట్. యువతకు ముఖ్యంగా అథ్లెట్లకు ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ఆమె ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఆమె చూపిన శ్రద్ధకు ప్రశంసలు అందుకుంటుంది.
దీపక్ ప్రకాష్: రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాష్. నితీష్ కుమార్ నేతృత్వంలోని కొత్త NDA ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యువ నాయకత్వం, సాంకేతిక, రాజకీయ క్రియాశీలత దృష్ట్యా, తనను మంత్రివర్గంలో చేర్చడం ద్వారా కొత్త తరానికి అవకాశాలను కల్పించే NDA వ్యూహంలో భాగంగా మారుతుందని చెబుతున్నారు.
సంజయ్ కుమార్: LJPR టికెట్‌పై బఖ్రీ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న సంజయ్ కుమార్‌ను నితీష్ కుమార్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బఖ్రీ స్థానంలో CPIకి చెందిన సూర్యకాంత్ పాశ్వాన్‌ను సంజయ్ కుమార్ ఓడించారు. CPI అభ్యర్థి సూర్యకాంత్ పాశ్వాన్ 81,193 ఓట్లు రాగా, సంజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థిపై 17,318 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో సూర్యకాంత్ పాశ్వాన్ బీజేపీ అభ్యర్థి రాంశంకర్ పాశ్వాన్ పై కేవలం 777 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ప్రమోద్ కుమార్: ప్రమోద్ కుమార్ పూర్తి పేరు ప్రమోద్ కుమార్ చంద్రవంశీ. ఆయన జెహానాబాద్ నివాసి. ఆయన ప్రస్తుతం MLA కోటా నుంచి MLCగా ఉన్నారు.
సంజయ్ కుమార్ సింగ్: సంజయ్ కుమార్ సింగ్ ఎల్జేపీ (రామ్ విలాస్) టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేసి మహువా అసెంబ్లీ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఓడించారు. తాజాగా ఆయన నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ నుంచి, తన కుటుంబం నుంచి విడిపోయి, జనశక్తి జనతాదళ్ అనే కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసింది. ఈ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్‌ను ఓడించడం బీహార్ రాజకీయాల్లో సంజయ్ కుమార్ స్థాయిని పెంచింది.
READ ALSO: Delhi Car Blast Case: ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో మరో నలుగురు కీలక నిందితుల అరెస్ట్ ..