ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నాలుగు టీమ్స్ పాయింట్ల పట్టికలో టాప్ -4లో కొనసాగుతున్నాయి.
10 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసులోనే ఉంది. ఇక తొమ్మిది మ్యాచుల్లో కేవలం మూడే విజయాలు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రేసులోనే ఉన్నాయి. అయితే ఈ రెండు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన 5 మ్యాచులను గెలవాల్సి ఉంటుంది. విజయంతో పాటు మంచి రన్‌రేట్ కూడా సాధించాల్సి ఉంటుంది. కోల్‌కతా కంటే సన్‌రైజర్స్ రన్‌రేట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్లేఆఫ్స్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఆ జట్టు బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: MS Dhoni: చెన్నై ఓటములకు ప్రధాన కారణం అదే: ఎంఎస్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. ఓ విధంగా చెప్పాలంటే డూ-ఆర్-డై మ్యాచ్. గత సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ సంవత్సరం మేము ఎందుకు అలా చేరకూడదు. 100 శాతం ఆట తీరును ప్రదర్శిస్తాం’ అని నితీశ్ చెప్పాడు. ప్రస్తుతం నితీశ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మరి నితీశ్ మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి. గతేడాది అలరించిన నితీశ్ రెడ్డి.. ఈ సంవత్సరం అంచనాలను అందుకొలిపోతున్నాడు.