ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్‌కే.. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మిగిలిన 5 మ్యాచ్‌లలో గెలిచినా.. 14 పాయింట్స్ మాత్రమే ఖాతాలో చేరుతాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. సీఎస్‌కే పరాజయ పరంపర నేపథ్యంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిస్సహాయత వ్యక్తం చేశాడు.
Aslo Read: KKR vs PBKS: ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్!
టోర్నీలో 5-6 ఆటగాళ్లు విఫలమవుతూ ఉంటే ఏ టీమ్ అయినా మంచి ఫలితాలు రాబట్టడం కష్టమని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు. ‘ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ఒకటి రెండు లోపాలు ఉంటే సరిదిద్దుకోవచ్చు. కానీ అయిదారుగురు ఆటగాళ్లు విఫలమవుతూ ఉంటే గెలవడం చాలా కష్టం. ఫలితాలు సాధించాలంటే మంచి ప్రదర్శన అవసరం. ఎక్కువ మంది ఆటగాళ్లు విఫలం కావడంతో జట్టులో మార్పులు భారీగా చేయాల్సి వచ్చింది. ఉన్న అవకాశాలను ప్రయత్నించడం తప్ప మరో దారి లేదు. మంచి ఆరంభాలు దక్కడం లేదు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను బ్యాటర్లు ఎటాక్ చేయడం లేదు. చెన్నై ఓటములకు ఇది కూడా ప్రధాన కారణం’ అని ధోనీ నిరాశ వ్యక్తం చేశాడు.