గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒకెత్తు అయితే.. లక్షద్వీప్‌పై ఆమె చేసిన ప్రకటన మరొకెత్తు. బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా స్పెషల్‌గా ఫోకస్ అయ్యాయి. దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణమేంటంటే ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలే.
ఇండియా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న దేశం. అన్ని రంగాల్లోనూ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. భారత్‌లో అనేకమైన ఆహ్లాదరకమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విదేశీయులు ఎక్కువగా భారత్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. పైగా ఇండియా సంస్కృతి, సాంప్రదాయాలకు పేరుగాంచిన దేశం. ఇన్ని విశిష్టతలు భారత్‌కు మాత్రమే సొంతం.
అయితే ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్‌ను సందర్శించి డైవింగ్, స్నార్కెలింగ్ చేశారు. అనంతరం సుందరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాహసాలు చేసేవారు ఇక్కడికి రావొచ్చని పేర్కొన్నారు. అనంతరం మాల్దీవులకు చెందిన మంత్రులు మోడీపై విషం వెళ్లగక్కారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. అంతేకాదు మాల్దీవుల తీరును భారతీయులు తీవ్రంగా ఖండించారు. మాల్దీవుల సందర్శనను కూడా భారతీయులు విరమించుకున్నారు. ఒకప్పుడు టూరిస్ట్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న ఇండియా.. జనవరిలో అది కాస్త ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. దీనికి మాల్దీవుల ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం.
తాజాగా లక్షద్వీప్ అభివృద్ధికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గురువారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. లక్షద్వీప్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రముఖ పర్యటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు నిర్మల తెలిపారు.
వాస్తవానికి లక్షద్వీప్ ప్రాంతాన్ని ప్రపంచ పర్యటక హబ్‌గా తీర్చిదిద్దాలని కేంద్రం ఎప్పటి నుంచో భావిస్తోంది. తాజా వివాదం ప్రజల భావోద్వేగాలను మరింత ప్రభావితం చేశాయి. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేసింది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్షద్వీప్‌లో 35 దీవులు ఉన్నాయి. సెప్టెంబరు-మే మధ్యకాలంలో ఇక్కడి వాతావరణం పర్యాటకానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. పైగా బీచ్‌లు, పగడపు దీవులు, సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే ఇది మాల్దీవులకు ఏ మాత్రం తీసిపోదు. తాజాగా కేంద్రం తీసుకుంటున్న చర్యలతో లక్షద్వీప్ మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.