Nirmala Sitharaman: లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దాంతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఆయా కుటుంబాలు పొందే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. వినియోగించుకున్న విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే వేగవంతం చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read Also: Budget 2024: అలెర్ట్.. నేటి నుంచి బ్యాంకుల కొత్త రూల్స్..
అలాగే, మధ్య తరగతి ప్రజల కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇండ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇస్తున్నామన్నారు. కోవిడ్ కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం అమలు చేశామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.