ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల రంగంలో ప్రభుత్వ మార్పు తర్వాత వేగవంతమైన పనులు ప్రారంభమయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తవుతుండగానే సాగునీటి ఎన్నికలు నిర్వహించడం తమ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. మంత్రి రామానాయుడు విమర్శిస్తూ, గత జగన్ ప్రభుత్వం సమయంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజెక్టు పనులకు రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధాన కాలువలు, డ్రైన్ల మరమ్మతులకు మొట్టమొదటి ఏడాదిలోనే రూ.344 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు గత ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, తాము ఏడాదిలోనే రూ.1,900 కోట్ల పరిహారం అందజేశామని నిమ్మల తెలిపారు.
హంద్రీ-నీవా పనులను కూడా వేగవంతం చేసి ఇప్పటివరకు రూ.3,870 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి రూ.2,352 కోట్లు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో వంశధార, తోటపల్లి, హిరమండలం వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి రాబోయే రెండేళ్లలో రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
కృష్ణా జలాల్లో 512 TMC నీటిని సాధించడం పూర్తిగా చంద్రబాబు నాయకత్వపు ఘనతేనని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కృష్ణా జలాల అంశంలో గత ప్రభుత్వం ఎప్పుడూ మౌనం వహించినట్టు ఆయన విమర్శించారు. 2020లో డయాఫ్రం వాల్ కూలినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మంత్రి తీవ్రంగా విమర్శించారు.
Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..