మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సరం వేడకల్లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 31) వైన్స్ షాపుల సమయ వేళలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి వరకు లిక్కర్ దొరుకుంటుందని సంతోష పడిపోకండి. నేటి రాత్రి 8 గంటల నుంచే విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలుంటాయి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10,000 లేదా 6 నెలల జైలు శిక్ష తప్పదు. ఒక్కోసారి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. పదే పదే ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆర్టీఏ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తుంది. ఇక వాహనాల పైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కూడా కేసుల నమోదు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిచారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకి విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి ఇంటికి వెళ్లాలనుకునే వారు.. క్యాబ్,ఆటో బుక్ చేసుకుని వెళ్లాలని సూచించారు. క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడంతో పాటు డాక్యుమెంట్స్ కూడా వెంట ఉంచుకోవాలని చెప్పారు.
Also Read: Jagga Reddy: సీఎం గారూ.. మా లేఖలను కూడా ఆమోదించండి!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి అనుమతి ఉండదని అడిషనల్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఇక అర్థరాత్రి 12:30 గంటలకు వరకు నగరంలో మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి.