ప్రస్తుత కాలంలో థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కే ఆదరణ ఎక్కువగా ఉన్నదన్న మాట వాస్తవం. అయితే ఆ ప్లాట్ ఫామ్స్ ప్రజాదరణ పొందే విషయంలో ఏది బెస్ట్ అన్నది టీఆర్ పిలే నిర్ణయిస్తాయి. అయితే మంచి కంటెంట్ తో పాటు టాప్ స్టార్స్ నటించిన ఫీచర్ ఫిల్మ్‌ల హక్కులు ఎవరి కలిగి ఉంటే ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ఆదరణతో పాటు టిఆర్ పిలు దక్కుతాయి. ప్రత్యేకించి తెలుగు సినీ ప్రేమిలు స్టార్స్ సినిమాలకు ఎక్కువ ఓటు వేస్తుంటారు. గతంలో ‘రంగస్థలం, ఎఫ్2, అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలతో పాటు తాజాగా ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ సినిమాలు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడం అది ఇండియాలో పక్కాగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
అయితే అప్పుడు, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తో ప్రైమ్ పోటీ పడుతూనే ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల చేసిన తర్వాత టాప్ స్టార్స్ నటించిన సినిమాల సామర్థ్యం ఏమిటో తెలుసుకుంది. డైరెక్ట్ గా కథలు విని సీరీస్ నిర్మించే గేమ్‌ప్లాన్‌ను కొద్దిగా ఛేంజ్ చేసి దూకుడు పెంచి దసరాకు విడుదలైన ‘గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్’ హక్కులు కొనుగోలు చేసింది. అంతే కాదు మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ రైట్స్ కూడా 50 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ‘పుష్ప 2’ రైట్స్ కోసం భారీ ఆఫర్ ఇచ్చిందట. ఎలాగైనా అమెజాన్ ప్రేమ్ కి ఇండియాలో చెక్ పెట్టాలని, అందులో భాగంగా తెలుగు వారి ఆదరణ పొందాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది. మరి నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.