Israel PM: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మొసాద్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ హమాస్ దాడి గురించిన వివరాలు ముందుగా రాకపోవడంపై అందర్ని ఆశ్చర్యపరిచింది. ఎక్కడా కూడా విషయం బయటకు పొక్కకుండా హమాస్ దాడి చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయమై సొంత సైన్యంపైనే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన విమర్శలు ఇప్పడు వివాదాస్పదమయ్యాయి. హమాస్ దాడి గురించి తనకు ఏ సమయంలోనూ, ఏ దశలోనూ హెచ్చరికలు ఇవ్వలేదు. ఆర్మీ ఇంటెలిజెన్స్, షిన్ బెట్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆయన వ్యాఖ్యలపై సొంత కేబినెట్, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఇజ్రాయిల్ ప్రధాని క్షమాపణలు చెప్పారు. నేను తప్పు చేశాను, తాను ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, క్షమాపణలు కోరుతున్నానని ఎక్స్(ట్విట్టర్)వేదికగా తెలిపారు. తాను భద్రతా శాఖ అధిపతులందరికీ పూర్తి మద్దతు ఇస్తున్నానని అన్నారు.
Read Also: Bihar: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిలో వ్యక్తి డెడ్‌బాడీ..
అంతకు ముందు నెతన్యాహూ చేసిన వ్యాఖ్యల గురించి మాజీ రక్షణ మంత్రి బెన్ని గాంట్జ్ తో సహా ఇతరులు మందలించారు. నెతన్యాహూ చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఎక్స్ లో గాంట్జ్ కోరారు. మనం యుద్ధంలో ఉన్నప్పుడు, నాయకత్వం బాధ్యతను చూపించాలి, సరైన పనులు చేయాలని నిర్ణయించుకోవాలి, బలగాలను బలపరచాలి, తద్వారా వారు మనం కోరిన వాటిని అమలు చేయగలరని అని గాంట్జ్ చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ ప్రతిపక్ష నతే యాయిర్ లాపిడ్ కూడా తప్పుపట్టారు. ప్రధాని రెడ్ లైన్ దాటారు. ప్రస్తుత పరిస్థితుల్లో బద్రతా బలగాలపై నింద మోపుతూ.. ప్రధాని బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. హమాస్, హిజ్బుల్లాకు వ్యతిరేకం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పోరాడుతున్నాయి, వాళ్లకు మద్దతుగా ఉండాల్సిన సమయంలో సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.