నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ రివర్స్ గేమ్ ఆడిందా? నెగ్గలేమని తెలిసి కూడా.. పావులు కదిపి అధికార పార్టీని గిల్లి గిచ్చి… గబ్బులేపుదామని భావించిందా? ఆ విషయంలో ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయింది? సైకిల్ నాయకులు ఫ్యాన్ ట్రాప్‌లో పడ్డారా? దాని గురించి జిల్లాలో ఏమనుకుంటున్నారు?
నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నోటీసులు ఇవ్వడం, గతంలో వైసీపీ నుంచి సైకిలెక్కిన కొందరు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరడం, అధికార పార్టీ అలర్ట్ అయిపోయి… క్యాంప్‌లు పెట్టేయడం లాంటి వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశం అయ్యాయి. రకరకాల ఆసక్తికరమైన మలుపుల తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఈ కథకు ఎండ్ కార్డ్ వేశారు మేయర్. అయినా పొలిటికల్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు. అవిశ్వాసం విషయంలో వైసీపీ తీసుకున్న స్టాండ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇక 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక 40 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఈ క్రమంలో మేయర్ స్రవంతిని పదవి నుంచి తప్పించేందుకు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది తెలుగుదేశం. చేరికలతో టీడీపీ బలం 40కి పెరగ్గా….. వైసిపి బలం 12 మంది సభ్యులకు పడిపోయింది. కానీ…మేయర్ కూడా వైసీపీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా అలాగే ఉన్నందున ఈ పరిస్థితుల్లో… స్రవంతికి అనుకూలంగా వ్యవహరించలేమని, సరిపడా సంఖ్యాబలం కూడా లేనప్పుడు అనవసర వ్యవహారమని జిల్లా వైసీపీ నేతలు తాడేపల్లి హెడ్డాఫీస్‌కు చెప్పేశారట. సరిగ్గా అక్కడే వైసీపీ పెద్దలు ఆలోచనలకు పదునుపెట్టి…పావులు కదిపినట్టు తెలిసింది. మేయర్ మన పార్టీకి రాజీనామా చేసినా… ఎటూ వెళ్ళలేదు కాబట్టి నో ప్రాబ్లమ్. అలాగే… ఈ పోటీలో గెలుస్తామా, ఓడతామా అన్నది అనవసరం.
అసలు గెలుపు ముఖ్యం కాదు. మేటర్‌ని కెలికి వదిలేద్దాం…. తర్వాత చర్చలు వాటంతట అవే జరుగుతాయని వైసీపీ పెద్దలు నెల్లూరు నేతలకు చెప్పినట్టు తెలిసింది. దీనివల్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశం అవుతుందన్నది ఫ్యాన్ పెద్దల అంచనా. అందులో భాగంగానే పార్టీ మారిపోయిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైసీపీ గూటికి తీసుకువచ్చారట. అయితే… ఆ ఎఫెక్ట్‌తో టీడీపీ అలర్ట్ అయిపోయింది. క్యాంప్ రాజకీయాలకు తెరలేపడంతో… వైసీపీ అనుకున్నట్టుగానే నెల్లూరు మేయర్ ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశం అయింది. బలం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… తమ కార్పొరేటర్స్ అందర్నీ లాక్కుని చివరికి తమనే ఇబ్బంది పెడుతోందన్న విషయాన్ని చర్చనీయాంశం చేయగలిగామని భావిస్తున్నారట వైసీపీ లీడర్స్. వాస్తవానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీ బలం సున్నా. కానీ… అధికారంలోకి రాగానే వైసీపీ కార్పొరేటర్స్ చేరికతో బలం పెరిగింది. ఈ క్రమంలో తమ పార్టీని చెందిన నాయకులకు మేయర్ పదవి కట్టబెట్టాలన్న ప్లాన్‌తో స్రవంతి మీద అవిశ్వాసానికి సిద్ధమైంది. ఆ వ్యవహారం సాఫీగా సాగి ఉంటే.. ఇది జిల్లా ఇష్యూ మాత్రమే అయ్యేది. కానీ…చివరి అంకంలో వైసీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదిపి స్టేట్ ఇష్యూ చేయగలిగిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. పార్టీ మారిన ఐదుగురిని తిరిగి చేర్చుకుని వైసీపీ గిల్లగానే… ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు… వాళ్ళ గిల్లితే గిల్లిచ్చుకోవడానికి మేం సిద్ధంగా లేం. పవర్‌లో ఉన్నాం. మేం రక్తం కారేట్టు రక్కుతామని రెచ్చిపోయి క్యాంప్ పాలిటిక్స్‌కు తెరలేపారు. సరిగ్గా అక్కడే వైసీపీ ట్రాప్‌లో పడ్డారని, ఆ వైఖరినే ప్రతిపక్షం అడ్వాంటేజ్ తీసుకుని రచ్చ చేయగలిగిందన్నది పొలిటికల్ సర్కిల్స్ వాయిస్.
పైగా ఇక్క ఇంకో నెగెటివ్ ప్రచారం కూడా మొదలైపోయింది. స్రవంతి ఎస్టీ మహిళ. ఈ పాయింట్‌నే హైలైట్ చేస్తూ… అప్పుడు మేం ఎస్టీ మహిళకు ప్రాధాన్యం ఇచ్చి అందలం ఎక్కిస్తే… టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించి ఆమెను పదవి నుంచి తప్పించిందంటూ ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆయా సామాజికవర్గాల్లో అధికార పార్టీని విలన్‌గా చూపేందుకు ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందన్నది ప్రతిపక్షం ప్లాన్ అట. జగన్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరిన ఓ కార్పొరేటర్‌ను అరగంట లోపే పోలీసులు అరెస్టు చేయడం, పార్టీ నేతలు నవాబుపేట పోలీస్ స్టేషన్ దగ్గర రచ్చ చేయడం కూడా.. ఫ్యాన్ పార్టీకి కలిసి వచ్చిందని అంటున్నారు. ఆ ఎపిసోడ్‌తో నెల్లూరులో ఏం జరుగుతోందోనని రాష్ట్రం మొత్తం ఇటు చూసినట్టు భావిస్తున్నారు. గెలవకపోయినా పర్లేదు గానీ.. ఇష్యూని గెలికి వదిలిపెడితే.. మైలేజ్ వస్తుందన్న వైసీపీ ప్లాన్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోందని అంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు.