Home Loan Scheme: పట్టణాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇళ్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చౌకగా గృహ రుణాలు అందించే పథకాన్ని తీసుకురానుంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయడానికి దగ్గరగా ఉందని, దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. “ప్రభుత్వం కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌తో ముందుకు వస్తుంది, ఇది నగరాల్లో నివసించే నిరుపేద ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వడ్డీ రేట్లలో ఉపశమనంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి మేము వారికి సహాయం చేస్తాము.” అని ప్రధాని మోడీ తెలిపారు.
Also Read: S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్
ఈ పథకం కింద బలహీన వర్గాలకు తక్కువ వడ్డీలకు గృహ రుణాలు అందించబడతాయి. వడ్డీ రాయితీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, రీటైల్ రంగంపై దాని ప్రభావం గురించి కూడా చర్చించారు. ముడిచమురు ధర బ్యారెల్‌కు 96 డాలర్లకు చేరిందన్నది వాస్తవమని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడు ధరలు పెరిగినా భారత్‌లో ధరలు ఐదు శాతం తగ్గేవి. ప్రధాని తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం రెండు పర్యాయాలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆయన వెల్లడించారు.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంపై కేంద్ర మంత్రి దాడి చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే బెంగాల్ లాంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.11.80 పెరగడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ పరిస్థితి పూర్తిగా తప్పని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నాయని, దీనిపై బీజేపీయేతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.