ఆంధ్రప్రదేశ్ లో అడగడుగునా అత్యాచారాలు, వేధింపులు. అసలు శాంతిభద్రతలు వున్నాయా అనే అనుమానం కలుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో నేరాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అన్నారు.
మహిళా హోంమంత్రి వనిత అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయ్ అని మాట్లాడటం అన్యాయం. విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహిత పై అమానవీయంగా దాడి చేసి పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డటం దారుణం. జే బ్రాండ్ లిక్కర్ తాగి ఉచ్చ నీచాలు మరిచి అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
గాయపడిన మహిళకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాల ఘటనలతో అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుంది. దిశ చట్టం పేరుతో చేసిన మోసం చాలు. మహిళలు బయటకి రావాలంటేనే భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.