Chandrababu Arrest: ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఈ రోజు ములాఖత్ లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు.. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు.. అయితే, చంద్రబాబుతో భేటీ సందర్భంగా జనసేనతో పొత్తు అంశం ప్రస్తావన వచ్చిందట.. పార్టీ తరఫున సమన్వయ కమిటీ సభ్యుల నియామకం అంశం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేరట యనమల.. అయితే, లోకేష్ ఢిల్లీ నుంచి రాగానే చర్చించి త్వరగానే సభ్యులను నియమిద్దామన్న చంద్రబాబు చెప్పారట.. ఇప్పటికే తెలుగుదేశం – జనసేన శ్రేణులు దేశవిదేశాల్లో కలిసి కార్యక్రమాలు చేస్తున్న తీరు బాబుకు వివరించారు యనమల.. తనను జైల్లో పెట్టి జగన్ పొందుతోంది తాత్కాలిక ఆనందమేనని ఇక వైసీపీ పనైపోయిందన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారట.
మరోవైపు.. భువనేశ్వరి, బ్రాహ్మణిలతో దాదాపు 20 నిమిషాలు విడిగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారట చంద్రబాబు.. ఇదే సమయంలో యనమలతో ప్రత్యేకంగా 10 నిమిషాలు విడిగా సమావేశమయ్యారట.. మొత్తంగా ములాఖత్‌లో చంద్రబాబు.. ముగ్గురూ 40 నిమిషాల పాటు చర్చించారు.. చంద్రబాబును ఎలా ఉన్నారంటూ యనమల అడగగా.. నేను బానే ఉన్నా, క్యాడర్ ని, నేతల్ని ప్రభుత్వం కక్షతో వేధించటమే బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారట.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అండగా నిలవాలని యనమలకు సూచించారట.. రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలనని.. కానీ, ప్రభుత్వ అరాచకాలపై పోరాటం ఆపొద్దని చంద్రబాబు స్పష్టం చేశారట..
ఇక, జైల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయని చంద్రబాబుని అడిగారు యనమల రామకృష్ణుడు.. ఏసీ లేకపోవడం, విపరీతమైన దోమలు లాంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా తాను తట్టుకోగలనని చంద్రబాబు బదులిచ్చారట.. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా సీనియర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.. తన అరెస్టును ఖండిస్తూ సంఘీభావం తెలిపిన జాతీయ నాయకులందరికీ పేరు పేరునా తాను కృతజ్ఞతలు చెప్పిన సందేశం పంపాలన్న యనమల రామకృష్ణుడికి సూచించారట చంద్రబాబు నాయుడు.