Nallamilli Ramakrishna Reddy: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్ వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అనపర్తి టికెట్ వ్యవహారం అసంతృప్తి జ్వాలలకు కారణం అవుతోంది.. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ స్థానం వెళ్లిపోవడంతో.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు.. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను కూడా దగ్ధం చేశారు.. అయితే, నేటి నుండి అనపర్తి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల ముందుకు వెళ్లనున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. అనపర్తి టిక్కెట్ విషయమై తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెబుతున్నారు.
అనపర్తి, రంగంపేట, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. రోజుకు ఒక్కొక్క మండలంలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు.. ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తే.. టిక్కెట్ విషయంలో టీడీపీ అధిష్టానం అన్యాయం చేసిందని ఆవేదనతో ఉన్నారు నల్లమిల్లి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ తనకు టిక్కెట్ రాకుండా కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు.. ఇక, నాలుగు రోజుల పర్యటన అనంతరం కార్యకర్తలతో సమావేశం కానున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ప్రజల అధిష్టానం మేరకు నిర్ణయం ఉంటుందని అంటున్నారు.. అయితే, టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలంటూ ఆయన అనుచరుల నుంచి రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెరుగుతోందట.. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారట.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారట.. కానీ, తాను నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించానని చెబుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనపర్తి మండలం మహేంద్రవాడ నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటన ప్రారంభం కానుంది.. ఈ పరిణామాలు అనపర్తిలో ఎలాంటి వాతావరణన్ని సృష్టిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.