రాష్ట్రంలో ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలతో పాటు తెలంగాణ శాసన మండలిలో నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్ట భద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కాని ప్రస్తుతం ఆ పార్టీకి ఈ ఎన్నిక సవాలుగా మారనుంది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. కానీ, తెలంగాణ శాసనసభకు 2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక వ్వడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. 2014 ముందు నుంచీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరసగా నాలుగు పర్యాయాలుగా గెలుస్తూ వస్తోంది. మొదట కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు, ఆ తర్వాత రెండు సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.
2021 మార్చిలో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 76 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ జరగడం విశేషం. విజేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,11,190 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) కు 83,629 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో నిలిచి 70,472 ఓట్లు తెచ్చుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ లు ఆ తర్వాతి స్థానాలకే పరిమితమయ్యారు.
ప్రధాన పార్టీలను పక్కకు తోసి రెండో స్థానంలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న చింతపండు నవీన్ ఇపుడు అధికార కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీకి దిగనుండడం ప్రస్తుతం జరగనున్న ఎన్నికల విశేషం. మే నెలలో ఈ ఎన్నిక బీఆర్ఎస్ కు సవాలుగా మారనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు సార్లు గెలిచినా.. ఈ సారి మాత్రం కష్టమని పలువురు అంటున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ప్రధానంగా విస్తరించి ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటింది. అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా నిలువనుంది. అంతే కాకుండా గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలనే కష్ట తరంగా ఎదుర్కొంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నియోజకవర్గ ఎన్నికకు మే 27వ తేదీన ఓటింగ్ జరగనుండగా, జూన్ 5వ తేదీన విజేతను ప్రకటించనున్నారు.