MLA Vasantha Krishna Prasad: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతున్న కారణంగా స్లో అయ్యానని ఆయన అన్నారు. మైలవరం ఇంఛార్జి ఇచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. తాను వర్గాలకు అతీతంగా పనిచేసి గ్రూపులను ప్రోత్సహించను అని చెప్పానన్నారు. పార్టీ మారేదు లేదు, పనిచేస్తే వైసీపీ నుంచే పని చేస్తా అన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.
Read Also: AP Assembly Sessions: ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
కానీ కొన్ని సంఘటనల వల్ల చాలా బాధ పడ్డానన్నారు. నియోజకవర్గంలో కొంత భాగానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు. మైలవరంలో గ్రూపులను ప్రోత్సహించారని.. వైసీపీ వాళ్ళే కొండపల్లి మున్సిపాలిటీని ఓడించారని ఆయన ఆరోపించారు. మైలవరంలో జరిగే అన్ని ఇబ్బందులను .. రాజకీయ ప్రత్యర్ధి కంటే సొంత పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నట్టు పార్టీ పెద్దలకు చెప్పానన్నారు. మైలవరంలో ఇబ్బందులను జగన్ సహా అందరికీ ఫిర్యాదు చేశానన్న ఆయన.. పెద్దిరెడ్డి తప్ప ఎవరూ కూడా ఈ విషయంలో స్పందించలేదన్నారు. సీఎం సమక్షంలో నియోజక వర్గ కేడర్‌ను తీసుకువెళ్తే కూడా అక్కడ క్లారిటీ ఇవ్వలేదన్నారు. 2014లో గెలవని, 2019లో నన్ను గెలిపించలేని వ్యక్తి నన్ను 2024లో గెలిపిస్తారని చెప్పటం బాధ కలిగించిందన్నారు. అందుకే తాను పార్టీలో నెమ్మదించానన్నారు. అభివృద్ది లేని సంక్షేమం వల్ల ఇబ్బందులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నియోజక వర్గంలో పనిచేసిన వారు బిల్లులు రాక రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కన్సల్టెన్సీతో వైసీపీ నడుస్తోందని.. అందువల్లే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తెలియటం లేదన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని తాను చెప్పానన్నారు. 2019 ఎన్నికల ముందే నేను రాజధాని గురించి జగన్‌ను అడిగితే ఆయన ఇదే రాజధాని అని చెప్పారని.. రాజధాని విషయంలో సెక్రటేరియట్ అమరావతిలో ఉంచాలని, అసెంబ్లీ విశాఖలో పెట్టాలని సీఎ జగన్‌కు సూచన చేశానన్నారు. తాను మొన్నటి వరకు రాజకీయాలకు స్వస్తి పలికి వ్యాపారం చేయాలని అనుకున్నానని.. తన శ్రేయోభిలాషులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.